ఆచార్య బేతవోలు రామబ్రహ్మం ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
ప్రాచీన తెలుగు సంప్రదాయ సాహిత్యం మీద ఒక బలమైన ఆక్షేపణ ఉంది. ఇది అంతా చంద్రకాంతే కానీ సూర్యకాంతి కాదు అని. వస్తుపరంగా తెలుగులో స్వతంత్ర కావ్యాలు లేవు అన్నది దీని సారాంశం. ఇది చాలా మటుకు వాస్తవమే. ఏవో కొన్ని శతకాలు,ద్విపద రచనలు ఒక కళాపూర్ణోదయం (పింగళి సూరన-16 A.D) మినహాయిస్తే తెలుగు కావ్యాలకు సంస్కృత కావ్యాలలోనో, తమిళ కన్నడాది ప్రాంతీయ భాషలలోనో మూలాలు ఉన్నాయి. అయితే ఇవి ఏవీ యథామూలానువాదాలు కాకపోవడమూ, ఇంచుమించు స్వతంత్ర రచనలు అన్నట్టు సాగడమూ గమనించవలసిన అంశం.
వ్యాసభారతాన్ని తెలుగులోకి తెచ్చిన ఆదికవి నన్నయ్య యథామూలానువాదం చెయ్యలేదు. శ్లోకానికి పద్యము అన్న పద్ధతి పెట్టుకోలేదు. భారత బద్ధ నిరూపితార్థము తెలుగు వారికి అందించడమే నా లక్ష్యం అన్నాడు. దానికి తగినట్టు పద్దెమినిమిది పర్వాలకూ ప్రణాళిక రచించి తన స్వేచ్ఛానువాదాన్ని ప్రారంభించాడు. తిక్కన, ఎర్రనలు అదే మార్గంలో అదే లక్ష్యంతో దాన్ని పూర్తి చేసారు. అప్పటినుంచి ప్రాచీన తెలుగు కవులు అందరికీ అదే ఒరవడి అయ్యింది. స్వేచ్ఛానువాదాలే తప్ప యథామూలానువాదాలు అవతరించలేదు (శాస్త్ర గ్రంథాలు మాత్రం దీనికి మినహాయింపు). వర్ణనల్లోనేమి రసవద్ఘట్టాలలోనేమి అనువక్త ఈ తరహా స్వేచ్ఛను తీసుకున్నా సన్నివేశాలే ఆయా రచనల్లో కాంతిమంతాలుగా భాసించడం, పాఠకులు అందరికీ అవే ఎక్కువ నచ్చడం గమనించవలసిన అంశం. భారతంలో కొన్ని ఉపాఖ్యానాలు కావ్యాలుగా విరాజిల్లడం “ప్రబంధమండలి” అనిపించుకోవడం వెనక దాగి ఉన్న రహస్యం ఇదే.
నన్నయ్య ఈ మార్గం తొక్కడానికి ఒక చారిత్రక కారణం ఉంది. పదకొండవ శతాబ్దానికి ముందే వ్యాసభారతం కన్నడంలోకి దిగుమతి అయ్యింది. అయితే అది కన్నడ భారతమే తప్ప వ్యాస భారతం కాదు. వ్యాసుడి లక్ష్యమూ, పరమార్థమూ పూర్తిగా భంగపడ్డాయి. కథాగమనమూ, పాత్రల పేర్లు మాత్రం మిగిలాయి. స్వభావాలు మారిపోయాయి. భారత రచనకు పరమార్థమైన వైదిక ధర్మం స్థానాన్ని జైన మతం ఆక్రమించింది. ఈ అన్యాయాన్ని చక్కదిద్దడం కోసం నన్నయ గంటం అందుకున్నాడు. అందుచేత భారత పరమార్థాన్ని పునఃప్రతిష్ఠించడమే సత్వర కర్తవ్యంగా స్వేచ్ఛానువాద పద్ధతిని స్వీకరించాడు. బహుశ ఇందులోని స్వేచ్ఛ అనంతర కవులను ఆకర్షించింది. స్వీయ ప్రతిభా ప్రదర్శనకు అవకాశం ఇచ్చింది. అందుచేత కథాకల్పనల కోసం వృధా శ్రమ పడకండా ప్రఖ్యాత వస్తులేశాన్ని స్వీకరించి సర్వాత్మనా స్వతంత్ర కావ్యాలను రచించారు.
ఆధునిక యుగారంభంలోనే వస్తుపరంగా కూడా స్వతంత్ర రచనలు ప్రారంభమయ్యాయి. ప్రాంతీయ చరిత్రలు, ఐతిహ్యాలు, సామాజిక సంఘటనలు– కావ్య వస్తువులయ్యాయి. ఇవి లఘు కావ్యాలుగా ప్రారంభమై మహాకావ్యాలకు విస్తరించాయి (ఆంధ్రపురాణం- మధునాపంతుల). ఆశ్చర్యమేమంటే సరిగ్గా ఇదే సమయంలో యథామూలానువాదాలు ప్రారంభమయ్యాయి. శ్రీపాద కృష్ణమూర్తి శాస్త్రి గారు భారత భాగవతాలకు శ్లోకానికి పద్యం పద్ధతిలో తుచ తప్పని అనువాదం చేసారు. కందుకూరి వీరేశలింగం పంతులు గారు కాళిదాసుని అభిజ్ఞాన శాకుంతలాన్ని యథామూలంగా అనువదించారు. ఇప్పటి వరకు ఈ యథామూలానువాద శాఖ విరివిగా వర్ధిల్లుతోంది.
