మార్చి, 2007ను భద్రపఱచు

కథన పద్ధతి : ఒక విశ్లేషణ పరికరం

(కథనంలో సరళత, సంకీర్ణతల నిరూపణ )

- ఆచార్య పరిమి రామనరసింహం,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సారాంశం: కథాకథనంలోని సరళతను; సంకీర్ణతను నిరూపించడం కొరకు ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాస పద్ధతి అనే ఒక విశ్లేషణ పరికరం ఈ వ్యాసంలో మరొక మారు ప్రతిపాదించబడుతున్నది. నిరూపణకు ఆధారంగా మధురాంతకం రాజారామ్రచించిన రెండు కథలు విశ్లేషించి చూపబడతాయి.

   సాహిత్య విమర్శ విషయ పరంగానూ, విధానపరంగానూ ఉండవచ్చు. భాష శబ్దం, అర్థం అనే రెండు ముఖాలతో ప్రవర్తిల్లినట్లే భాష చేత ఏర్పడే సాహిత్యం కూడా విషయం, విధానం అనే రెండు ముఖాలతో వెలువడుతుంది. ఆ కారణంగా విషయాన్నీ, విధానాన్నీ కూడా మూల్యాంకనం చేయవలసి ఉంటుంది 

pr.jpg 

   పై రేఖా చిత్రంలో (రామ నరసింహం: 1996: 4; రామనరసింహం 2005: 129) చూపిన విధాన విమర్శ (శైలీ శాస్త్రం) లోని భాషా తత్వ సంబంధి విభాగాన్నే M.A.K.Halliday వంటి భాషా/ శైలీ శాస్త్రవేత్తలు linguistic stylistics (భాషా వైజ్ఞానిక శైలీ శాస్త్రం) అన్నారు (Halliday 1964: 302-307). రెండవదైన విషయ నిర్వహణ సంబంధి విభాగమే ప్రస్తుతం ఉద్దేశించిన అధ్యయన లక్ష్యం. విషయాన్ని చెప్పే విధానంలో భాషను (అంటే శబ్దార్థాలను) రచయిత/త్రులు ఎట్లా ఉపయోగించుకున్నారు అనేది ఉపవిభాగం కాగా, ఆ విషయాన్ని నిర్వహించిన తీరు రెండవ ఉపవిభాగం అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్న అంశం ఆధునిక కథానికలలో విషయ నిర్వహణకు సంబంధించినది. కథన పద్ధతితో రచయిత/త్రులు అనుసరించే వ్యూహాలు (Strategies), తంత్రం (techinique) కథానికకు విశిష్టతను చేకూరుస్తాయి. కథన పద్ధతిలో అగ్రీకరణం‘ (fore grounding) ఏ విధంగా చోటు చేసుకుంటుంది, అది (అగ్రీకరణం) ఆ కథన పద్ధతికి వైశిష్ట్యాన్ని సంతరించటంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే అంశానికి మాత్రమే ఈ వ్యాసం పరిమితం అవుతుంది.

   అగ్రీకరణం: అగ్రీకరణం అనేది భారతీయ ఆలంకారికులు చెప్పిన వక్రతకు తుల్యం. సర్వసాధారణంగా చెప్పవలసిన పద్ధతి ఒక విధంగా ఉండగా చెప్పే పద్ధతి మరొక విధంగా ఉండటం అగ్రీకరణం‘. అయితే, చెప్పవలసిన పద్ధతికీ చెప్పే పద్ధతికీ సంబంధం ఉంటుంది. చెప్పవలసిన దాన్ని వెనక్కు (back groundలో నేపథ్యంలో) ఉంచి దానికి సంబంధించినదే అయిన మరొక పద్ధతిని ముందుకు తేవటమే అగ్రీకరణం (fore grounding). ( అగ్రీకరణానికి సంబంధించిన మరిన్ని వివరాలకు దాని ప్రతిపాదకుడైన ముకరోవ్‌స్కీ వ్యాసం [Mukarovsky 1970:40-55], దాన్ని తెలుగులో వివరించిన ఈ వ్యాసకర్త వ్యాసం [రామనరసింహం 2005: 131-140] చూడవచ్చు.)

   ఇప్పుడు, కథానికలలోని ఇతివృత్త నిర్వహణలో (కథనంలో) అగ్రీకరణం ఎట్లా పని చేస్తుందో, కథనంలో సరళతకూ, సంకీర్ణతకూ ఎట్లా కారణం అవుతుందో పరిశీలిద్దాం.

