ఫిబ్రవరి, 2007ను భద్రపఱచు

కృతజ్ఞతలు…

“తెలుగు సాహిత్య వేదిక” పాఠకులకు అభివందనం. పెద్దగా హంగులూ, ఆర్భాటాలూ, ప్రకటనలూ లాంటివి ఏమీ లేకుండానే ప్రారంభమయిన ఈ సాహితీ పత్రిక అప్పుడే రెండవ సంచికలోకి ప్రవేశించింది.

ఇంటర్నెట్ పాఠకులకు సమకాలీన సాహిత్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటూ, తెలుగు బ్లాగుల లోకంలోకి సాహిత్య విద్యార్థుల ప్రవేశానికి దారులు వేయాలన్న మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందన్న నమ్మకం మాలో కలిగింది. అందుకు కారణం మీ స్పందనే! పత్రిక మొదటి సంచిక సందర్భంగా మీ విశేషాదరణ మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. సాహిత్య వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చదిద్దాలన్న ఉత్సాహాన్ని కలుగజేసింది.

ముందే అన్నట్లుగా సరికొత్త శీర్షికలను ఆరంభించబోతున్నాంఅభిప్రాయాల, రచనల ప్రకటనకు ఈ పత్రికను వేదిక చే్సుకోవాలనే ఔత్సాహికులను ఎల్లవేళలా ఆహ్వానిస్తున్నాం 

ఇంతవరకులానే ఇకముందు కూడా మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు లభిస్తాయని ఆశిస్తూ

మాలో ఎన్నో కొత్త   ఆలోచనల్ని రేకెత్తించిన మీ స్పందనకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ

- తెలుగు సాహిత్య వేదిక

అన్నమయ్య పద అన్వేషణలో…

- డా. పిల్లలమర్రి రాములు,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అన్నమయ్య ప్రారంభించిన పదకవిత్వం తెలుగు సాహిత్యంలో నూతన కవితా సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. ఆయన రచించినట్లుగా చెప్పుకునే 32 వేల సంకీర్తనల్లో దాదాపు 14.5 వేల సంకీర్తనలే లభ్యమయినా, అవి అనంతమైన వైవిధ్యానికి, నూతన భావ ప్రకటనకు వీలు కల్పించిన రచనలు. ఆయన రచనల పట్ల ఎంత ఆకర్షణ ఉందో, అన్నమయ్య వ్యక్తిగత జీవితమూ అంతటి ఆసక్తిదాయకం. అన్నమయ్య కవిత్వంతో పెనవేసుకొనిపోయిన ఆయన జీవితాన్ని నేటికీ తెలుగులో అనేకమంది పరిశోధకులు వివరించి ఉన్నారు. సంప్రదాయంలో వినూత్నంగా, విశిష్టంగా ఆవిష్కృతమైన గ్రంథం – ‘God on the Hill’ . అన్నమయ్య రచనల్లో ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే నూరు ప్రాతినిధ్య కవితలను ఆంగ్లంలోకి అనువదించారువిఖ్యాత పరిశోధక, అనువాదకులు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ గారులు. తెలుగు సాహిత్యంతో గాఢమైన అనుబంధం మాత్రమేగాక, సొగసైన ఆంగ్లంలో పెట్టగలిగిన కవితా హృదయులు గావడం వల్ల అన్నమయ్య పాదాలకు ఎంతటి లాలిత్యమూ, సౌకుమార్యమూ ఉన్నాయో, ఆంగ్లంలోనూ అంతటి మార్దవం సమకూర్చారీ అనువాదకులు.

అన్నమయ్యను ఆంగ్లంలో పరిచయం చేసినవారిలో అడపా రామకృష్ణ రావు గారి కృషి శ్లాఘనీయం. వారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ కోసమై రాసిన పుస్తకంలో అన్నమయ్యను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించి ఉన్నారు. కానీ, పుస్తకం పరిధి చిన్నది కావడం వల్ల పరిమితులున్నాయి. ప్రస్తుతానువాద గ్రంథం విస్తృతమైనదేగాక, కవితానువాదాన్ని గ్రహించి తర్వాత కవి రచన కాలం నాటిదో, సందర్భంలో కావ్యం వెలువడిందో వివరించే విపుల పరిశోధనాత్మక వ్యాసం సమకూర్చడం అనువాదక పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక కృషి.

అన్నమాచార్య జీవితాన్ని అధ్యయనం చేయడానికి గొప్ప ఆకర గ్రంథంఆయన మనవడే ( తాళ్ళపాక చిన్నన్న/ తిరువేంగళనాథుడు ) రచించినఅన్నమాచార్య జీవిత చరిత్రము’. అది చిన్న ద్విపద కావ్యమే అయినా వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఎంతో విపులమైన పీఠిక సమకూర్చి అన్నమాచార్య జీవితానికి, కవిత్వానికి ఉన్న సంబంధాన్ని అతి సమర్థంగా స్థాపించారు. నేటికీ ప్రభాకర శాస్త్రి గారి పీఠిక మౌలిక విషయాలను గ్రహించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. అన్నమాచార్య సాహిత్యాన్ని లోకానికి పరిచయం చేయడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు చూపిన వైదుష్యం లోకమంతా గౌరవించింది. అనువాదక, పరిశోధక గ్రంథంలోనూ వారి కృషిని స్మరించడం అనువాదకుల విజ్ఞతకు నిదర్శనం.

అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలుఅలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడుఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు. సందిగ్ధావస్థలోని సంక్లిష్ట స్థితిని పరిశోధకులు అతి సున్నితంగా విశదీకరించారుతమ After word లో.

అన్నమాచార్య సంకీర్తనలను, వాటి అనువాదాలను క్రింద పొందుపరచదలిచాను. మానవుని ఏకాగ్రతా స్వరూపమే దైవమని వర్ణించడానికి అన్నమయ్య మంచి సంకీర్తన కూర్చారు -ఆయన,

చూచే చూపొకటి సూటి గుఱియొకటి

తాచి రెండు నొకటైతే దైవమే సుండి…” ( )

Seeing is onething,

Looking is another,

Of both come together

That is god.

యేనుగ దలిచితే యేనుగై పొడచూపు

మాను దలచిన నట్టేమానై పొడచూపు

పూసి పెద్దకొండ దలపోయ గొండై పొడచూపు

తానే మనోగోచరుడు దైవమే సుండి

If you look for an elephant

He comes as an elephant

If you look for a tree

He’s a tree.

If you look for a mountain,

He”ll be a mountain

God is what you have in your mind.

నాటికి నాడే నా చదువు

మాటలాడుచును మఱచేటి చదువు -

I study just for the day,

for getting as i learn

ఎనయనీతని నెఱుగుటకే పో

వెనకవారు చదివిన చదువు

మనసున నీతని మఱచుటకే పో

పనివడి యిప్పటి ప్రౌఢ చదువు -

They used to study

to find god.

Now we study

to forget him.

అన్నమయ్య సంకీర్తనలు లౌకికజీవిత స్వరూపాన్ని, అందులోని మాయను, అవగాహన చేసుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తాయి. అటువంటి పదాల్లో ఒకటి

ఒక్కటి తరువాత వేరొకటైన కాచుకుండు

చక్క దెరనాటకము సంగతి సంసారము … ( )

వొండె నాపద దీరితే నొండె సంపదైన వచ్చు

అండనెన్నడు దీరదు హరిదలచ

తండోప తండములై తలమోపులు పనులు

చండిపెట్టి పనిగొను సంసారము … (ఒక్క )

పద్యానికి అనువాదం

When you are done with one puppet,

Another will be waiting

Life is a play of shadows on the screen.

If you get rid of poverty , you’re stuck with riches.

You’ll never have time to think of god.

There’s allways a zillion things to do.

Life wips you, like a bonded slave.

అన్నమాచార్య సంకీర్తనల్లోని…

కడలుడిపి నీరాడగ దలచు వారలకు

కడలేని మనసుకు గడమ యెక్కడిది -

You say you want to bathe

When the waves subside

Is there an end

To the endless waves?

దాహమణిగిన వెనుక తత్వమెరిగెదనన్న

దాహమేలణుగు తా తత్వమేమెరుగు

దేహంబు గలయన్ని దినములను బదార్థ

మోహమేలుడుగు దాముదమేల కలుగు -

You say, “Let me quench my thirst,

and then I’m find the truth”.

Why should thirst be quenched?

How can you know truth?

వెఱ్ఱులాల మీకు వేడుక గలి(గి)తే

అఱ్ఱువంచి తడుకల్లంగ రాదాఅన్న మధురమైన గేయంలోతడుక’ అనే మాటను ‘basket’ అని ( Try basket weaving ) అనువదించడం సరిగా కుదిరిందాయని అనుమానం. అంతే గాదు, అన్నమయ్య సామాజిక అవగాహన ప్రదర్శించే ఉత్తమ కవితా ఖండికలు అనువాదంలో రాలేదు. ఆయన శ్రమ విలువ ప్రతిపాదిస్తూ, అనువాదంలో రాలేదు. ఆయన శ్రమ విలువ ప్రతిపాదిస్తూ,

మహినుద్యోగి గావలె మనుజుడైన వాడు

సహజివలె నుండేమీ సాధింపలేడుఅని చెప్పే గేయాన్ని, జీవితం పట్ల ఉండదగిన అవగాహనను గూర్చి,

కంతలేని గుడిశొక్క గంపంతైనంజాలు

చింతలేని యంబలొక్క చేరడే జాలు

జతగాని తరుణి యే జాతైన యదేచాలు

వితలేని సంపదొక్క వీసమే చాలుఅని చెప్పే గొప్ప గేయాన్నిగాని, కేవల బాహ్యాచారాల వల్లనే మనిషికి ఔన్నత్యం సమకూరదని చెప్పే,

