-డా. జె. భీమయ్య,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపుల పల్లి అనే గ్రామంలో మార్చి 10, 1946 లో జన్మించాడు. ఆధునిక నవలా రచయితగా పేరున్న కేశవరెడ్డి వృత్తి పరంగా వైద్యుడు. ఆయన రచించిన “అతడు అడవిని జయించాడు” అనే నవల అద్భుతమైనది. లోతైన కథావస్తువుతో నిమిడీకృతమై రూపొందిన నవల. పరిమాణంలో చిన్నదైనా పాఠకుని మనసులో చెరగని ముద్ర వేస్తుంది. అట్టడుగు మరియు నిమ్నవర్గాల జీవనశైలి, వారి ప్రతిభా పాటవాలు, భాషా సంస్కృతి మొదలైన సామాజిక, స్వాభావిక, సహజత్వ ఆంశాలను ప్రతిబింబించే నవల “అతడు అడవిని జయించాడు“.
కేశవరెడ్డి వృత్తి రీత్యా వైద్యుడే అయినా, ప్రవృత్తి రీత్యా సాహిత్య రచన పట్ల ఆయనకున్న అభినివేశం, ఆసక్తి, ఆలోచన అమోఘమైనది. జీవనపోరాటం, బతుకు దుర్బరత్వం మొదలైన పీడిత లక్షణాలు వ్యక్తిగతంగా ఆయన అనుభవంలో లేకపోయినా, తన నిశిత పరిశీలన, ఊహాత్మక పరిశోధన ద్వారా పీడిత వర్గాల సంస్కృతిని తన కలం నుండి జాలువారించారు. ఆయన కున్న సామాజిక ఆర్థిక నేపథ్యం వేరు కావచ్చు. అయినా సామాన్య ప్రజల ముఖ్యంగా గిరిజన తెగల భాషా సంస్కృతికి తాను దగ్గరగా జీవించిన వైనం ఈ నవలలో కనిపిస్తుంది. తన జీవన సామాజిక పరిస్థితులు తన కలాన్ని ప్రభావితం చేస్తున్నాయా? అని అనుకోవటానికి ఆధారాలు మనకు కనపడవు.ఈ నవలలో ముసలి వాడి బతుకు పోరాటాన్ని రచయిత వర్ణించిన తీరు స్వాభావికతను సంతరించుకున్నది. ఎరుకల తెగ (కులం) కి చెందిన ముసలివాడి పేరు నవలలో ఎక్కడా ప్రస్తావించటం జరగలేదు. ముసలివాడి జీవన పోరాటాన్ని ఒక వ్యక్తి పోరాటంగా కాక గిరిజన తెగ పోరాటంగా, ఇంకా కొంత విశాల దృక్పథంతో ఆలోచిస్తే పీడిత ప్రజల బతుకు పోరాటంగానూ అర్థం చేసుకోవచ్చు. ముసలి వాడిని అడవిరాజ్యం లో గిరిజన తెగల ప్రతినిధిగా చూడాలి.
ఈ నవల పద్నాలుగు భాషల్లోకి అనువదింపబడటం ఒక ప్రత్యేకత. రాయలసీమ ప్రాంతపు గిరిజన తెగల భాషా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పుస్తకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ నవలలో ఒక ముసలివాడు కథానాయకుడు. నిమ్న వర్గాలను కథానాయకులుగా నిలబెట్టడం అంటే వారి ప్రతిభను గుర్తించటమే! వారి భాషా సంస్కృతిని గౌరవించడమే! వారి జీవన శైలి ప్రాముఖ్యతను గ్రహించడమే! మానవత్వం కరువైన నేటి సమాజంలో మానవత్వాన్ని సాహిత్యంగా మలచి చెప్పడం ఒక గొప్ప సాహిత్య పరిణామం. కేశవరెడ్డి పీడిత ప్రజల పక్షపాతి అని నిరూపిస్తుంది ఈ నవల. కేశవరెడ్డి పై మార్క్స్ ప్రభావం ఉందని విమర్శకులు అంటున్నారు. ఆర్థిక న్యాయం సామాజిక శ్రేయస్సు దృష్ట్యా మార్క్స్ను అనుసరించడం అంటే పీడిత పక్షపాతిగా నిలబడటమే. సాహిత్యపరంగా ఆ పని కేశవరెడ్డి చేసాడు.