   కథ కొన్ని ఘటనల సంపుటి అనుకుంటే, ఆ కథను మౌఖికంగా చెప్పేటప్పుడు ఆ ఘటనలను అవి జరిగిన కాలక్రమంలో చెప్పటం జరుగుతుంది. దీన్ని ఘటనాంశ క్రమం అందాం. ఘటనాంశ క్రమం అంటే ఘటనల కాలానుక్రమం (chronological order) అన్న మాట. ఆధునిక కథా రచయితలు ఘటనలను కాలానుక్రమంలో కథనం చేయరు. మార్చి చేస్తారు. ఎక్కడో మధ్యలో ఒక ఘటనతో కథను ఎత్తుకుంటారు. దాన్ని ఎత్తుగడ (take – off point)’ అందాం. సాధారణమైన కాలానుక్రమంలోని మొదటి ఘటన ఆరంభంలేదా ఆరంభ బిందువు‘ (starting point) అందాం. ఆధునిక కథానికలో ఎత్తుగడ ఆరంభ బిందువు కానక్కరలేదు. ఈ విధంగా రచయిత కథనం చేసిన ఘటనల క్రమాన్ని కథనాంశ క్రమం అందాం. కనుక సహజంగా చెప్పవలసిన క్రమం ఘటనాంశ క్రమం (ఘటనల కాలానుక్రమం) కాగా దాన్ని నేపథ్యంలో ఉంచి మరొక క్రమాన్ని అంటే కథనాంశ క్రమాన్ని ముందుకు తేవడం - అంటే అగ్రీకరణం చేయటం జరుగుతుంది. ఈ రెండు క్రమాలను పోల్చి చూపటం ద్వారా కథన పద్ధతిలోని సరళతనూ లేదా సంకీర్ణతనూ నిరూపించవచ్చు. ఈ నిరూపణకు ఈ వ్యాస కర్త ప్రతిపాదించిన అధ్యయన పద్ధతే ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాసం (superposing of the chronological order of events and narrative events)’ (Ramanarasimham 1985). 

   ఈ పద్ధతిలో కథలోని ఇతివృత్తాన్ని ఘటనలుగా విడగొట్టుకొని వాటిని కాలానుక్రమంలోనూ, కథనాంశ క్రమంలోనూ అమర్చుకొని ఆ రెండు క్రమాలనూ ఉపరిన్యాసం (superpose) చెయ్యటం జరుగుతుంది. దీనితో కథన క్రమంలోని అగ్రీకరణాన్ని, తద్వారా కథన పద్ధతిలోని సరళతనూ, సంకీర్ణతనూ హేతుబద్దంగా నిరూపించవచ్చు.’ (Ramanarasimham 1985).

ఈ విశ్లేషణలో ఉపయోగించే కొన్ని సాంకేతిక పదాలు:

1. ఘటన (event) : ఇతివృత్తంలో గుర్తించదగిన ముఖ్యమైన కథాంశం

2. ఘటనాంశ క్రమం (order of events) : కథలోని ఘటనల కాలానుక్రమం

3. కథనాంశ క్రమం (order of narrative events) : ఘటనలను రచయిత కథనం చేసిన క్రమం

4. ఆరంభం లేదా ఆరంభ బిందువు (starting point) : ఘటనాంశాలలో మొదటి ఘటన

5. ఎత్తుగడ (take of point) : కథనాంశాలలో మొదటి ఘటన. దీన్ని రచయిత మొదటి ఘటనగా చిత్రిస్తాడు.

6. పూర్వ ఘటన (antecedent) : ఎత్తుగడకు ముందు జరిగిన ఘటన

7. ఉత్తర ఘటన (subsequent event) : ఎత్తుగడకు తర్వాతి ఘటన

8. తిరోగమనం (backword moovement or flashback) : కథలోని ఒక ఘటన తర్వాత దాని కంటే కాలగతిలో ముందు జరిగిన ఘటనలను కథనం చెయ్యటం.

9. ముగింపు : కథనాంశాలలో చివరి ఘటన. చదవుట కొనసాగించు ‘కథన పద్ధతి : ఒక విశ్లేషణ పరికరం’

నల్లరేగడి

 - ఆచార్య తుమ్మల రామకృష్ణ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

   నగిరి కాలవంటీ ఎగబడి పెద్ద చెరువు కట్ట మీది కొచ్చేసరికి నారప్ప గుండె గభీమంది. భుజాన వేలాడుతున్న చెనిగి పార తీసి కిందేసినాడు. తలకు చుట్టుకున్న  పైగుడ్డ తీసి మొగం తుడుచుకున్నాడు. నీరెండ కండ్ల మీద పడతావుంటే చెయ్యి అడ్డం పెట్టుకోని చెరువులోకి చూసినాడు. చెర్నో నీళ్ళు కయ్యాలి కిందికి పోయినాయి. తూరుపు తట్టు తిరుక్కోని తూములు పక్క చూసినాడు.
 