మిక్కిలి నీట మునింగే మీనుకది స్నానమా

నిక్కి ఆకుమేయ నింనిది తపమా

పులులు గుహలనుంటే పొల్లింప ఋషులా

యిల బక్షులాకాశానకేగితే దేవతలా…” లాంటి గేయాలను అనువదించి ఉంటే సంపుటికి మరింత సమగ్రత్వం చేకూరేదని అనిపిస్తుంది. ప్రశ్నే ఒకసారి నారాయణరావుగారికి వేస్తే అనువాదంలో ఒదగకపోవడం వల్ల గూడా మంచి పద్యాలను కొన్నింటిని వదిలివేసినట్లుగా చెప్పారు. ఏమైనా తెలుగు కవిత్వాన్ని ప్రపంచానికి కళాత్మకంగా, పరిశోధనాత్మకంగా పరిచయం చేయడం అత్యంత ప్రశంసనీయం, పరమ ఆదరణీయం.

తెలుగు సాహిత్యంభద్ర పరచాల్సిన’ భాషగా పరిగణింపబడకుండా సజీవభాషగా వెలుగొందడానికి, మూలభాషలోని రామణీయకతను గ్రహించడానికి అనువాదాలు ఉపయోగపడితే రచయితలే గాదుతెలుగు వ్యవహర్తలందరూ హర్షిస్తారు.

(హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య పరిమి రామనరసింహంగారి షష్టిపూర్తి అభినందన సంచిక “పరా వాఙ్మయి” సౌజన్యంతో.)

అడవితో యుద్ధం – అదో నైతిక విజయం

-డా. జె. భీమయ్య,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపుల పల్లి అనే గ్రామంలో మార్చి 10, 1946 లో జన్మించాడు. ఆధునిక నవలా రచయితగా పేరున్న కేశవరెడ్డి వృత్తి పరంగా వైద్యుడు. ఆయన రచించిన అతడు అడవిని జయించాడుఅనే నవల అద్భుతమైనది. లోతైన కథావస్తువుతో నిమిడీకృతమై రూపొందిన నవల. పరిమాణంలో చిన్నదైనా పాఠకుని మనసులో చెరగని ముద్ర వేస్తుంది. అట్టడుగు మరియు నిమ్నవర్గాల జీవనశైలి, వారి ప్రతిభా పాటవాలు, భాషా సంస్కృతి మొదలైన సామాజిక, స్వాభావిక, సహజత్వ ఆంశాలను ప్రతిబింబించే నవల అతడు అడవిని జయించాడు“.

కేశవరెడ్డి వృత్తి రీత్యా వైద్యుడే అయినా, ప్రవృత్తి రీత్యా సాహిత్య రచన పట్ల ఆయనకున్న అభినివేశం, ఆసక్తి, ఆలోచన అమోఘమైనది. జీవనపోరాటం, బతుకు దుర్బరత్వం మొదలైన పీడిత లక్షణాలు వ్యక్తిగతంగా ఆయన అనుభవంలో లేకపోయినా, తన నిశిత పరిశీలన, ఊహాత్మక పరిశోధన ద్వారా పీడిత వర్గాల సంస్కృతిని తన కలం నుండి జాలువారించారు. ఆయన కున్న సామాజిక ఆర్థిక నేపథ్యం వేరు కావచ్చు. అయినా సామాన్య ప్రజల ముఖ్యంగా గిరిజన తెగల భాషా సంస్కృతికి తాను దగ్గరగా జీవించిన వైనం ఈ నవలలో కనిపిస్తుంది. తన జీవన సామాజిక పరిస్థితులు తన కలాన్ని ప్రభావితం చేస్తున్నాయా? అని అనుకోవటానికి ఆధారాలు మనకు కనపడవు.ఈ నవలలో ముసలి వాడి బతుకు పోరాటాన్ని రచయిత వర్ణించిన తీరు స్వాభావికతను సంతరించుకున్నది. ఎరుకల తెగ (కులం) కి చెందిన ముసలివాడి పేరు నవలలో ఎక్కడా ప్రస్తావించటం జరగలేదు. ముసలివాడి జీవన పోరాటాన్ని ఒక వ్యక్తి పోరాటంగా కాక గిరిజన తెగ పోరాటంగా, ఇంకా కొంత విశాల దృక్పథంతో ఆలోచిస్తే పీడిత ప్రజల బతుకు పోరాటంగానూ అర్థం చేసుకోవచ్చు. ముసలి వాడిని అడవిరాజ్యం లో గిరిజన తెగల ప్రతినిధిగా చూడాలి.