స్వేచ్ఛానువాదాల తొలినాళ్ళలో సైతం కొన్ని శ్లోకాలకు యథాతథానువాదాలు లేకపోలేదు. వీటిని విమర్శకులు విడిచిపెట్టలేదు. అతిక్రాంత సుఖాః కాలాః అనే సుప్రసిద్ధ శ్లోకంలో పృథివీ గత యౌవనా అన్న కవితామయమైన అభివ్యక్తిని నన్నయ విడిచిపెట్టేశాడని కొందరు పెదవి విరిస్తే, గతకాలము మేలు వచ్చు కాలము కంటెన్ అన్న సూక్తిప్రాయమైన తెనిగింపుతో వ్యాసుడికి సమఉజ్జీగా నిలబడ్డాడని మరికొందరు మురిసిపోయారు. జీవగ్రాహం జగ్రాహ అన్న పదబంధంలోని వ్యాకరణ సౌందర్యాన్ని తిక్కనగారు మన్దలపట్టి తెచ్చె అనడంతో తెచ్చి నిలబెట్టాడని కొందరు అభినందిస్తే అస్తి నాస్తి విచికిత్సాహేతు శాతోదరి- గమి కర్మీకృతనైకనీ వృతుడు లాంటి సమాసాల్లోని సౌందర్యాన్ని తెలుగులోకి తేలేక అలాగని విడిచిపెట్టలేక అక్షరాలా అవ్వే అలాగే నిలిపిన శ్రీనాథున్ని కొందరు అభిశంసించారు. వీటి అన్నింటి ఫలితంగా శబ్దం, అర్థం, అభివ్యక్తి, నుడికారం, వాక్య నిర్మాణం అనేవి అనువాదాల తులనాత్మక విశ్లేషణలో ప్రధాన రంగాలుగా తేలాయి.
సంస్కృతి పరమైన తేడాలు అంతగా లేవు కనక సంస్కృతం నుంచి తెలుగులోకి అనువాదాలు చెయ్యడం తేలిక అని చాలామంది అంటుంటారు గానీ విమర్శకుల చేతినుంచి ఉత్తీర్ణతకు అవసరమైన మార్కులు పొందిన అనువాదకుల సంఖ్య తక్కువే. కందుకూరి వీరేశలింగం పంతులు నుండి ఈనాటీ చిటిప్రోలు కృష్ణమూర్తి (మాఘమేఘాలు) వరకూ ఉదారుల చేతిలో ఉత్తీర్ణతలు పొందారే తప్ప నిష్కర్షగా నెగ్గినవారు లేరు(చూ:వ్యాస గౌతమి 2004 యథామూలానువాదాలు- యథార్థస్థితి). అయితే ఇక్కడ ఒక మౌలిక ప్రశ్న వేసుకోక తప్పదు. అనువాదాలు ఎవరికోసం? లక్షిత పాఠకులు ఎవరు? సంస్కృతంలో కాళిదాసుని చదువుకోగలిగినవారికి కందుకూరి అనువాదం అవసరం లేదు. ఆ శక్తి లేనివారికే ఇది. వారికి అది బాగానే నచ్చింది. కనకనే పునర్ముద్రణలు పొందింది. నచ్చలేదన్నవాళ్ళు సంస్కృతంతో పోల్చగల్గిన సమీక్షకులే. నిజానికి వీళ్ళు లక్షిత పాఠకులు కారు. అయినా నోరున్నవాళ్ళు వీరే. వీరి మెచ్చుకోలు పొందడం అనువక్తకు ఒక అనివార్యమైన పని అయికూర్చుంది. ఇది లేకపొతే ఏమవుతుందో చెప్పలేనుకానీ ఈ దినుసు సమీక్ష విమర్శల ఫలితాంశం అనువక్తకు జాగ్రత్తలు నేర్పడమే. లేకపోతే నిర్లక్ష్యానువాదాల బెడద ఎక్కువైపోతుందేమో!