   మిట్ట తూములో సుక్క నీళ్ళు రాలడంలేదు. గుంత తూములో జరుగులు రాల్తా వుండాయి. గుంత తూమెత్తితే వున్న కాసిన్నీళ్ళూ నెల్దినాల్లో పూడ్చుకపోతాయి. కట్ట కింద కయిలోల్లు ఎవురో గుంత తూములో సూదిరాయి యేసేసినట్లుండాలి. నీళ్ళలో మునిగి తూములో సూదిరాయి పెరకడం ఎవునెబ్బ తరమూ కాదు.
 
   పదేళ్ళ కిందట ఒకసారి ఇట్లే సంత తూములో ఎవురో సూదిరాయి యేసింటే నీరు కట్టి వెంకటప్ప నీళ్ళలో మునిగి రాయి ఎత్తబోయి ఎంత పొద్దుకూ పైకి రాలేదంట. మాలపల్లి మాలపల్లంతా రెండు పొగుళ్ళు రెండు రేతుర్లు చెరువు కట్ట మీద గుండెలు బాదుకున్నారంట. ఫలితం లేకపోయింది. చెరువు ఎండిపోయినాక ఒకరిద్దరు గుంత తూములోకి లాంతర్లు ఎత్తుకుపోయి చూస్తే ఏముందీ! ఏమీ లేదు. వెంకటప్ప చెరువులో మునిగిన రోజు తలకు చుట్టుకోనుండిన ఎర్రటి అంగవస్త్రం దొరికిందట.
 
   ఇప్పటికీ నీరు కట్టి వెంకటప్ప కొడుకులు ఎవురైనా రైతులు ఏమన్నా అంటే – ‘మీ వూరోళ్ళ మూలంగానే మా నాయన సచ్చిపాయ ‘ అంటూ వుంటారు. ఎప్పుడెప్పుడు విషయాలో నారప్పకి మతికొచ్చినాయి.
 
   చాడకేసిన నాలుగు కయ్యలు దున్ని దుక్కి చేసుకొని నాటుకోకపోతే బతకడం కష్టం. సక్రమంగా పంట చేతికొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. రోజురోజుకీ అప్పులు పెరుగుతున్నాయి. పదేళ్ళ కిందట పది కయ్యలుండేవి. పది కయ్యలు నాలుగు కయ్యలయినాయి. వడ్డీలకు వడ్డీలు కట్టలేక చివరకు కయ్యలు రాసిచ్చినాడు. నారప్ప గొణుక్కుంటూ చెరువుకట్ట దిగి పెద్ద కాలువ తట్టుకు పోతున్న జరుగు  నీళ్ళను నగిరి కాలవకు మళ్ళించి పార కడిగి భుజానికి తగిలించుకొని వచ్చిన దోవ పట్టాడు.
 
   రేగడి మిట్ట కాడికి వచ్చేసరికి నారప్పకు కాళ్ళు గుంజినట్లనిపించి వేప చేట్టు నీడలో కూర్చున్నాడు. పక్క జోబీలోకి చెయ్యి పెట్టి తడిమి తుంట బీడీ ఎత్తుకున్నాడు. ముట్టించి ఒక దమ్ము గట్టిగా లాగాడు. నోటి నిండుకు పొగ లాగి వదిలాడు. ప్రాణం తేలిక పడినట్లనిపించింది. తేరి పార జూశాడు.
 
   రేగడి మిట్ట. పదేళ్ళ కిందట ఉత్త పల్లేరు కంపలు, బొలుసు కంపలు… ఎనుములు, గొడ్లు వూటాడేకి తోలే వాళ్ళూ. ఒకరిద్దరు జొన్నలు, దనాలు చల్లేవాళ్ళు. అవికూడా పండితే పండచ్చు. లేకుంటే లేదు. ఇప్పుడు నల్లరేగడి మిట్ట ననవలాడుతూ వుంది. ఒక తట్టు చెరకు తోట. ఒక తట్టు మిరప తోట. ఇంకో తట్టు టమోటా చెట్లు. ఎవురికైనా ప్రాప్తముండాల. దేవుడి మాన్యం, ఇనాము భూములు ఎందుకూ పనికి రావనుకొని శేషమోళ్ళు సద్ది నీళ్ళకు దారపోసుకున్నారు. నాయుడు తెలివిగా సొంతం చేసుకున్నాడు. ముందుగా బోర్ వేయించాడు. ఎక్కడ లేని వూట పడింది. నేలంతా సదరకట్టి కయ్యలు కట్టించాడు. నాలుగంచులా కల్ల యేయించాడు. నేల మొత్తం సాగవుతూ వుంది. పచ్చని పైరు చూసే సరికి నారప్పకి ప్రాణం పైకి లేసొచ్చింది. ఆనందంగా బీడి కాల్చి పైకి తీశాడు.
 