“అతడు అడవిని జయించాడు” నవలలో ముసలివాడు తనకు తాను మాట్లాడుకునే వైనం కనిపిస్తుంది. క్రూర మృగాలతో యుద్ధం అంటే అడవితో యుద్ధమే. ముసలివాడు జంతువులను ఉద్దేశించి మాట్లాడినా తనకు తానుగా ఊహించుకునే భావాలు రాయలసీమ ప్రాంత గిరిజన తెగల సహజ భాషలోని యాసను ప్రతిబింబిస్తాయి. కుల పరంగా భాష ఉంటుందా? నేటి కుల సమాజంలో అలా కూడా ఉంటుంది అని అనుకునే వారు ఉన్నారంటేనూ అశ్చర్యం లేదు. కులాధారిత భాష అంటే ప్రత్యేకంగా ఉండదు కానీ ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా జీవనం కొనసాగిస్తున్న గిరిజన తెగల భాషలో యాస తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. పరిమిత సమూహాలు, అధిక సంఖ్యాక ప్రజల జీవన శైలిలో మమేకం కాకపోవడం చేత వారి భాషలో కనిపించే వ్యత్యాస భావన మూసగా రూపొందవచ్చు. భాష, సంస్కృతిని జీవన శైలి నిర్దేశిస్తుంది. నవలలో ముసలివాడి భాష అత్యంత సహజత్వం కలిగి ఉన్నది. అతడు నిరక్షరాస్యుడైనప్పటికినీ అడవికి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం అవగాహన అతనికి ఉంది. అతనిది జంతువులకు దగ్గరగా నివసించిన జీవితం. జీవితానుభవమూ, శారీరక దృడత్వము, మనో ధైర్యము, అంతకుమించి ఆత్మ విశ్వాసము అతని వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మనవడు గోపాల్ మినహా తనకు ఎవరూ లేరు. అతడికి పందులే సర్వస్వము. అవే స్థిర చర ఆస్తులు.
పందుల పెంపకమే ప్రధాన వృత్తిగా చేపట్టిన ముసలివాడు ఒకనాడు తన సుక్కపంది అడవిలో తప్పిపోయినందుకు దాన్ని వెతకటం ప్రారంభిస్తాడు. తన చేతిలో సాంప్రదాయపు ఆయుధాలైన ఈటె మరియు కత్తి మినహా మరి యే ఆయుధాలు లేవు. కొంత జ్వరంతో ఉన్నప్పటికీ అలవాటు ప్రకారం తాగిన కల్లు అతడిని ఉరకలేయిస్తుంది. దట్టమైన అడవిలో రాత్రి సమయాన తప్పిపోయిన సుక్కపందిని వెతకటం అంటే అంత సులువైన పనిగాదు. సుక్కపంది కాలిగిట్టల గుర్తులు జాడ దొరికినప్పటికీ, అది ఖచ్చితంగా ఎక్కడ వెళ్ళిందనే సందేహం ముసలివాడిని కలవరపెడ్తుంది. అడవిలోకి కాలుపెట్టిన కొత్తవారిని గుర్తించి తోటి గువ్వ అరవటం మొదలు పెట్టడంతో సుక్కపంది వెళ్ళిన దిశ, అది తీంట్ర పొదల్లో సలుగులను ఈనిన జాడ తెలుసుకోవటం ముసలివానికి సులభమవుతుంది. తోటి గువ్వ అరుపు మూలంగానే సుక్క పంది జాడ తెలుసుకున్నందుకు, ఆ పక్షికి తాను చేయగలిగిన సహాయమేమిటన్నది ఆలోచించుకుంటాడు. తోటి గువ్వ నిరంతరముగా అరవడంతో ముసలివాడికి దానిపై ఉన్న నమ్మకం సడలిపోతుంది. అసలు దానిపై అసహ్యమే పుట్టుకొస్తుంది. ఒకవైపు తోటి గువ్వ అరుపు సుక్కపంది జాడ తెలుసుకోవడానికి దోహదపడినా మరోవైపు తోంట్రి పొదవైపు గుంట నక్కలు రావడానికి దారి చూపడం, ఆ పక్షిపై ముసలివాడికి కోపం రావటం, చివరికి దాన్ని చంపివేయటం జరుగుతుంది. అప్పుడు ముసలివాడు తన మనసులో ఇలా అనుకుంటాడు “తోటి గువ్వలో లోభత్వం లేదు. వాడు అరవడంలో దురుద్దేశం లేదు. ద్రోహతలంపు లేదు. దానిలో అమాయకత్వం తప్ప మరేమీ లేదు. ఐతే ఒక్కొక్కసారి దుర్మార్గుని కన్నా అమాయకుని వల్ల ఎక్కువ కీడు జరుగడం కద్దు“.
