ఫిబ్రవరి, 2007ను భద్రపఱచు



తొలి తెలుగు అడుగులు

డా. దార్ల వెంకటేశ్వర రావు,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

శ్రీ తో ప్రారంభమైన తెలుగు సాహిత్యం శ్రీ శ్రీ తో ఆధునిక సాహిత్యం గా మారిందని కొంతమంది చమత్కరిస్తుంటారు. నన్నయ్య శ్రీమదాంధ్ర మహాభారతాన్ని శ్రీ వాణీ గిరిజాశ్చిరాయశ్లోకంతో ప్రారంభించారు. మహాప్రస్థానాన్ని రాసి శ్రీ శ్రీ ఆధునిక కవిత్వాన్ని గొప్పమలుపు తిప్పగలిగారు. అందువల్ల అలా అనటం పరిపాటిగా వస్తుంది. కానీ, ఆధునిక తెలుగు సాహిత్యం శ్రీ శ్రీ కంటే ముందే ప్రారంభమయ్యిందని సాహిత్యాన్ని పరిశోధన దృష్టితో గమనించేవారు గుర్తిస్తుంటారు. తెలుగు సాహిత్యంలో వేటిని తొలి రచనలుగా భావించాలి? మన తొలి తెలుగు అడుగులు ఎక్కడ ప్రారంభమయ్యాయి? మన తెలుగులో తొలి రచనలు ఏమిటి? అనే అంశాలను ఈ తొలి తెలుగు అడుగులుశీర్షిక ద్వారా విశ్లేషించాలనుకుంటున్నాను.

మన సాహిత్య చరిత్ర కారులు ఈ విషయం లో ఇప్పటికే విశేషమైన పరిశోధనలు చేశారు. అయినా చాలా అంశాలు నేటికీ పునః పరిశోధనలవైపు పయనిస్తూనే ఉన్నాయి.తెలుగు వారి చరిత్రతో పాటు తెలుగు కవిత్వం కూడా ప్రారంభమైనట్లు పరిశోధకులు భావిస్తున్నారు. క్రీ.పూ. 200 నాటికే తెలుగుభాషలో పాటలు ఉన్నట్లు శాతవాహన రాజు హాలుడు సంకలనం చేసిన గాథాసప్తశతి లో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఆ గ్రంథం ప్రాకృతగ్రంథం. కనుక, ప్రాకృతం లోకి తెలుగు పదాలు వెళ్ళినట్లు మన పరిశోధకులు ఒక నిర్ణయానికి వచ్చారు. తెలుగు భాష గురించి ఇలా అన్వేషించగా జానపదగేయాలరూపంలోనూ, కొన్ని శాసనాలలోనూ తొలి తెలుగు అడుగు జాడలు కనుక్కోగలిగారు. అలా శాసనాలలో దొరికిన తొలితెలుగు పదంగా నాగబు లో గల బుశాసనాలలో కనిపించిన తొలి తెలుగు పదంగా మన పరిశోధకులు గుర్తించారు. ఈ పదం అమరావతి స్థూపశాసనంలో దొరికింది. మూడో, నాల్గో శతాబ్దాలకు చెందిన ఈ శాసనంలో ఈ పదాన్ని వేటూరి ప్రభాకర శాస్త్రి గారు కనుగొన్నారు. నాగ అనేది సంస్కృతమో, ప్రాకృతమో అనుకున్నా బుఅనే ప్రత్యయాన్ని బట్టి మాత్రం దీన్ని తొలి తెలుగు పదంగా భావిస్తున్నారు. మనకు దొరికిన తొలితెలుగు శాసనం మాత్రం క్రీ.. 575 నాటి ఎర్రగుడిపాడు శాసనం. రేనాటి చోళరాజు ఎరికల్ ముత్తురాజు దీన్ని వేయించారు. క్రీ.. 848-892 వరకు పరిపాలించిన తూర్పు చాళుక్య రాజు గుణగ విజయాధిత్యుని కాలంలో తొలి తెలుగు పద్య శాసనం వేయించినట్లు ఆధారాలు లభిస్తున్నాయి. ఈ శాసనం లో మనకు లభిస్తున్న తొలితెలుగు పద్యం తరువోజ.