   ‘ఏం మామా… అబ్బుడే లేస్తివి’ అంగనబోయుడు పలకరించాడు. నారప్ప ఆలోచనల్లోంచి బయటకొచ్చి ‘యాట్నుంచీ రా’ అన్నాడు.
 
   ‘మర వంకలో నుంచి వస్తా వుండేలా మామా’ అంటూ గంగనబోయుడు సమాధానమిచ్చాడు. ‘ఆడేం పనిరా’ మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు నారప్ప. గంగనబోయుడు ఉలుకు పలుకు లేకుండా నిలబడుకొన్నాడు.
 
   ‘కొంపదీసి వంకలో సారాయి గీరాయి కాస్తా వుండారా ఏమీ… కొంపలంటుకు పోతాయండ్రా’ నారప్ప హెచ్చరించాడు. గంగనబోయుడు ఒక నవ్వు నవ్వి మాట మారుస్తూ ‘ఇంతకూ నువ్వేం పని మీద వస్తివి మామా’ అన్నాడు.
 
   ‘ఏమీ లేదురబ్బా. ఎలకమాను మిట్ట కాడ నాలుగ్గంతలు చాడ కలిపినా. పద్దినాలుగా ఇంటికాడికి మడికాడికి నగిరి కాలవంటీ తిరగతా వుండా. కాలవంటీ సుక్కనీళ్ళు సాగి రావడం లేదు. చెరువు కాటికి పోయి గుంత తూములో వచ్చే జరుగులు కాలవకి యెగ్గట్టినా సాగి కయిలో పడితే చాలు. కయ్యి కల్సుకుంటాది. పొద్దంతా పోతా వుంది. కనుమరుగైతే చాలు. ఎవడో ఒగడు మడవ తిప్పేస్తాడు. సందకాడ మల్లా నారు పెరికేదానికీ, నాటే దానికి కూలోళ్ళను పిలవాల. ఈ ముండ నీళ్ళు యెంతకూ సాగి రావడం లేదు’ నారప్ప కడుపులోని అక్కసు వెళ్ళగక్కాడు. చదవుట కొనసాగించు ‘నల్లరేగడి’

పుష్ప సందేశం

డా. జి. అరుణ కుమారి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

   పువ్వు ఒక శక్తివంతమైన సృజనాత్మక మంత్రం. పువ్వు తన సాధుస్వరూపంలో ప్రతికంపనాలను సంతరించుకొని ఒక్కొక్కరిలో ఒక్కొక్క వర్ణణాత్మక భావాన్ని కలిగిస్తుంది. భక్తుడు భగవంతుడికి అర్పించే పుష్పం మంత్ర పుష్పం. శిష్యుడు గురువుకు అర్పించే పుష్పం పూజా పుష్పం. ప్రేమికుడు ప్రియురాలుకు అర్పించే పుష్పం ప్రేమ పుష్పం. ఈ విధంగా పుష్పాలు రకరకాల  భావాలను, సంకేతాలను అనుసంధానిస్తాయి. ఆరాధనకు, పూజకు ప్రకృతి సౌందర్యానికి, ప్రేమకు, జీవన చిద్విలాసానికి ప్రతిరూపాలుగా పువ్వులు ఆవిర్భవించాయి. ఈ ప్రపంచంలోని సౌందర్యమంతా దేవుని చిద్విలాసానికి  అద్దం పడుతుంది. భగవంతుని ఆనంద పారవశ్యపు లాస్యం నిగూఢంగా  సర్వత్రా వ్యాప్తమై ఉందని శ్రీ అరవిందులు “సావిత్రి” మహాకావ్యంలో పువ్వుల సౌందర్యాన్ని గురించి వర్ణించారు. 
 ”The world’s senseless beauty mirrors God’s delight.
 That rapture’s smile is secret every ware
 It flows in the wind’s breath, in the tree’s sap,
 Its hued magnificence blooms in leaves and flowers”.

    శ్వాసలో, చెట్ల అంతస్సారంలో, ఆకులు పువ్వుల రంగులలో ప్రకృతి అనంత సౌందర్యం భగవంతుని ఆనందానికి ప్రతిరూపం. పువ్వులు క్షణభంగురాలు. క్షణిక కాలమే ఉండి వాడిపోవచ్చును. కానీ వాటి సౌందర్యం మన మనస్సులో అనంత భావాల్ని స్ఫురింపజేసి మురిపిస్తాయి, మైమరిపిస్తాయి, రంజింపజేస్తాయి. పువ్వులు మానవ జీవితంతో ముడిపడి వారి సుఖ దుఖాలకు అతీతమైన ఆనందాన్ని కలిగిస్తాయి. “పువ్వు పుట్టగానే పరిమళించు” అన్నట్లుగా మనిషి జీవితం పువ్వు వంటిదే. మానవత్వం అనే పరిమళాన్ని వెదజల్లి జీవించాలని జన్మ సార్థకతను తెలియజేస్తుంది. దైవ మానవ కళ్యాణోత్సవాలలోనూ, మరణ సమయంలోనూ మౌనసంకేతాలను అందిస్తుంది.
 ’Earth’s Flowers spring up and laugh at time and death’.
      - SRI AURABINDO.