ఈ నవల పద్నాలుగు భాషల్లోకి అనువదింపబడటం ఒక ప్రత్యేకత. రాయలసీమ ప్రాంతపు గిరిజన తెగల భాషా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పుస్తకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ నవలలో ఒక ముసలివాడు కథానాయకుడు. నిమ్న వర్గాలను కథానాయకులుగా నిలబెట్టడం అంటే వారి ప్రతిభను గుర్తించటమే! వారి భాషా సంస్కృతిని గౌరవించడమే! వారి జీవన శైలి ప్రాముఖ్యతను గ్రహించడమే! మానవత్వం కరువైన నేటి సమాజంలో మానవత్వాన్ని సాహిత్యంగా మలచి చెప్పడం ఒక గొప్ప సాహిత్య పరిణామం. కేశవరెడ్డి పీడిత ప్రజల పక్షపాతి అని నిరూపిస్తుంది ఈ నవల. కేశవరెడ్డి పై మార్క్స్ ప్రభావం ఉందని విమర్శకులు అంటున్నారు. ఆర్థిక న్యాయం సామాజిక శ్రేయస్సు దృష్ట్యా మార్క్స్ను అనుసరించడం అంటే పీడిత పక్షపాతిగా నిలబడటమే. సాహిత్యపరంగా ఆ పని కేశవరెడ్డి చేసాడు.

అతడు అడవిని జయించాడునవలలో ముసలివాడు తనకు తాను మాట్లాడుకునే వైనం కనిపిస్తుంది. క్రూర మృగాలతో యుద్ధం అంటే అడవితో యుద్ధమే. ముసలివాడు జంతువులను ఉద్దేశించి మాట్లాడినా తనకు తానుగా ఊహించుకునే భావాలు రాయలసీమ ప్రాంత గిరిజన తెగల సహజ భాషలోని యాసను ప్రతిబింబిస్తాయి. కుల పరంగా భాష ఉంటుందా? నేటి కుల సమాజంలో అలా కూడా ఉంటుంది అని అనుకునే వారు ఉన్నారంటేనూ అశ్చర్యం లేదు. కులాధారిత భాష అంటే ప్రత్యేకంగా ఉండదు కానీ ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా జీవనం కొనసాగిస్తున్న గిరిజన తెగల భాషలో యాస తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. పరిమిత సమూహాలు, అధిక సంఖ్యాక ప్రజల జీవన శైలిలో మమేకం కాకపోవడం చేత వారి భాషలో కనిపించే వ్యత్యాస భావన మూసగా రూపొందవచ్చు. భాష, సంస్కృతిని జీవన శైలి నిర్దేశిస్తుంది. నవలలో ముసలివాడి భాష అత్యంత సహజత్వం కలిగి ఉన్నది. అతడు నిరక్షరాస్యుడైనప్పటికినీ అడవికి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం అవగాహన అతనికి ఉంది. అతనిది జంతువులకు దగ్గరగా నివసించిన జీవితం. జీవితానుభవమూ, శారీరక దృడత్వము, మనో ధైర్యము, అంతకుమించి ఆత్మ విశ్వాసము అతని వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మనవడు గోపాల్ మినహా తనకు ఎవరూ లేరు. అతడికి పందులే సర్వస్వము. అవే స్థిర చర ఆస్తులు. చదవుట కొనసాగించు ‘అడవితో యుద్ధం – అదో నైతిక విజయం’

నగ్నచిత్రం!

ఏడాకులపల్లి వెంకటేష్, (ఎం.),

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

నేనో
నగ్న చిత్రాన్ని!
దేహం అంగడి సరుకైనప్పుడు
అంగుళానికి ఒక రేటు.
నా మనస్సుతో పని లేకుండా
నిరంతరం పాకే విష జంతువులు.
ఆకలి నాకు నా దేహం చూపించింది.
మలినమైన లోకంలో
మానవత్వాన్ని విడిచి,
మెహింది బజారులో నిలబడ్డ నా విష యంత్రం.
సూట్,బూట్ లతో వచ్చే వారికి
నా దేహం ఒక వస్తువు.
పచ్చని నోట్ట్లతో వచ్చే వారికి
మనసు మరిచి బిస్తర్ వేస్తాము.
అవును నేను వేశ్యనే!
బ్రతుకు భారం ఐనప్పుడు
బరువును దించుకోవడం
నేరంకాదు!!

నేటి తెలుగు

-లక్ష్మణరావు , (ఎం.ఏ), 

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ఎప్పటికప్పుడు మారుతున్న నవ సమాజంలో ఇప్పటికీ, ఎప్పటికీ అగ్ర తాంబూలం తప్పకుండా   ఇంగ్లీష్‌కే చెందుతుందేమోనన్న ఆలోచన వస్తేనే ఎంతో బాధనిపిస్తుంది. తెలుగు భాషని ఇంగ్లీషు పదాలతో ఎంగిలి చేస్తున్న దుస్థితి చూస్తుంటే ఏమాత్రమూ సాహితీ సౌరభాన్ని గ్రోలని విద్యార్ధులము, మనకే ఇంత బాధగా ఉంది. ఇక సమయంలో నన్నయ్య పుట్టి ఉంటే ఆంధ్ర మహాభారతాన్ని కూడా పండిత ప్రశంసల కోసం ఇంగ్లీషులోనే రచించి ఉండేవాడేమో…! ఎందుకులే అది ఊహించలేని పరిస్థితి.