ఇలా పద్యాలలో శాసనాలు లభిస్తున్నా, తొలి తెలుగు కావ్యం మాత్రం నన్నయ రాసిన శ్రీమదాంధ్ర మహాభారతం గా నే పరిశోధకులు భావిస్తున్నారు. నన్నెచోడుడు రాసిన కుమార సంభవం ,నన్నయ కంటే ముందు వచ్చిన కావ్యం అని కూడా ఒకవాదం లేక పోలేదు. కానీ , వివిధ ఆధారాలను అధ్యయనం చేసిన తరువాత తొలితెలుగు కావ్యం శ్రీమదాంధ్ర మహాభారతం అని అత్యధికులు అంగీకరిస్తున్నారు. శ్రీమదాంధ్ర మహాభారతం ఈ పద్యంతో ప్రారంభమవుతుంది.

శ్రీ వాణీ గిరిజాశ్చిరాయ దధతో వక్షోముఖాజ్ఞ్గేషు యే

లోకానాం స్థితి మావహంత్య విహతాం స్త్రీపుంస యోగోద్భవాం

తే వేదత్రయమూర్తయ స్త్రీపురుషా స్సంపూజితా వస్సురై

ర్భూయాసుః పురుషోత్తమాంభుజభవ శ్రీకంధరా శ్శ్రేయసే

ప్రతిపదార్థం: యే= ఏ విష్ణు బ్రహ్మ శంకరులు; శ్రీ, వాణీ, గిరిజాః= క్రమంగా లక్ష్మీ సరస్వతీ పార్వతులను; చిరాయ= చిరకాలం నుండి; వక్షః ముఖ, అజ్ఞేషు=రొమ్మునందూ, మొగమునందూ, దేహమునందూ; దధతః= ధరిస్తున్నవారై; స్త్రీ, పుంస, యోగ + ఉద్భవామ్= స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన; లోకానామ్= లోకముల యొక్క; స్థితిమ్= స్థిరత్వాన్ని (నిలకడను); అవిహతామ్= అవిచ్ఛిన్న మైనదానిగా; ఆవహన్తి = చేస్తున్నారో; వేద, త్రయ, మూర్తయః= ఋగ్యజుస్సామా లనే మూడు వేదాల రూపాలు గలవారున్నూ; సురైః= దేవతల చేత; సంపూజితాః= పూజింపబడిన వారున్నూ అయిన; తే= ; పురుషోత్తమా + అంభుజభవ, శ్రీకంధరాః= విష్ణువు, బ్రహ్మ, శివుడు - అనబడే; త్రి,పురుషాః= త్రిమూర్తులు; వః= మీకు; శ్రేయసే= మేలుకొరకు (మేలు చేసేవారుగా); భూయాసుః= అగుదురు గాక!

తాత్పర్యం: ఏ విష్ణు బ్రహ్మ శంకరులు చిరకాలం నుండి క్రమంగా రొమ్మునందూ, ముఖమునందూ, దేహమునందూ, లక్ష్మీ సరస్వతీ పార్వతులను ధరిస్తున్నవారై, స్త్రీ పురుషుల సంయోగం వలన పుట్టిన లోకాల సుస్థిరత్వాన్ని అవిచ్ఛిన్నంగా కలిగిస్తున్నారో, మూడు వేదాల రూపం కలవారున్నూ, దేవతల చేత పూజింపబడిన వారున్నూ అయిన ఆ విష్ణు బ్రహ్మ శంకరులనబడే త్రిమూర్తులు మీకు శ్రేయస్సును కలిగించే వారౌతారు గాక!ఇది మన ఆంధ్రమహాభారతంలోని తొలి తెలుగు శ్లోకం. భారతీయ గృహస్థ ధర్మాన్ని కూడా ఈ శ్లోకంలో నిర్దేశించారు.