   పువ్వులు వికసించి, మరణించి మురిపిస్తాయి. పువ్వుల భాషలు ప్రకృతిలోని మౌన ఆరాధనలు. ‘Flowers are the wordless prayers of nature’ – THE MOTHER. ప్రకృతి పువ్వులతో పులకిస్తుంది. అవి మరణించినా అలంకరణ, స్మృతి, అభినందనల రూపంలోనూ రాణిస్తున్నాయి.

    చదవుట కొనసాగించు ‘పుష్ప సందేశం’

తొలి తెలుగు నవల

డా. దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

   కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన  “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించారు. అంతకుముందు నరహరి గోపాల కృష్ణమశెట్టి “శ్రీ రంగరాజ చరిత్రము” (1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface” లో “Novel” అని చెప్పుకున్నారు.

   పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో పింగళి సూరన రాసిన “కళా పూర్ణోదయం” తొలి తెలుగు నవల అవుతుందన్నారు. దీన్ని “ప్రబంధంగా”నే సాహితీ పరిశోధకుల్లో అత్యధికులు గుర్తిస్తున్నారు. కథ కల్పితమే కానీ, ఆధునిక నవలకు ఉండవలిసిన లక్షణాలు “కళా పూర్ణోదయం” లో లేవని పరిశోధకులు (ఆచార్య జి. నాగయ్య  1996 : 809) స్పష్టం చేశారు.

   కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు 1867 లో రాసిన “మహాశ్వేత”ను  తెలుగులో మొట్ట మొదటి నవల అని నిడుదవోలు వెంకటరావు తదితర పరిశోధకులు పేర్కొన్నారు. కానీ, ఇది బాణుడు సంస్కృతంలో రాసిన “కాదంబరి” కి అనువాదమే తప్ప స్వతంత్ర కల్పన కాదు. అంతే కాకుండా దీనికి ఆదునిక సాహిత్య ప్రక్రియ నవలా లక్షణాలు లేవని, పైగా “మహాశ్వేత” పూర్తిగా లభించలేదనీ పరిశోధకులు భావించారు.

   తెలుగు నవలపై పరిశోధన చేసిన వాళ్ళలో తొలి తెలుగు నవల ఏది అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “ఆంధ్ర నవలా పరిచయం” పరిశోధనలో మొదలి నాగభూషణం శర్మ, “తెలుగు నవలా వికాసము” పరిశోధనలో బొడ్డుపాటి వేంకట కుటుంబరావు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో ఆరుద్ర తదితరులు తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారు రాసిన శ్రీ రంగరాజ చరిత్రము”ను గుర్తించారు.  దీనికే “సోనాబాయి పరిణయం” అనే మరో పేరు కూడా ఉంది. చదవుట కొనసాగించు ‘తొలి తెలుగు నవల’