ముసలివాడు సుక్క పంది ఈనిన పది సలుగులను చూసి ఎంతో ఆనందపడిపోతాడు. తన సహజ భాషలో ముసలివాడు ఇలా అంటాడు. “పది మంది సుక్కనాకొడుకులు పుట్టినారు. ఒరే సుక్కనా కొడుకుల్లారా! రొమ్ముల్దగ్గిరేందిరా తారుకులాడతా ఉండారు?”
జంతువులకు వాసనతో వస్తువును గుర్తించే శక్తి ఉంటుంది. కాబట్టి గుంటనక్కలు తీంట్ర పొదపై దాడి చేయటానికి సిద్ధమై వస్తాయి. వాటి బారి నుండి సుక్కపందితో పాటు దాని సలుగులను కూడా కాపాడాలనే నిశ్చయంతో ఉంటాడు ముసలివాడు. ఒకవైపు వస్తున నక్కనుద్దేశించి ముసలివాడు ఇలా అంటాడు. “రారా లోభినాకొడకా, ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగితివో? ఈ తీంట్ర పొద దగ్గర చావు రాసి పెట్టి వుంది“. బాగా కోపంగా ఉన్న సుక్కపంది, గుంట నక్కను చీల్చివేస్తుంది. మరో నక్కను ముసలివాడు ఈటెతో చంపేస్తాడు. ముసలివాడు తనను రక్షించుకోవటానికి సుంక్రేసునెక్కి కూర్చుంటాడు. సుక్కపందికి తాను యజమాని అయినప్పటికీ, అది దాడి చేస్తే తాను మిగలనన్న వాస్తవం అతనికి తెలుసు. మరో నాలుగు నక్కలు నలువైపుల దాడికి పూనుకుంటున్న క్రమంలో సుక్కపందిని చంపి దాని సలుగులనైనా కాపాడుకోవాలని అనుకుంటాడు. అలా చంపక తప్పలేదు. సలుగుల్ని కాపాడుకోవటం కోసం నక్కలను, తోటి గువ్వను, చివరకు సుక్కపందినీ చంపుకుంటినని వాపోతాడు కూడా. ఐతే వాటిని కాపాడుకోవటం ఒక ఎత్తు, కాపాడుకున్న సలుగుల్ని పొద్దు పొడిచేలోగా తన గుడిసెకు చేర్చటం మరొక ఎత్తు. సలుగుల్ని కాపాడుకున్నంత మాత్రాన యుద్ధం ముగిసింది అనుకోడు. సుక్క పంది దాడిలో తీవ్రంగా గాయపడినప్పటికీ తను మనోధైర్యాన్ని కోల్పోలేదు. ముసలివాడు యవ్వనంలో తాను సాధించిన ఘనకార్యాలను మననం చేసుకుంటూ తనను తానే ఉల్లాసపరుచుకుంటూ రాత్రంతా మెలుకువగా ఉంటూ సలుగుల్ని కాపాడుకుంటాడు.
దురదృష్టవశాత్తు రెండు సలుగుల్ని నక్కలు ఎత్తుకుపోగా మార్గమధ్యంలో మిగిలిన ఎనిమిది సలుగుల్ని రాబందులు పొడిచి వేస్తాయి. ఈ సంఘటటనతో ముసలివాడు హతాశుడైపోతాడు. అతడి కన్నీరు మున్నీరై కిందకు జారి చెంప మీదున్న మడతల్లో యింకిపోయాయి. “యుద్ధం ముగిసింది. నేను పూర్తిగా ఓడిపోయాను” అనుకుంటాడు. ఇలాంటి ఆలోచనలకి స్వస్తి చెప్పాలని కూడా అనుకుంటూ జీవితంలో అది తన చివరి రోజు కాదనే నిబ్బరాన్ని కలిగించుకుంటాడు. లెక్కలేనన్ని ఎదురు దెబ్బలు తిన్న ముసలివాడికి అది చివరి రోజు కానేరదు.