అమ్మానాన్నలు కూడా తమ పిల్లలు మమ్మీ డాడీ అని పిలిస్తే మా వాళ్ళకి ఇంగ్లీషు మీడియం చదువు బాగా అబ్బుతున్నదంటూ చెప్పలేనంత ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. యువత తెలుగు వచ్చి కూడా రానట్లు ఇంగ్లీషు సంపర్కంతో తెలుగుని కలగలిపి, రాని యాసని కూడా ఆసతో నాలుకకు నేర్పించి మరీ మాట్లాడేస్తున్నారు. చక్కగా తెలుగుని మాట్లాడక పోగా తొక్కలోఅంటూ అపహాస్యం చేస్తున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే, కొన్నాళ్ళకు తెలుగులో సంస్కృత పదాలున్నట్లే ఇంగ్లిషులోతెలుగు పదాలుండే నకిలీ తెలుగు వస్తుందేమో? మనమిప్పుడు సంస్కృతంలో దేవతలు మాట్లాడుకునే వారంట! అని చెప్పుకుంటున్నట్లుగా భావితరాలవారు తెలుగులో మన పూర్వులు మాట్లాడేవారంటఅని చెప్పుకుంటారేమో! అమ్మో ఆ దుస్థితి ఎన్నటికీ కలుగకూడదు. ఆలోచనే తట్టుకోలేని మనము అటువంటి పరిస్థితులు చూడకుండా కాస్త ముందు తరంలో పుట్టినందుకు సంతోషపడాలా ఏంటి? నిజంగా నాకు సిగ్గేస్తున్నది!.

కానీ ఏ రోజుకైనా తెలుగు పట్ల అభిమానం ప్రజల్లో అంకురించి తెలుగులో మాట్లాడటమే ఒక ఫ్యాషన్ అన్న ధోరణి వస్తే ఎంతో బాగుంటుంది. ఏమవుతుందొ ఏమో కానీ ఈ భావనే చాలా సంతృప్తినిస్తున్నది. అందుకే కరుణశ్రీ ఇలా అంటాడు.

“ఒకమారు వెనుకకు తిరిగి చూచి
దిద్దుకోవమ్మ!బిడ్డల తెనుగు తల్లీ”.

దీనావస్థ

- శ్రీనివాస్ రెడ్డి,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అలనాడు అలరించె ఆంధ్ర రాజుల్ తమ ;సీ;
పెరటి తోటందుపెంచి తెలుగు
ఈనాడు పెంచిరి ఈర్ష్యతో పాలకుల్
వీధి బయటికిని విసిరి వేసి
తెలుగు యనగ నాడు వెలుగులు నిండెను
చీకటి తెరలన్ని చెదిరిపోయి
ఈనాడు యెటుచూడ నిండమావాస్యలు
పిలువగా రాదయ్య తెలుగు పులుగు

యెచ్చటికిని బోయి యెచట దాక్కుండెనో ;.వె;
తెలుగు భాష నందు వెలుగు ధనము
ఆదరణయు లేక అనాథైపోయెనో
కనబడుటయు లేదు కలియ జూడ

తెలుగు భాష నందు తీయగా పలుకగా ;.వె;
చెప్పు తీసికొట్టు తప్పుయనుచు
అన్య భాషనందు అచ్చు తప్పు పలుక
బాగు బాగు యనెడి పాప జనులు

భారతీ స్తుతి!

- ఓం ప్రకాశ్, ఎం., (ఎం.ఫిల్),

ఉస్మానియా విశ్వవిద్యాలయం.

వ్యాసపుర పీఠవాసవు

భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!

వ్యాసమునీశ్వర సేవిత

దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ!

 

బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో

వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,

హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,

వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్!

 

బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,

దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ

బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో

సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!!

భారతీ స్తుతి!!

చాకలకొండ రమాకాంతారావు,

Cincinnati OH USA.

ఆసరా యిచ్చే బాసర తల్లీ ;పల్లవి;

ఆశలు తీర్చవే అమృత వల్లీ!

వాసిగా నీ భక్తుల ఎదలో

వాసము ఉండెడి వెన్నెల వెల్లీ! ;ఆసరా;

వేదములే నీ వీణపై పలుక

మధుర నాదముల గానములొలుక

మోదముతో మా ఎదలే కులుక

ఆదరించవే అమృత వల్లీ! ;ఆసరా;

సరిగమలే నీ సొంపులు కాగ

స్వరజతులే నీ పదగతి కాగ

అరువది నాలుగు కళాకేళిగ

నిరతము మమ్ము బ్రోవవే తల్లీ! ;ఆసరా;

దవళ వస్త్రముల దీప్తులు మెరయగ

నవ్వుల జల్లుల వెన్నెల కురియగ

పువ్వుల వానలు నీ పలుకులుగ

కవితలే సొంపులై కులుకెడి తల్లీ! ;ఆసరా;

వినయ విధేయతా వన్నెల పూలతో

మన్నన చేసి మొక్కెద నిన్నే

కన్నులలోన కరుణను నింపి

నన్నిక బ్రోవుము నిరతము తల్లీ! ;ఆసరా;