అంతా ఆంగ్లమే

- బెల్లంకొండ రవికాంత్, (పిహెచ్.డి.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అన్నీ వదిలేశాక
ఇంకా తెలుగుతో పనేముంది.
ఇక్కడ నవ్వినా ఏడ్చినా… అంతా ఆంగ్లమే
మాటలను ఆంగ్లీకరించలేక
భావం గుండె తలపుల్లో నలుగుతూ పెట్టే కేక
స్పష్టంగా వినిపిస్తుంటే
ముసిముసి నవ్వుల మధ్య
యు… నో… అంటూ భుజాలెగరేయడం ఎంతటి విషాదం
*    *    *
పల్లె దీపం చుట్టూ నేను మిణుగురు పురుగులా పరిభ్రమిస్తుంటాను.
పదేపదే నాబాల్యంలోకి తొంగిచూస్తూ
అర్థంగాని భాషలోని సౌందర్యాన్ని
అందంగా తెలుగులోకి చెప్పిన
ఇంగ్లీషు మాస్టార్ని తలుచుకుంటాను
నాకు తెలుగెందుకిష్టమని
మళ్ళీ మళ్లీ నన్ను నేనే ప్రశ్నించుకుంటుంటే
తుషారంతో తడిచిన హృదయం
తడి గీతమై తట్టి లేపుతుంది
*    *    *
నాకెవరన్నా ఆంగ్లం నేర్పండయ్యా…!
నా వాళ్ళ మధ్యే నేను అపరిచితుడనౌతున్నాను
ప్రతిక్షణం భయం తీరాన్ని తాకే అలనౌతున్నాను
నిత్యం ఘనీభవించిన నిశ్శబ్ద నదినౌతున్నాను
తెలుగును కూడా ఆంగ్లంలోనే నేర్చుకుంటున్న
ఈ కొత్త ప్రపంచంలో
రేపటి తెలుగుభాషా ముఖ చిత్రాన్ని ఊహిస్తున్నాను
*    *    *
ఔరా…
దేశభాషలందు తెలుగు లెస్స అని
రాయలెంత భ్రమించాడు
పెద్దనామాత్యా… పెద్ద పండితుడివి గదా
నువ్వైనా చెప్పొద్దూ అంత తొందరపాటు తగదని…!!
భాషా రాజకీయ విమర్శకులారా…
అధికార భాషా సింహాసనంపై కూర్చుని
ఉగాదికొక్క మారు ఉలిక్కిపడి లేచే పీఠాధిపతులారా…
తెలుగారా మీరు చేసిన సేవకు
తెలుగు తల్లి పునీతమైంది
ఇకనైనా మారుమూల మట్టి పలకపై
నాలుగు ఆంగ్ల అక్షరాలను నాటండి
అప్పుడే…
పై చదువుల రెక్కలతో వలసలొచ్చే
పల్లె పక్షులు నిర్భయంగా
ఈ విశ్వవిద్యాలయాలపై వాలతాయి.

 

(విశ్వవిద్యాలయాలలో ఆంగ్లం రాక అవస్థలు పడుతున్న నాలాంటి అందరికి)

డాలర్ ప్రేమల నడుమ…

– పసునూరి రవీందర్, (పిహెచ్.డి.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

యవ్వనం మోసుకొచ్చిన
రాగాలాపనలకు
రూపమిచ్చి ఉక్కిరి బిక్కిరి కమ్మంటావు.

ఫీలింగ్స్ లేవని ఫీలవుతావు.

సినిమాలో లాగ బతకాలని
నా చెవుల్లో ఒక ఎడతెగని చాటింపు వేస్తావు.

క్షమించు ప్రియా…
ఈ అసమర్థ ప్రేమికున్ని!

నీ పెదాల మీద డాలర్ నవ్వుల్ని పూయించలేను.
అమెరికా కలల్ని అందంగా నీకందివ్వలేను.
జీవితాల్ని మార్చే ఒకే ఒక్క ‘ఐడియా’ను కొనివ్వలేను.
నెట్‌వర్క్ కుక్కపిల్లలా నీ వెంట తిరగలేను.

ప్రియా!
అల్సర్‌తో బాధపడే నాకు
పల్సర్ షికార్లు సాధ్యమా చెప్పు?

ఆశలకు ఆకలికి ఉన్న
అగాధ వ్యత్యాసాల్ని కనిపెట్టవా ప్రియా…

కన్‌జ్యూమరిజం సాక్షిగా
వంచించబడుతున్నదెవరో
కనుగొనవా ప్రియా…

ప్లీజ్… ప్లీజ్…
ప్లీజ్… ప్లీజ్…

అనగనగా ఒక భూకామందు…

- గండు మహేందర్, (పిహెచ్.డి.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

   మనకు కథలు కొత్తవేం కాదు. చిన్నప్పటి నుండి కథలు వింటునే ఉన్నాం. చిన్నప్పుడు ప్రతీ రోజు అమ్మమ్మ దగ్గరో, నాన్నమ్మ దగ్గరో, అమ్మ ఒళ్ళోనో కూర్చుని కథలు వినేఉంటాం. ఆ కథలు సామాన్యంగా ” అనగనగా ఒక రాజు. ఆ రాజుకు ఏడుగురు కొడుకులు. వాళ్ళంతా కలిసి వేటకు వెళ్ళారు…” అనే రీతిలోనే ఎక్కువగా ప్రారంభమవుతాయి. ఈ కథలు ఆ రాజులు, రాజ కుమారుల గురించి చెప్పటమే కాక మనకు నీతిని, విజ్ఞానాన్ని కూడా అందిస్తాయి. అలాంటిదే రా.వి. శాస్త్రి రాసిన కథ “పాతదే కథ”.
 
   రా.వి. శాస్త్రి “పాతదే కథ” కూడా “అనగనగా ఒక భూకామందు. ఆయనకు ఏడుగురు కొడుకులున్నారు. వాళ్ళంతా కూలీల వేటకు వెళ్ళారు…” అనే పాత పద్ధతిలోనే ప్రారంభమయింది. అయితే చెప్పిన పద్ధతి పాతదే అయినా ఇందులోని విషయం కొత్తది. పాత కథల్లో మనకు రాజులు, రాకుమారులు కనిపిస్తే ఈ కథలో భూకామందు అతని కొడుకులు కనిపిస్తారు..
 