ఇలా మన తొలి తెలుగు అడుగులు ఎలా ప్రారంభమయ్యాయో ఎలా కొనసాగాయో ఈ శీర్షిక ద్వారా మరో సారి గుర్తు చేసుకుందాం.

(సశేషం)

మా అమ్మ!

నీరుకట్ల రామచంద్ర, (ఎం.)

హైదరాబాదు విశ్వవిద్యాలయం

పల్లేరు ముండ్ల దారిలో

పయనం నా పల్లెది.

కర్నూలు మొదలు అమెరికా వరకు

అన్నం పెడ్తుంది.

అందరికిఆనందాన్ని పంచి

తాను మాత్రం కష్టాల ముసుగులో నిదురోతుంది.

ప్రైవేటీకరణ కుట్రలో

నా పల్లె లక్షణరేఖ దాటుతున్న సీత.

నిలువెల్లా గాయాలైనా

నిర్మల సంగీతాన్ని,గాయత్రి మంత్రాల్ని,

ఆలంపించే వేణువు.

నా పల్లె ఆకలిని కడుపులో దాచుకొని

బిడ్డల నోటికి గోరుముద్దలు తినిపించే

మా అమ్మ పల్లె.

కళ్ళు మౌన భావాల లోగిల్లు

శ్రీనివాస్ రెడ్డి, ఎం.ఏ (ఎం.ఫిల్),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

కళ్ళు
మౌనభావాల లోగిల్లు
సుమధురస్వప్నాలకు పొదరిల్లులు
రంగురంగుల లోకాన్ని
తమలో యిముడ్చుకున్న హరివిల్లులు
సౌందర్యాన్ని సుతిమెత్తగా
స్పృశించే చిరుజల్లులు

కళ్ళు
మౌన భావాల లోగిల్లు
కానీ వీక్షణం తీక్షణమైతే
వాటి రూపం వడగల్లు.

కళ్ళు చిన్నవే కావచ్చు
అయినా అవి ప్రపంచాన్ని సైతం
తమలో బంధిస్తాయి
తమ రెప్పలను కదిలిస్తూ
చిరునవ్వులు చిందిస్తాయి.

ప్రకృతిలోని పచ్చదనాన్ని
ప్రభాతపు తొలికిరణాన్ని
పడుచు పిల్ల పరువాన్ని
శరత్కాళ చంద్రికను
ఆస్వాదిస్తూ ఉండాలని
కళ్ళకు ఆశ.

కళ్ళు మాట్లాడతాయి.
మౌనం వాటి భాష.
చిన్నవైన కళ్ళల్లో
సింధువంత భావాల్నీ
మౌన సరాగాల్నీ పలికిస్తాయి..

కనుమరుగైన నేస్తాన్ని కలుసుకోవాలంటే
ఒక్క క్షణం కళ్ళు మూసుకుంటే చాలు
రూపం కళ్ళలో ప్రత్యక్షమౌతుంది.
అందుకనే కళ్ళు
ఊహల్ని ఫీడ్ చేసుకునే కంప్యూటర్లు.

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో…

-వడ్లూరి కేశవా చారి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ప్రభూ!
రోజు నీ పాదాలను కడుగుతున్నాను,
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో.