చక్కటి చదువుల సంపదలిచ్చి

వాక్కులలోన వన్నెలు కూర్చి

పెక్కు విద్యల ప్రసాదమిచ్చి

మొక్కులు తీర్పవే మమతల వల్లీ! ;ఆసరా;

కృతజ్ఞతలు

సమకాలీన సాహిత్యాన్ని ఇంటర్నెట్ పాఠకులకు అందుబాటులోకి తేవాలన్న మా ప్రయత్నం ఈనాటికి ఫలించింది. ఈ సాహిత్య వేదిక సాహితీ వేత్తల, సాహిత్య విద్యార్థుల , సాహితీ ప్రియుల అభిప్రాయాలు, వారి భావాల ప్రకటనకు ఒక వాహికగా కొనసాగుతుంది. ‘తెలుగు సాహిత్య వేదిక’ త్వరలోనే మరిన్ని శీర్షికలతో మరింత సాహిత్యాన్ని మీకు అందజేయనుంది.

ఈ సంచికలో ప్రచురించటానికని అడిగిన వెంటనే తమ రచనలనిచ్చిన ఆచార్య శరత్‌జ్యోత్స్నా రాణిగారికీ, ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారికీ, ముందు నుంచీ మాకు సహాయ సహకారాలను అందజేస్తూనే, ఈ పత్రికలో ‘తొలి తెలుగు అడుగులు‘ అనే శీర్షికను నిర్వహించటానికి అంగీకరించిన డా. దార్ల వెంకటేశ్వర రావు గారికీ మా కృతజ్ఞతలు.

తెలుగు సాహిత్య వేదిక విజయవంతంగా మీ ముందుకు రావటానికి  సహకరించి వారందరికీ మా కృతజ్ఞతలు.

పలకరించవా పరమాత్మ!

palakarimchava.pdf

ఆచార్య శరత్‌జ్యోత్స్నారాణి,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

వీచేగాలిలో ఏముందో!

పీల్చే మనిషికి ఏమవుతుందో!

చూస్తూనే వున్నాను! ఇలాగే

ఎందుకు ఎప్పుడు జరుగుతుంది! వెంకట రమణ

తెలియక అడుగుతున్నాను.

ఏడుకొండలపై వెలసిన నీకు

మనుషుల జాతకాలు, మర్మాలు తెలుసు.

తెలిసే ఊరకున్నావా! ఎంతమంచివాడవు స్వామీ!

మన అమ్మాయి శిల్ప విషయంలో

నాదేశం, నా ప్రజలు అంటున్నారు.

బ్రిటీష్ వారిది జాతి వివక్ష అట.

నిజం చెప్పవు! నారాయణ

మనకు లేదా! కుల వివక్ష

ఏ వివక్ష అయినా కూల్చేది

మనిషిని, మానవత్వాన్ని.

ప్రపంచీకరణ దిశలో పలు దేశాలు

పరుగులు తీస్తున్నా, మంచికి తావు లేని

ఇసుకటెడారులు.

ఆయుధంతో పనిలేదు!

గాయపర్చే గుండెలేని మనుషుల మధ్య

మనుగడ మృగ్యం రమణ .

చరిత్ర మూలాల్లో కుళ్ళిపోయిన

కుల సంస్కృతిని పూడ్చి పెట్టలేని అలసత్వం

ఎన్నోసార్లు ఎందరినో బలినొంది.

గాంధీపై తెల్లదొర గురిపెట్టిన జాతి వివక్ష,

అంబేడ్కర్ని బలిగొన్న నల్లవాడి కులవివక్ష,

సద్దాంని ఉరితీసిన సామ్రాజ్య వాదపు కక్ష

ఏది! రగులుతున్న అగ్నిజ్వాలలను ఆపిందా!

ప్రశ్నించే వాళ్ళు! పలకరించే మానవతావాదులెందరో!

ఏదేశంలోనైనా విహరించే శ్వేతపావురాలు శాంతికి చిహ్నాలు!

ప్రపంచంలో సంచరించే మనిషి

హద్దులతో సరిహద్దుల గీతంలో ఆవాసం చేస్తున్నాడు.

సాహిత్య సంసృతులు

మతాల కోసం కులాల కోసం పుట్టినవేనన్న సంగతి తెలిసిన

ప్రాజ్ఞుడవు .

మౌనంగా చూస్తావెందుకు?

అంతా మాయ మిధ్యేనని మామధ్యకు రాకున్నా

ఒక సారి పలకరించవా ఓ పరమాత్మ!