   ఈ కథలో భూకామందు ఏడుగురు కొడుకులు వేటకి వెళ్ళి ఏడుగురు ఎండు కూలీలను తెచ్చి వారి చేత బండ రాళ్ళను తవ్విస్తారు. ఒకరోజు వాళ్ళలో ఒకడు ఎండకు తట్టుకోలేక సొమ్మసిల్లి పడిపోతాడు. అప్పుడు భూకామందు కొడుకులు తమ సెక్రటరీని, సెక్రటరీ మేనేజరునీ, మేనేజరు లేబర్ ఆఫీసర్‌నీ, లేబర్ ఆఫీసర్‌ డాక్టర్‌నీ పిలుస్తారు. డాక్టర్ వచ్చి ఆ ఎండుకూలీని చూసి ‘నూరేళ్ళు నిండి చనిపోయాడు’ అని చెప్పి బిళ్ళు తీసుకొని వెళ్తాడు. భూకామందు కొడుకులకు అనుమానం కలిగి డాక్టర్‌ని రహస్యంగా అడగగా ‘తిండిలేక పోవటం వల్లనే చనిపోయాడని’ చెప్తాడు. దాంతో వారంతా సమావేశమవుతారు. అప్పటికే కూలీలకు మంచినీళ్ళు ఇస్తున్నామని, ఇప్పుడు పచ్చమన్ను ఇస్తే వారికి వస్తున్న 200 రూపాయల లాభంలో పావలా నష్టం కలుగుతుందని పెద్దవాడు చెప్తాడు. దీంతో కొడుకులంతా కూలీలకు నీళ్ళు తప్ప ఏమీ ఇవ్వరాదని నిర్ణయించుకుంటారు. తర్వాత మిగతా ఆరుగురు ఎండుకూలీలు చస్తారు. యజమానులు మళ్ళీ వేటకు వెళ్ళి  మరో ఏడుగురు కూలీలను పట్టుకు వస్తారు. ఇలా ఐదుసార్లు జరుగుతుంది. అపుడు యజమానులకు 200 రూపాయలకు  బదులు 150 రూపాయల లాభం మాత్రమే వస్తుంది. చదవుట కొనసాగించు ‘అనగనగా ఒక భూకామందు…’

ఏమైంది నా ఊరికి?

ఏడాకులపల్లి వెంకటేష్, (ఎం.ఏ.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

గా దినాలు  ఇంకా బాగా గురుతు.
అయితారం అంగట్ల
నువు కొనిచ్చిన సీకులు,
సాహేబు దుక్నంల పిప్పరమెంట్లు తినుకుంట
గడిలోకెళ్ళి మనమొస్తుంటే,
మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య
ఒరేయ్ ‘ఎంకటేషు’ అని పిలిస్తే
ఎగిరి గంతేసి ఉరికెటోన్ని.
జొన్న కంకుల్ని బెల్లంల కలిపి
ఆగమాగం మెక్కెటోన్ని.
పీర్ల పండుగ నాడు మైదాకు బెట్టుకోని
మునిమాపు యేళ అళయ్ బళయ్‌గా
మస్తుగ తిరిగెటోన్ని.

ఇయ్యాళ 
పెద్ద సదువులు సదివి మళ్ళ ఊరికి పోతె
ఎక్కడ జూశినా టీవీలు
వాటి ముందు మందలు మందలుగా జనం.
నేను పుట్టి పెరిగిన  పల్లె
నాకే అన్‌జాన్ గొడుతున్నది.

మంగళి నారాయణ, మాదిగ లచ్చయ్య
‘ఎంకటేషు’ అని పిలవలేదు.
ఎండిపోయిన లంక చేనులా
ఎవరి మొగంలా కళ లేదు.

ఏమైంది నా ఊరికి?
ఎక్కడ పోయినయ్ అప్పటి ప్రేమలు.
నాకు మునుపటి నా ఊరు కావాలె.
గిదేదో మొగాలకు రంగులేసుకున్న
బాగోతంలా కనబడుతున్నది.
ఏం పెద్ద రోగమొచ్చిందో ఏమో!
ఎవడి దిష్టి తగిలిందో ఏమో!

అమ్మా!
అయితారం అంగట్ల సీకులు
సాహేబు దుక్నంల పిప్పరమెంట్లు మళ్ళ తినాలనుంది.
మళ్ళ చిన్నతనంలోకెళ్ళి
పులికాట్ ఆట ఆడాలనుంది.
గా దినాలు యిగ రావా అమ్మా!!

