- ఆచార్య తుమ్మల రామకృష్ణ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
నగిరి కాలవంటీ ఎగబడి పెద్ద చెరువు కట్ట మీది కొచ్చేసరికి నారప్ప గుండె గభీమంది. భుజాన వేలాడుతున్న చెనిగి పార తీసి కిందేసినాడు. తలకు చుట్టుకున్న పైగుడ్డ తీసి మొగం తుడుచుకున్నాడు. నీరెండ కండ్ల మీద పడతావుంటే చెయ్యి అడ్డం పెట్టుకోని చెరువులోకి చూసినాడు. చెర్నో నీళ్ళు కయ్యాలి కిందికి పోయినాయి. తూరుపు తట్టు తిరుక్కోని తూములు పక్క చూసినాడు.
మిట్ట తూములో సుక్క నీళ్ళు రాలడంలేదు. గుంత తూములో జరుగులు రాల్తా వుండాయి. గుంత తూమెత్తితే వున్న కాసిన్నీళ్ళూ నెల్దినాల్లో పూడ్చుకపోతాయి. కట్ట కింద కయిలోల్లు ఎవురో గుంత తూములో సూదిరాయి యేసేసినట్లుండాలి. నీళ్ళలో మునిగి తూములో సూదిరాయి పెరకడం ఎవునెబ్బ తరమూ కాదు.
పదేళ్ళ కిందట ఒకసారి ఇట్లే సంత తూములో ఎవురో సూదిరాయి యేసింటే నీరు కట్టి వెంకటప్ప నీళ్ళలో మునిగి రాయి ఎత్తబోయి ఎంత పొద్దుకూ పైకి రాలేదంట. మాలపల్లి మాలపల్లంతా రెండు పొగుళ్ళు రెండు రేతుర్లు చెరువు కట్ట మీద గుండెలు బాదుకున్నారంట. ఫలితం లేకపోయింది. చెరువు ఎండిపోయినాక ఒకరిద్దరు గుంత తూములోకి లాంతర్లు ఎత్తుకుపోయి చూస్తే ఏముందీ! ఏమీ లేదు. వెంకటప్ప చెరువులో మునిగిన రోజు తలకు చుట్టుకోనుండిన ఎర్రటి అంగవస్త్రం దొరికిందట.
ఇప్పటికీ నీరు కట్టి వెంకటప్ప కొడుకులు ఎవురైనా రైతులు ఏమన్నా అంటే – ‘మీ వూరోళ్ళ మూలంగానే మా నాయన సచ్చిపాయ ‘ అంటూ వుంటారు. ఎప్పుడెప్పుడు విషయాలో నారప్పకి మతికొచ్చినాయి.
చాడకేసిన నాలుగు కయ్యలు దున్ని దుక్కి చేసుకొని నాటుకోకపోతే బతకడం కష్టం. సక్రమంగా పంట చేతికొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. రోజురోజుకీ అప్పులు పెరుగుతున్నాయి. పదేళ్ళ కిందట పది కయ్యలుండేవి. పది కయ్యలు నాలుగు కయ్యలయినాయి. వడ్డీలకు వడ్డీలు కట్టలేక చివరకు కయ్యలు రాసిచ్చినాడు. నారప్ప గొణుక్కుంటూ చెరువుకట్ట దిగి పెద్ద కాలువ తట్టుకు పోతున్న జరుగు నీళ్ళను నగిరి కాలవకు మళ్ళించి పార కడిగి భుజానికి తగిలించుకొని వచ్చిన దోవ పట్టాడు.
రేగడి మిట్ట కాడికి వచ్చేసరికి నారప్పకు కాళ్ళు గుంజినట్లనిపించి వేప చేట్టు నీడలో కూర్చున్నాడు. పక్క జోబీలోకి చెయ్యి పెట్టి తడిమి తుంట బీడీ ఎత్తుకున్నాడు. ముట్టించి ఒక దమ్ము గట్టిగా లాగాడు. నోటి నిండుకు పొగ లాగి వదిలాడు. ప్రాణం తేలిక పడినట్లనిపించింది. తేరి పార జూశాడు.
రేగడి మిట్ట. పదేళ్ళ కిందట ఉత్త పల్లేరు కంపలు, బొలుసు కంపలు… ఎనుములు, గొడ్లు వూటాడేకి తోలే వాళ్ళూ. ఒకరిద్దరు జొన్నలు, దనాలు చల్లేవాళ్ళు. అవికూడా పండితే పండచ్చు. లేకుంటే లేదు. ఇప్పుడు నల్లరేగడి మిట్ట ననవలాడుతూ వుంది. ఒక తట్టు చెరకు తోట. ఒక తట్టు మిరప తోట. ఇంకో తట్టు టమోటా చెట్లు. ఎవురికైనా ప్రాప్తముండాల. దేవుడి మాన్యం, ఇనాము భూములు ఎందుకూ పనికి రావనుకొని శేషమోళ్ళు సద్ది నీళ్ళకు దారపోసుకున్నారు. నాయుడు తెలివిగా సొంతం చేసుకున్నాడు. ముందుగా బోర్ వేయించాడు. ఎక్కడ లేని వూట పడింది. నేలంతా సదరకట్టి కయ్యలు కట్టించాడు. నాలుగంచులా కల్ల యేయించాడు. నేల మొత్తం సాగవుతూ వుంది. పచ్చని పైరు చూసే సరికి నారప్పకి ప్రాణం పైకి లేసొచ్చింది. ఆనందంగా బీడి కాల్చి పైకి తీశాడు.
‘ఏం మామా… అబ్బుడే లేస్తివి’ అంగనబోయుడు పలకరించాడు. నారప్ప ఆలోచనల్లోంచి బయటకొచ్చి ‘యాట్నుంచీ రా’ అన్నాడు.
‘మర వంకలో నుంచి వస్తా వుండేలా మామా’ అంటూ గంగనబోయుడు సమాధానమిచ్చాడు. ‘ఆడేం పనిరా’ మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు నారప్ప. గంగనబోయుడు ఉలుకు పలుకు లేకుండా నిలబడుకొన్నాడు.
‘కొంపదీసి వంకలో సారాయి గీరాయి కాస్తా వుండారా ఏమీ… కొంపలంటుకు పోతాయండ్రా’ నారప్ప హెచ్చరించాడు. గంగనబోయుడు ఒక నవ్వు నవ్వి మాట మారుస్తూ ‘ఇంతకూ నువ్వేం పని మీద వస్తివి మామా’ అన్నాడు.
‘ఏమీ లేదురబ్బా. ఎలకమాను మిట్ట కాడ నాలుగ్గంతలు చాడ కలిపినా. పద్దినాలుగా ఇంటికాడికి మడికాడికి నగిరి కాలవంటీ తిరగతా వుండా. కాలవంటీ సుక్కనీళ్ళు సాగి రావడం లేదు. చెరువు కాటికి పోయి గుంత తూములో వచ్చే జరుగులు కాలవకి యెగ్గట్టినా సాగి కయిలో పడితే చాలు. కయ్యి కల్సుకుంటాది. పొద్దంతా పోతా వుంది. కనుమరుగైతే చాలు. ఎవడో ఒగడు మడవ తిప్పేస్తాడు. సందకాడ మల్లా నారు పెరికేదానికీ, నాటే దానికి కూలోళ్ళను పిలవాల. ఈ ముండ నీళ్ళు యెంతకూ సాగి రావడం లేదు’ నారప్ప కడుపులోని అక్కసు వెళ్ళగక్కాడు. చదవుట కొనసాగించు ‘నల్లరేగడి’

పాఠకుల అభిప్రాయాలు