ఈ నవలంతా చదివిన తర్వాత ముసలివాడు జయించిదేమిటన్న ప్రశ్న కలుగుతుంది. భౌతికంగా అతడు జయించినట్లు కనబడదు. తన జీవితంలో ఎన్నో గుణపాఠాలు నేర్చుకున్నాడు. తన అనుభవాలే తనకు గుణపాఠాలయ్యాయి. చివరికి కాపాడుకున్న నాలుగు సలుగుల్ని సైతం రాబందులు మాంసపు ముద్దలుగా మిగిల్చాయి అన్న వాస్తవాన్ని జీర్ణించుకోలేని పరిస్థితి నుండి “నేను పూర్తిగా ఓడిపోయాను” అనే మాట బయటికొచ్చింది. ఇంత భయంకరమైన సంఘటన అతడికి నిరాశ, నిస్పృహలు కలిగించినప్పటికినీ, ఆత్మహత్య చేసుకోవటం మినహా మరేమీ లేదన్న ఆలోచనలు తన మనసుపై దండెత్తినప్పటికినీ, మొక్కవోని మనోధైర్యంతో తన భవితను దృష్టిలో ఉంచుకొని వాటిని విజయవంతంగా ఎదుర్కొన్నాడు. ఇలా మనో ధైర్యాన్ని దెబ్బతీసే ఆలోచనలను అధిగమించాడు. సుక్కపంది యజమానియైన తనను కూడా లెక్కచేయకుండా దాడి చేసి తన తొడలను చీల్చినపుడూ తన యుద్ధాన్ని కొనసాగించాడు. గతంలో పశువుల కాపరి తన మొత్తం పశువులు మరణానికి గురైనపుడు ఆ భయంకరమైన దృశ్యాన్ని చూసి తట్టుకోలేక ఉరివేసుకొని చనిపోయిన వైనం ముసలివాడికి గుర్తొకొస్తుంది. ఇప్పుడు ముసలివాడి పరిస్థితి సరిగ్గా అదే. కానీ ఆ పని చెయ్యడు. అటువంటి పిరికి ఆలోచనను జయించి తన బతుకును నిలుపుకున్నాడు. ఇది ముసలివాడు సాధించిన ఘనవిజయం. తన నైతిక విజయానికి తనలోని అనుభవం, సహనం దోహదం చేస్తాయి. కేశవరెడ్డి ఈ నవలలో ప్రయోగించిన ఉపమాన ఉపమేయాలు తన రచనా శైలిని మరింత రక్తి కట్టిస్తాయి. అతడిలో ఉన్న భావ సంపదనూ, భాషపై ఉన్న పటుత్వాన్నీ నిర్వచిస్తాయి. “కాలుతున్న బండమీద వదలబడిన చీమవలె“, “సందె చీకటిలో ఆకటిగొన్న మిణుగురు పురుగువలె“, “సూదికి దారాన్నెక్కిస్తున్న వాని ముఖంలోనూ, సగం బయటకు వచ్చిన పెయ్యదూడను గర్భం నుండి లాగుతున్న జంతువైద్యుని ముఖంలోనూ ఉండే ఏకాగ్రత అతని ముఖంలో కనిపిస్తున్నది“, “నీచత్వాన్ని మూటలు కట్టిపడవేసినట్లు ఆ మూడు నక్కలు పడిఉన్నాయి” వంటి నిశితమైన ప్రయోగాలు పాఠకునికి ఆసక్తి కలిగిస్తూ చెరగని ముద్ర వేస్తాయి. ఇలాంటి ప్రయోగాలు నవల నిండా పరుచుకొని ఉన్నాయి. అడవిలో ఉండే రకరకాల చెట్ల పేర్లను పేర్కొన్న తీరు రాయలసీమ ప్రాంత ప్రజల మాండలికాలను గుర్తు చేస్తుంది.
నవలలో ముసలివాడు చివరకు ఆశావాదిగా మిగిలిపోతాడు. అతడు పాఠకులకు ఒక స్ఫూర్తిని కలిగిస్తాడు. గిరిజన తెగల సంస్కృతి, సాంప్రదాయాలకు ప్రతినిధిగా నిలిచిన ముసలివాడు విజయుడే కాదు మృత్యుంజయుడు కూడా. ఇలా అట్టడుగు వర్గాల ప్రజలను కథానాయకులుగా నిలబెడుతూ సాహిత్య, సంస్కృతుల పరంగా వారికి పెద్ద పీట వేస్తున్న కేశవరెడ్డి అభినందనీయుడు.

దీని పైనే పొద్దు అందిచిన సమీక్ష కూడా ఒకసారి చూడండి.
http://poddu.net/?p=43