“తెలుగు వ్యాకరణములు - పునస్సమీక్ష” అన్న అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు (సెప్టెంబరు 12,13 తేదీలలో) ఈ రోజు ఉదయం 11.30 ని.లకు ప్రముఖుల సమక్షంలో, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయింది.
ఈ సదస్సు ప్రారంబోత్సవ సభకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భాషా శాస్త్రవేత్త, పూర్వాశ్రమంలో ఉప కులపతి అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు సభాధ్యక్షత వహించారు.
ఈ జాతీయ సదస్సు నిర్వాహకులలో ఒకరిగా వ్యవహరిస్తున్న డా. రేమిల్ల వెంకట రామకృష్ణ శాస్త్రిగారు మాట్లాడుతూ — తెలుగులో నన్నయ కాలం నుండి నేటి వరకు ఎన్నో వ్యాకరణాలు వచ్చాయనీ, అయితే, వాటికి సంబంధించిన విశేషాంశాల గురించే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన/మారుతున్న నేటి భాషకు అనుగుణంగా ఎలాంటి ఆధునిక వ్యాకరణాలు రావాలన్న విషయాన్ని కూడా చర్చకు పెట్టాలనుకోవడం ఈ సదస్సు ముఖ్యోద్దేశ్యం అన్నారు.
ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు తమ ప్రసంగం మొదట్లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఉప కులపతి (వైస్ చాన్స్ లర్)గా పని చేసిన నాటికి, నేటికీ యూనివర్సిటీ ఎంతో మార్పు చెందిందన్నారు.
వ్యాకరణాల గురించి మాట్లాడుతూ - సంప్రదాయ వ్యాకరణాలన్నింటినీ చదివాననీ, వ్యాకరణాలపై ఆసక్తి పెరగడానికి తన గురువుగారే కారణమనీ, తన గురువుగారయిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు వ్యాకరణ పాఠాన్ని కూడా కావ్య పాఠంలా చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, భాషా శాస్త్రం చదువుకున్నాక వ్యాకరణాలపై అంతవరకూ ఉన్న దృష్టి కోణం మారిందని చెప్పారు.
ప్రాచీనుల, ఆధునికుల దృష్టికోణాలలో వ్యాకరణ ప్రయోజనాన్ని వివరిస్తూ —
ప్రాచీనుల దృష్టిలో వ్యాకరణ ప్రయోజనం కావ్యభాషలో సాధు,అసాధు ప్రయోగాలను నిర్ణయిచడానికి, భాషలో ఉచ్చారణ దోషాలను నివారించడానికి పరిమితమైందన్నారు. ఈ సందర్భంగా వ్యాకరణ ప్రయోజనాన్ని గురించి తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని ఉదహరించారు.
యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం
స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్
(భావం: నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా మానె కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (మంచి పని) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని పలకకుండా ఉండడానికి - అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.)
చిన్నయసూరి కాలానికి కావ్య భాషలో వ్యావహారికం వచ్చినా ఆయన కేవలం కవిత్రయ ప్రయోగాలనే తన వ్యాకరణానికి ప్రమాణాలుగా స్వీకరించాడన్నారు. వీరి కాలం వరకూ (ప్రాచీనుల దృష్టిలో) వ్యాకరణం అంటే ఒక భాషను ఎలా వ్యవహరించాలో తెలుపుతూ రాయబడిన కొన్ని నియమాల గ్రంథమనీ, అంటే ఇలా రాస్తేనే వ్యాకరణం అనే అభిప్రాయం ఉండేదన్నారు.
ఆధునికుల దృష్టిలో - ఒక భాషకు రాస్తేనే వ్యాకరణం అనడం సరికాదనీ, మాతృభాషా వ్యవహర్తకు భాషకు సంబంధించిన నియమాలు అంతర్గతంగా తెలిసి ఉంటాయనీ, బాల్యంలోనే పరిశీలన వల్ల ఇది సాధ్యమవుతుందనీ, ఎంచేతనంటే భాష అంటేనే నియమం, నియతి కలిగి ఉండేది కనుక… అన్నారు. దీనినే చేకూరి రామారావుగారు ‘గుప్త వ్యాకరణం’ అన్నారని చెప్పారు.
మాతృభాషలో మాట్లాడుతున్నవాడు పండితుడయినా, పామరుడయినా, ఏ ప్రాంతం వాడయినా (మాండలికాలు), ఎవరయినా సరే వాడు పలికే వాక్యం వ్యాకరణ విరుద్ధం కాదని చెప్పారు. ఇక వ్యాకరణాలు చదవడం ఆ వ్యాకర్త ఉద్దేశించినవేమిటో తెలుకోవడానికే అయిఉండాలన్నారు.
సభాధ్యక్షత వహించిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి ప్రసంగంలోని కొన్ని విశేషాంశాలపై తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. పరిశోధక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పత్ర సమర్పణ చేయడానికి ఉత్సాహం చూపించడాన్ని హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ — జాతీయ సదస్సు అనుకున్న సమయం కంటే కాస్త ఆలస్యంగా ప్రారంభమవడానికి “మార్గాలు” కారణమని, ఈ మధ్య కాలంలో భాగ్యనగర మార్గాలు “దుర్మార్గాలు” కావడంతో ప్రయాణాలు అనుమానాస్పదాలయ్యాయనడంతో సభలో నవ్వులు కురిసాయి. వీరి ప్రసంగం ఆద్యంతం చమత్కారయుతంగా సాగింది.
భోజన విరామానంతరం ఆచార్య నడుపల్లి శ్రీరామ రాజు గారి అధ్యక్షతన జరిగిన పత్ర సమర్పణ కార్యక్రమంలో అమరేశ్వరం రాజేశ్వర శర్మ, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య సుమతీ నరేంద్ర, ఆచార్య ఉషాదేవి, డా. సంగంబొట్ల నరసయ్య, చుండూరు మాణిక్యం, జాడ సీతాపతి, శ్యామలాంబ తమ పత్ర సమర్పణ చేశారు.
ఈ జాతీయ సదస్సులో రెండవ రోజు మరిన్ని పత్ర సమర్పణలు జరగనున్నాయి.
(హైదరాబాదు విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి కేశవాచారిగారి నివేదిక)

పాఠకుల అభిప్రాయాలు