నా స్వామీ!
నన్ను నీలో చేర్చుకోవూ!
నీ గుండెల నిండా అదుముకోవూ!
నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!
అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.
నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

యోధుడా!
నీ కళ్ళల్లో కాంతిని చూసాను.
ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!
విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.
మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!
అది చిత్తరువైతేనేం,
ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన
అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,
అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర.
అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు
ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

వీరుడా!
భయపడొద్దంటావ్.
గురువా!
బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.
నిత్య ప్రేరకా!
నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.
యోగీ!
ధ్యానమే నీ జీవనయానమంటావ్.
మౌనీ!
నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు
మూర్తీభవించిన సంపూర్ణ భారత యువకా!
నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక
నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,
దివ్యతేజస్సుతో ప్రకాశించిన ప్రవర్తకా!
నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు
నేటికీ కడలి తరంగాలై అనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

మహాత్మా! మహితాత్మా!!
వ్యక్తీ!శక్తీ!!
నరేంద్రుడా! వివేకానందుడా!!
మళ్ళీ రావా!
నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.
మళ్ళీ రావా!
నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!
రోజు నీ పాదాలను కడుగుతున్నాను
ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో.

చీకటి క్షణాలు

-మే రా

హైదరాబాదు విశ్వవిద్యాలయం

చీకటి నా ఆందోళన.

నన్ను నాకే కనిపించనంత

దూరం చేస్తుందని తెలిశాక!

దినదినం HI Vచ్చై,

చాపకింది నీరై,

వాగై, వరదై, ఉప్పెనై,

జీవన సౌధాల్ని మెల్లిగా

కంపింపజేస్తుంటే,

లోలోని అంతరంగం

ఆవేదనల మునకవుతుంది.

కోటి పర్వతాల భారాన్ని,

లక్ష సముద్రాల అలజడిని,

గాజు కుప్పెలో దాయలేక,

ముహూర్తాలకై తూగలేక,

ప్రశాంత సీమల్లో

నిద్రకు వెతుకుతూనేఉన్నారు.

నన్నల్లిన తీగలన్నీ

ఇప్పుడు చిక్కుపడ్డాయి.

నలుగుట్లో నవ్వు కలిపినా

ఏవో చీకటి క్షణాలు

వెంటాడుతూనే ఉన్నాయి.

పాప ఫలం శాపమైందో

నుదుటి గీత వంకరైందో

శూన్యాన కనుపాప శోకంతో

కాలాన్ని భారంగా కౌగిలిస్తూనేఉంది.

కరడు గట్టిన

ఏ ఆకలో పడగ విప్పి

ఈ చీకటి దారుల్లోకి

మనుష్యుల నెట్టుతూనే ఉంది.

ఒక అడుగు పిడుగై

చెదిరిన చరిత్ర పుటలు

ఆకాశానికెగురుతూనే ఉన్నాయి.

నిషిద్ధమానంలో

ప్రసిద్ధమయ్యేకంటే

ప్రపంచమావలకు

సంసిద్ధమవడమే మేలనుకోరాదు.

మరణంలో అమరత్వం సిద్ధించేలా

మృత్యువు ఒడిలో నుంచి

జీవన సౌందర్యాన్ని చాటాలి సుమా!

నేస్తం!

జె. స్వప్న,
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

జీవిత కోణాలు వివరించినపుడు
తల్లిలా కనిపిస్తావు.
బరువు బాధ్యతలు స్వీకరించినపుడు
తండ్రిలా కనిపిస్తావు.
కష్ట సుఖాలు పంచుకున్నప్పుడు
తోబుట్టువులా కనిపిస్తావు.
హితబోధలు చేసినపుడు
గురువులా కనిపిస్తావు.
నాకు నచ్చనిది కాదన్నప్పుడు
శత్రువులా కనిపిస్తావు.
నన్ను వెన్నంటి ఉన్నప్పుడు
నా నీడలా కనిపిస్తావు.
అన్ని బంధాలు ఒక్కటై నువ్వు
ప్రాణ నేస్తమై కనిపిస్తావు.

వర్షించని మేఘాల సాక్షిగా!…

శివకుమార్, (ఎం.),

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

పాలకంకుల పైరు చేనూ,
మిట్టమీది మిరప తోటా,
పిందెలేసిన పత్తిపంటా,
పగుళ్ళిచ్చిన నేల నోళ్ళతో
ఎదురు చూస్తున్నాయి
వానచినుకులొస్తాయని
వర్షించని మేఘాల సాక్షిగా!