ఇటీవల ఆంగ్లం నుంచి తెలుగులోకి, తెలుగు నుంచి ఆంగ్లంలోకి అనువాదాలు చాలా అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. కవిత్వానువాదాల గురించే నా ప్రస్తావన. ఆంగ్లం నుంచి తెలుగులోకి వస్తున్నవాటిలో మరో రెండు పాయలున్నాయి. ఆంగ్లం నుంచి సరాసరి తెలుగులోకి వస్తున్నవి ఒక పాయ. ఇతర భాషలనుంచి ఆంగ్లంలోకి వెళ్ళి, ఆంగ్లంనుంచి తెలుగులోకి వస్తున్నవి మరొక పాయ. సంస్కృతాలంకారికులు కొందరు మూల శ్లోకాన్ని స్వామి వాక్యమనీ, అనూదిత పద్యాన్ని దాసవాక్యమనీ వ్యవహరించారు. ఈ పరిభాషను ఇక్కడ అన్వయిస్తే పై రెండు పాయలలో మొదటిది దాస కవిత్వం, రెండవది దాసానుదాస కవిత్వం అవుతుంది. ఈ దాసుడి దాసానుదాస కవిత్వం మీద ఒక సమీక్షకుడి (గాలి నాసర రెడ్డి-మిసిమి) స్పందన మీ దృష్టికి తెస్తాను. రమేష్ ప్రతాప్ ఒరియా రచన ఇది. Half corved poetry in stone (The black pagoda)అనే దాన్ని సగం చెక్కిన శిల్పమ్ము పగిది నాదు పద్యమియ్యది (1996-పలుకు చిలుక) అని అనువదించాను. poetry in stone అనే నుడికారం అనువాదకుడికి అందలేదని సమీక్షకుడు తెలియజేసాడు. ఇది సమీక్షకుడి బాధ్యత. కృతజ్ఞతలతో స్వీకరించాను. అయితే ఒరియాలో ఉన్నది ఏమిటి అన్నది ఇప్పటికీ సందేహమే. నా అనువాదం స్వామి వాక్యానికి దగ్గరగా ఉన్నదేమో! ఇది తెలుసుకోవడం ఎలా? సమీక్షకుడి బాధ్యతలో ఇది భాగమవుతుందా? అయితే సమీక్షకుడికి ఎన్ని భాషలు తెలుసుండాలిట!
తెలుగునుంచి ఆంగ్లంలోకి కావ్యాలను అనువదిస్తున్న వారిలో ఇటీవల పేర్కొనదగిన వ్యక్తి వెలిచేరు నారాయణ రావు గారు. కళాపూర్ణోదయం, క్షేత్రయ్య పదాలు, అన్నమాచార్య కీర్తనలు, శ్రీ కాళహస్తీశ్వర శతకం ఇలా చాలా ఉన్నాయి వీరి జాబితాలో. క్షేత్రయ్య పదాలకు బాలాంత్రపు రజనీకాంతరావు గారు అనువాదం చేసారు. వేమన శతకం ఇప్పటికీ అనువాదమవుతూనే ఉంది. వీటి అన్నిటి మీద ఎవరో ఒకరు అసంతృప్తి ప్రకటిస్తూనే ఉన్నారు. వెలిచేరు వారి ఆంగ్లీకరణల్లో చెట్టు ఇస్మాయిల్ గారి ఒక కవితా ఖండికలో పద్యం కోసం తవ్వుతున్నాను అనే భావాన్ని digging for the poem అన్నారు. దీన్ని యదుకుల భూషణ్ తన సమీక్షలో తీవ్రంగా ఆక్షేపించాడు. అంతర్ముఖుణ్నై అన్వేషిస్తున్నాను అన్న ఆంతరంగిక భావచ్ఛాయ digging for the poem అనడంలో లేదని వారి ఆక్షేపణ సారాంశం. ఆ భాషలో ఆ తరహా పదబంధానికి ఆ శక్తి ఉన్నదీ లేనిదీ తేల్చవలసిన వారు ఎవరు అన్నది నా మౌలిక ప్రశ్న. ఆంగ్లం మాతృభాషగా కలవారు స్పందించాలి. కానీ వారు స్పందించరు. అందాక ఉభయ భాషా ప్రవీణులం అనుకుంటున్నవారి స్పందనలే పొగడ్తకు గానీ తెగడ్తకు గానీ గతి. బహుశ కవిత్వానువాదాలు ఎప్పటికీ అర్ధవృత్తాలుగానే మిగిలిపోతాయేమో!
( ప్రముఖ కవి, విమర్శకులు, పరిశోధకులు ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారిని ఈ సంచికలో ప్రచురించడానికి అడిగిన వెంటనే ఈ వ్యాసాన్ని ఇచ్చినందుకు కృతజ్ఞతలు - తెలుగు సాహిత్య వేదిక )

నమస్కారములు. ఈ వ్యాసం చక్కగా ఉన్నది. అభినందనలు.
ఈ వ్యాసంలో రెండు పేరాలు నేను యధాతధంగా తెలుగు వికిపిడియా లో నన్నయ వ్యాసంలో http://te.wikipedia.org/wiki/%E0%B0%A8%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8%E0%B0%AF%E0%B1%8D%E0%B0%AF కాపీ చేశాను. మీకు అభ్యంతరం ఉండదనే అభిప్రాయంతో. తెలుగు సాహిత్యం గురించి వికిపిడియాలో సమాచారాన్ని విస్తృతం చెయడాన్ని మీరు ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. భవదీయుడు – కాజ సుధాకరబాబు