ప్రణయ తరంగం

– అపూర్వం   

నిన్ను మొదటిసారి చూసిన ఆక్షణం
నాకెందుకో అపురూపమయిపోయింది.                    
స్మృతుల సెలయేటిలో ఒక మధురతరంగం ఎగసిపడి
మనసులో మౌనంగా నిక్షిప్తమైపోయింది.

అది నిజమనుకుంటే కలలాగ నన్ను వీడిపోతుంది.
అది కల అనుకుంటే నిజంలా నా వెన్నంటే ఉంటుంది.
ఏది కలో, ఏదినిజమో…! తెలియక                              
కాలం కొలిమిలో కరిగిపోతూ,                                
ఆశల చెలిమిలో ఎదిగిపోతూ…                                   
నువ్వు వస్తావని రోజూలాగే వేచిచూసే నా హృదయం,
నీ రాక కన పడగానే,                                                               
నీ స్వరం వినపడగానే                                                     
రివ్వున ఎగిరి నీ ముందు ప్రత్యక్షం అవుతుంది.          
నీ కోసమే జీవితం అంకితమి స్తుంది.

నీవు నన్ను పిలిచిన మొదటిక్షణం,                
లీలగా చిరునవ్వు విసిరిన ఆ అద్భుత క్షణం,
తలుచుకుంటే…                                                                             
జగాన్ని జయించిన విజయగర్వం                                   
నా సొంతమౌతుంది.                                                                
ఆ క్షణం గుర్తుచేసుకుంటే                                    
నామది                                                                                                
తీరాన్నిస్పర్శించిన ప్రణయతరంగమవుతుంది.

దిన దినము ప్రతిక్షణం దిగులైన జీవనం…
ప్రతిగడియ నీ కొరకే వెచిచూసే నా వేదనా హృదయం
ప్రతిగడియ నీ కొరకే వెదికి అలిసె నా లేత హృదయం అప్పుడెప్పుడోకలిశావు…                                     
మొన్నెపుడో కలిశావు… మళ్ళీ ఇప్పుడు…
అయినా నా గుండెచప్పుడుగా ఉండిపోక
ఈ దాగుడుమూతలెందుకు చెలీ!  

                             

వెళ్ళిపో…

రాజ్ కిషోర్, (ఎం.ఏ.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

ఓ మానవ మూర్తీ!
ఎక్కడున్నావయ్యా?
ఎంత పిలిచినా పలకవు
ఎక్కడ వెతికినా కనపడవు…
జాగ్రత్త! జాగ్రత్త!!
ఈ దగాకోరు సమాజంలో
జాగ్రత్త! జాగ్రత్త!!

బోర్డు చూడలేదా
“నరభక్షకులున్నారు జాగ్రత్త”                         
ఈ లోకం నిను బ్రతకనివ్వదు
ఈ సమాజం నీ పై కరుణ చూపదు.
కుళ్ళిన ఈ సమాజం నిండా అన్నీ విష నాగులే.
వెళ్ళిపో… పారిపో…

మనిషితనం , మానవత్వం కొరగారిన ఈ లోకంలో
సామాన్యునికి తావు లేనే లేదు.
వీళ్ళకు ఈ నేల చాల్లేదు ,అందుకే
ఆ నింగి మీద పడ్డారు .

నిన్నటివరకూ “అందమైన జాబిలి” 
ఈ రోజు రియల్ ఎస్టేట్లకు లోగిలి .
“చందమామ రావే”అని గోరు ముద్దలు పెడుతూ
అమ్మ చూపించిన “మామ”కు
నేడు ఖరీదు కడుతున్నారు .
నీకు అక్కడ కూడా స్థానం లేదు 
వెళ్ళిపో … పారిపో …
అష్ఠ దిక్కులను దాటి 
పంచ భూతాలను దాటి…

మాక్సిమ్‌ గోర్కీ “అమ్మ” నవల పై సెమినార్ ( 09-03-2007 సెంట్రల్ యూనివర్సిటీ )

ప్రజా సాహితి మాస పత్రిక ఆధ్వర్యంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గం. నుండి మాక్సిమ్‌ గోర్కీ “అమ్మ” నవల పై సెమినార్ నిర్వహించబడుతుంది.

సభాధ్యక్షులు: డా. పిల్లలమర్రి రాములు

ప్రధాన వక్త: ప్రొ. హరగోపాల్

వక్తలు: డా. దార్ల వెంకటేశ్వరరావు

డా. సునంద

డా. భట్టు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారు.

సభ ప్రారంభానికి ముందు అమ్మనవల పై ప్రజాసాహితి ప్రచురించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.


Telugutalli_image

a

 

మార్చి 2007
సో మం బు గు శు
« Feb   జూన్ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

మా పాఠకులు