కడుపెండిన వీధి బావీ,
అడుగింకిన ఊరి చెరువూ,
బక్కచిక్కిన పిల్ల కాలువా,
ఆత్రంగ ఆకాశం కేసి చూస్తున్నాయి
వానచినుకులొస్తాయని
వర్షించని మేఘాల సాక్షిగా!

డొక్కలెండిన బర్రె గొడ్లూ,
గుక్కనిండని లేగదూడలూ,
మూతులెండిన గొర్రెపిల్లలూ
మోరలెత్తి చూస్తున్నాయి
వానచినుకులొస్తాయని
వర్షించని మేఘాల సాక్షిగా!

కట్నం ఇవ్వలేక నిలిచిపోయిన పెద్దమ్మాయి పెళ్ళీ,
ఫీజు కట్టలేక ఆగిపోయిన పిలగాడి కాలేజీ చదువూ,
మందులు కొనక నట్టింట్లోనే సందకాడ పోయిన ఆలి అసువులూ,
కసువు లేక కబేళానికి పోతూ రంకేసిన కర్రావు కన్నీళ్ళూ,
వేకువజామున చేని గట్టున వేపచెట్టుకు రైతు మెడలో వేళ్ళాడిన ఉరితాడూ
ఎదురుచూస్తున్నాయి
ఇకనైనా వానచినుకులొస్తాయేమోనని!
వర్షించని మేఘాల సాక్షిగా!!

తాళాలేసిన ఇళ్ళ తలుపులూ,
వెలవెలబోయిన వీధి అరుగులూ,
ధూపదీపాల్లేని రాములోరి దేవళమూ,
పాడుబడిన ప్రాథమిక పాఠశాలా,
రోగుల్లేని ప్రభుత్వాసుపత్రీ,
పశువులుతిరగని చెరువు గట్టూ,
వలసపోయిన పల్లెటూళ్ళూ,
ఎదురుచూడ్డం మానేశాయి
ఇక ఎప్పటికీ వాన చినుకులు రావని
వర్షించని మేఘాల సాక్షిగా!!!

ఏమైనా అవుతా!

-అపూర్వం,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

నా ఊహాల లోకంలో

ఏమైనా అవుతానేనేమైనా అవుతా!

తొలిపొద్దు రేఖలు వచ్చే తోవల్లో కోయిలపాటవుతా !

తొలకరుల వానలు పొంగే వాగుల్లో పూవుల పడవవుతా!

నిదిరిస్తే ముందరకొచ్చే

స్వప్నాల వీధుల్లో రెక్కల గుర్రాన్నవుతా!

వయ్యారి ఒంపుల్లో అందాలు ఒలికించే

వన్నెల వెన్నెల కిన్నరసాని నేనవుతా!

నండూరి ఊహల నుంచి వరిచేలోకి నడిచొస్తూ

వలపుల కొడవలి తెచ్చే ఎంకికి ఆసామినవుతా!

చుక్కల్లో చంద్రుడినవుతా!

దిక్కుల్లో దీపం అవుతా!

స్పర్శించే గాలిని అవుతా!

సరివేళ జాలిని అవుతా!

ఆకలి కడుపుకి అన్నం అవుతా!

దాహం వేస్తే నీటిని అవుతా!

తీరని ఆశలకు మార్గం నేనవుతా!

ఆఖరి శ్వాసకు ఆయువు నేనవుతా

తోడూ, నీడల్లే నా స్నేహానికి

ఏమైనా అవుతా! నేనేమైనా అవుతా!!

« వెనుకటి పుటము


Telugutalli_image

a

 

ఫిబ్రవరి 2007
సో మం బు గు శు
    మార్చి »
 1234
567891011
12131415161718
19202122232425
262728  

మా పాఠకులు