అనువాదాలు అరసున్నాలేనా?

anuvadalu.pdf                                                                        

ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ప్రాచీన తెలుగు సంప్రదాయ సాహిత్యం మీద ఒక బలమైన ఆక్షేపణ ఉంది. ఇది అంతా చంద్రకాంతే కానీ సూర్యకాంతి కాదు అని. వస్తుపరంగా తెలుగులో స్వతంత్ర కావ్యాలు లేవు అన్నది దీని సారాంశం. ఇది చాలా మటుకు వాస్తవమే. ఏవో కొన్ని శతకాలు,ద్విపద రచనలు ఒక కళాపూర్ణోదయం (పింగళి సూరన-16 A.D) మినహాయిస్తే తెలుగు కావ్యాలకు సంస్కృత కావ్యాలలోనో, తమిళ కన్నడాది ప్రాంతీయ భాషలలోనో మూలాలు ఉన్నాయి. అయితే ఇవి ఏవీ యథామూలానువాదాలు కాకపోవడమూ, ఇంచుమించు స్వతంత్ర రచనలు అన్నట్టు సాగడమూ గమనించవలసిన అంశం.

వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం ప్రబంధమండలిఅనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.

నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.

ఆధునిక యుగారంభంలోనే వస్తుపరంగా కూడా స్వతంత్ర రచనలు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ చరిత్రలు, ఐతిహ్యాలు, సామాజిక సంఘటనలుకావ్య వస్తువులయ్యాయి. ఇవి లఘు కావ్యాలుగా ప్రారంభమై మహాకావ్యాలకు విస్తరించాయి  (ఆంధ్రపురాణం- మధునాపంతుల). ఆశ్చర్యమేమంటే సరిగ్గా ఇదే సమయంలో  యథామూలానువాదాలు ప్రారంభమయ్యాయి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు భారత భాగవతాలకు శ్లోకానికి పద్యం పద్ధతిలో తుచ తప్పని అనువాదం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు  కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలాన్ని  యథామూలంగా అనువదించారు. ఇప్పటి వరకు ఈ యథామూలానువాద శాఖ విరివిగా వర్ధిల్లుతోంది.

స్వేచ్ఛానువాదాల  తొలినాళ్ళలో సైతం కొన్ని శ్లోకాలకు యథాతథానువాదాలు లేకపోలేదు. వీటిని విమర్శకులు విడిచిపెట్టలేదు. అతిక్రాంత సుఖాః కాలాః అనే సుప్రసిద్ధ శ్లోకంలో పృథివీ గత యౌవనా అన్న కవితామయమైన అభివ్యక్తిని నన్నయ విడిచిపెట్టేశాడని కొందరు పెదవి విరిస్తే, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్న సూక్తిప్రాయమైన తెనిగింపుతో వ్యాసుడికి సమఉజ్జీగా నిలబడ్డాడని మరికొందరు మురిసిపోయారు. జీవగ్రాహం జగ్రాహ అన్న పదబంధంలోని  వ్యాకరణ సౌందర్యాన్ని తిక్కనగారు మన్దలపట్టి తెచ్చె అనడంతో తెచ్చి నిలబెట్టాడని కొందరు అభినందిస్తే అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి- గమి కర్మీకృతనైకనీ వృతుడు లాంటి సమాసాల్లోని సౌందర్యాన్ని తెలుగులోకి తేలేక అలాగని విడిచిపెట్టలేక అక్షరాలా అవ్వే అలాగే నిలిపిన శ్రీనాథున్ని కొందరు అభిశంసించారు. వీటి అన్నింటి ఫలితంగా శబ్దం, అర్థం, అభివ్యక్తి, నుడికారం, వాక్య నిర్మాణం అనేవి అనువాదాల తులనాత్మక విశ్లేషణలో ప్రధాన రంగాలుగా తేలాయి.

సంస్కృతి పరమైన తేడాలు అంతగా లేవు కనక సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదాలు చెయ్యడం తేలిక అని చాలామంది అంటుంటారు గానీ విమర్శకుల చేతినుంచి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు పొందిన అనువాదకుల సంఖ్య తక్కువే. కందుకూరి వీరేశలింగం పంతులు నుండి ఈనాటీ చిటిప్రోలు కృష్ణమూర్తి (మాఘమేఘాలు) వరకూ ఉదారుల చేతిలో ఉత్తీర్ణతలు పొందారే తప్ప నిష్కర్షగా నెగ్గినవారు లేరు(చూ:వ్యాస గౌతమి 2004 యథామూలానువాదాలు- యథార్థస్థితి). అయితే ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న వేసుకోక తప్పదు. అనువాదాలు ఎవరికోసం? లక్షిత పాఠకులు ఎవరు? సంస్కృతంలో కాళిదాసుని చదువుకోగలిగినవారికి కందుకూరి అనువాదం అవసరం లేదు. ఆ శక్తి లేనివారికే ఇది. వారికి అది బాగానే నచ్చింది. కనకనే పునర్ముద్రణలు పొందింది. నచ్చలేదన్నవాళ్ళు సంస్కృతంతో పోల్చగల్గిన సమీక్షకులే. నిజానికి వీళ్ళు లక్షిత పాఠకులు కారు. అయినా నోరున్నవాళ్ళు వీరే. వీరి మెచ్చుకోలు పొందడం అనువక్తకు ఒక అనివార్యమైన పని అయికూర్చుంది. ఇది లేకపొతే ఏమవుతుందో చెప్పలేనుకానీ ఈ దినుసు సమీక్ష విమర్శల  ఫలితాంశం  అనువక్తకు జాగ్రత్తలు నేర్పడమే. లేకపోతే  నిర్లక్ష్యానువాదాల బెడద ఎక్కువైపోతుందేమో!

