డా. దార్ల వెంకటేశ్వర రావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
శ్రీ తో ప్రారంభమైన తెలుగు సాహిత్యం శ్రీ శ్రీ తో ఆధునిక సాహిత్యం గా మారిందని కొంతమంది చమత్కరిస్తుంటారు. నన్నయ్య శ్రీమదాంధ్ర మహాభారతాన్ని శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ… శ్లోకంతో ప్రారంభించారు. మహాప్రస్థానాన్ని రాసి శ్రీ శ్రీ ఆధునిక కవిత్వాన్ని గొప్పమలుపు తిప్పగలిగారు. అందువల్ల అలా అనటం పరిపాటిగా వస్తుంది. కానీ, ఆధునిక తెలుగు సాహిత్యం శ్రీ శ్రీ కంటే ముందే ప్రారంభమయ్యిందని సాహిత్యాన్ని పరిశోధన దృష్టితో గమనించేవారు గుర్తిస్తుంటారు. తెలుగు సాహిత్యంలో వేటిని తొలి రచనలుగా భావించాలి? మన తొలి తెలుగు అడుగులు ఎక్కడ ప్రారంభమయ్యాయి? మన తెలుగులో తొలి రచనలు ఏమిటి? అనే అంశాలను ఈ ‘తొలి తెలుగు అడుగులు‘ శీర్షిక ద్వారా విశ్లేషించాలనుకుంటున్నాను.
మన సాహిత్య చరిత్ర కారులు ఈ విషయం లో ఇప్పటికే విశేషమైన పరిశోధనలు చేశారు. అయినా చాలా అంశాలు నేటికీ పునః పరిశోధనలవైపు పయనిస్తూనే ఉన్నాయి.తెలుగు వారి చరిత్రతో పాటు తెలుగు కవిత్వం కూడా ప్రారంభమైనట్లు పరిశోధకులు భావిస్తున్నారు. క్రీ.పూ. 200 నాటికే తెలుగుభాషలో పాటలు ఉన్నట్లు శాతవాహన రాజు హాలుడు సంకలనం చేసిన గాథాసప్తశతి లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ గ్రంథం ప్రాకృతగ్రంథం. కనుక, ప్రాకృతం లోకి తెలుగు పదాలు వెళ్ళినట్లు మన పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగు భాష గురించి ఇలా అన్వేషించగా జానపదగేయాలరూపంలోనూ, కొన్ని శాసనాలలోనూ తొలి తెలుగు అడుగు జాడలు కనుక్కోగలిగారు. అలా శాసనాలలో దొరికిన తొలితెలుగు పదంగా నాగబు లో గల ‘బు‘ శాసనాలలో కనిపించిన తొలి తెలుగు పదంగా మన పరిశోధకులు గుర్తించారు. ఈ పదం అమరావతి స్థూపశాసనంలో దొరికింది. మూడో, నాల్గో శతాబ్దాలకు చెందిన ఈ శాసనంలో ఈ పదాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కనుగొన్నారు. నాగ అనేది సంస్కృతమో, ప్రాకృతమో అనుకున్నా ‘బు‘ అనే ప్రత్యయాన్ని బట్టి మాత్రం దీన్ని తొలి తెలుగు పదంగా భావిస్తున్నారు. మనకు దొరికిన తొలితెలుగు శాసనం మాత్రం క్రీ.శ. 575 నాటి ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు దీన్ని వేయించారు. క్రీ.శ. 848-892 వరకు పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాధిత్యుని కాలంలో తొలి తెలుగు పద్య శాసనం వేయించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఈ శాసనం లో మనకు లభిస్తున్న తొలితెలుగు పద్యం తరువోజ.
ఇలా పద్యాలలో శాసనాలు లభిస్తున్నా, తొలి తెలుగు కావ్యం మాత్రం నన్నయ రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం గా నే పరిశోధకులు భావిస్తున్నారు. నన్నెచోడుడు రాసిన కుమార సంభవం ,నన్నయ కంటే ముందు వచ్చిన కావ్యం అని కూడా ఒకవాదం లేక పోలేదు. కానీ , వివిధ ఆధారాలను అధ్యయనం చేసిన తరువాత తొలితెలుగు కావ్యం శ్రీమదాంధ్ర మహాభారతం అని అత్యధికులు అంగీకరిస్తున్నారు. శ్రీమదాంధ్ర మహాభారతం ఈ పద్యంతో ప్రారంభమవుతుంది.
శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాజ్ఞ్గేషు యే
లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం
తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై
ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే
ప్రతిపదార్థం: యే= ఏ విష్ణు బ్రహ్మ శంకరులు; శ్రీ, వాణీ, గిరిజాః= క్రమంగా లక్ష్మీ సరస్వతీ పార్వతులను; చిరాయ= చిరకాలం నుండి; వక్షః ముఖ, అజ్ఞేషు=రొమ్మునందూ, మొగమునందూ, దేహమునందూ; దధతః= ధరిస్తున్నవారై; స్త్రీ, పుంస, యోగ + ఉద్భవామ్= స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన; లోకానామ్= లోకముల యొక్క; స్థితిమ్= స్థిరత్వాన్ని (నిలకడను); అవిహతామ్= అవిచ్ఛిన్న మైనదానిగా; ఆవహన్తి = చేస్తున్నారో; వేద, త్రయ, మూర్తయః= ఋగ్యజుస్సామా లనే మూడు వేదాల రూపాలు గలవారున్నూ; సురైః= దేవతల చేత; సంపూజితాః= పూజింపబడిన వారున్నూ అయిన; తే= ఆ; పురుషోత్తమా + అంభుజభవ, శ్రీకంధరాః= విష్ణువు, బ్రహ్మ, శివుడు - అనబడే; త్రి,పురుషాః= త్రిమూర్తులు; వః= మీకు; శ్రేయసే= మేలుకొరకు (మేలు చేసేవారుగా); భూయాసుః= అగుదురు గాక!
తాత్పర్యం: ఏ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలం నుండి క్రమంగా రొమ్మునందూ, ముఖమునందూ, దేహమునందూ, లక్ష్మీ సరస్వతీ పార్వతులను ధరిస్తున్నవారై, స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడు వేదాల రూపం కలవారున్నూ, దేవతల చేత పూజింపబడిన వారున్నూ అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించే వారౌతారు గాక!ఇది మన ఆంధ్రమహాభారతంలోని తొలి తెలుగు శ్లోకం. భారతీయ గృహస్థ ధర్మాన్ని కూడా ఈ శ్లోకంలో నిర్దేశించారు.
ఇలా మన తొలి తెలుగు అడుగులు ఎలా ప్రారంభమయ్యాయో ఎలా కొనసాగాయో ఈ శీర్షిక ద్వారా మరో సారి గుర్తు చేసుకుందాం.
(సశేషం)

entho mudhavahamaina sanghatana “TholiAdagulu” veyygalagadam.
Narasimham
ee vyaasam chala baagundi aite naaku konni sandehaalu unnai
గురువు గారు నేను ఇంతకు ముందు ఇచ్చిన అభిప్రాయంలో కొన్ని తప్పులు ఉన్నాయి. కాబట్టి నన్ను క్షమించండి.గురువు గారు మీరురాసిన వ్యాసం చదివిన తర్వాత నాకు కొన్ని సందేహాలు ఉన్నాయి.