ఇటీవల ఆంగ్లం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదాలు చాలా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. కవిత్వానువాదాల గురించే నా ప్రస్తావన. ఆంగ్లం నుంచి తెలుగులోకి వస్తున్నవాటిలో మరో రెండు పాయలున్నాయి. ఆంగ్లం నుంచి సరాసరి తెలుగులోకి వస్తున్నవి ఒక పాయ. ఇతర భాషలనుంచి ఆంగ్లంలోకి వెళ్ళి, ఆంగ్లంనుంచి తెలుగులోకి వస్తున్నవి మరొక పాయ. సంస్కృతాలంకారికులు కొందరు మూల శ్లోకాన్ని స్వామి వాక్యమనీ, అనూదిత పద్యాన్ని దాసవాక్యమనీ వ్యవహరించారు. ఈ పరిభాషను ఇక్కడ అన్వయిస్తే పై రెండు పాయలలో మొదటిది దాస కవిత్వం, రెండవది దాసానుదాస కవిత్వం అవుతుంది. ఈ దాసుడి దాసానుదాస కవిత్వం మీద ఒక సమీక్షకుడి (గాలి నాసర రెడ్డి-మిసిమి) స్పందన మీ దృష్టికి తెస్తాను. రమేష్ ప్రతాప్ ఒరియా రచన ఇది. Half corved poetry in stone (The black pagoda)అనే దాన్ని సగం చెక్కిన శిల్పమ్ము పగిది నాదు పద్యమియ్యది (1996-పలుకు చిలుక) అని అనువదించాను. poetry in stone అనే నుడికారం అనువాదకుడికి అందలేదని సమీక్షకుడు తెలియజేసాడు. ఇది సమీక్షకుడి బాధ్యత. కృతజ్ఞతలతో స్వీకరించాను. అయితే ఒరియాలో ఉన్నది ఏమిటి అన్నది ఇప్పటికీ సందేహమే. నా అనువాదం స్వామి వాక్యానికి దగ్గరగా ఉన్నదేమో! ఇది తెలుసుకోవడం ఎలా? సమీక్షకుడి బాధ్యతలో ఇది భాగమవుతుందా? అయితే సమీక్షకుడికి ఎన్ని భాషలు తెలుసుండాలిట!

తెలుగునుంచి ఆంగ్లంలోకి కావ్యాలను అనువదిస్తున్న వారిలో ఇటీవల పేర్కొనదగిన వ్యక్తి వెలిచేరు నారాయణ రావు గారు. కళాపూర్ణోదయం, క్షేత్రయ్య పదాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్రీ కాళహస్తీశ్వర శతకం ఇలా చాలా ఉన్నాయి వీరి జాబితాలో. క్షేత్రయ్య పదాలకు బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనువాదం చేసారు. వేమన శతకం ఇప్పటికీ అనువాదమవుతూనే ఉంది. వీటి అన్నిటి మీద ఎవరో ఒకరు అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నారు. వెలిచేరు వారి ఆంగ్లీకరణల్లో చెట్టు ఇస్మాయిల్ గారి ఒక కవితా ఖండికలో పద్యం కోసం తవ్వుతున్నాను అనే భావాన్ని digging for the poem అన్నారు. దీన్ని యదుకుల భూషణ్ తన సమీక్షలో తీవ్రంగా ఆక్షేపించాడు. అంతర్ముఖుణ్నై అన్వేషిస్తున్నాను అన్న ఆంతరంగిక భావచ్ఛాయ digging for the poem అనడంలో లేదని వారి ఆక్షేపణ సారాంశం. ఆ భాషలో ఆ తరహా పదబంధానికి ఆ శక్తి ఉన్నదీ లేనిదీ తేల్చవలసిన వారు ఎవరు అన్నది నా మౌలిక ప్రశ్న. ఆంగ్లం మాతృభాషగా కలవారు స్పందించాలి. కానీ వారు స్పందించరు. అందాక ఉభయ భాషా ప్రవీణులం అనుకుంటున్నవారి స్పందనలే పొగడ్తకు  గానీ  తెగడ్తకు  గానీ గతి. బహుశ  కవిత్వానువాదాలు ఎప్పటికీ  అర్ధవృత్తాలుగానే మిగిలిపోతాయేమో!

 

( ప్రముఖ కవి, విమర్శకులు, పరిశోధకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిని ఈ సంచికలో ప్రచురించడానికి అడిగిన వెంటనే ఈ వ్యాసాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు - తెలుగు సాహిత్య వేదిక )

తరువాతి కాగితం »


Telugutalli_image

a

 

ఫిబ్రవరి 2007
సో మం బు గు శు
    మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

మా పాఠకులు