- ఆచార్య తుమ్మల రామకృష్ణ,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
నగిరి కాలవంటీ ఎగబడి పెద్ద చెరువు కట్ట మీది కొచ్చేసరికి నారప్ప గుండె గభీమంది. భుజాన వేలాడుతున్న చెనిగి పార తీసి కిందేసినాడు. తలకు చుట్టుకున్న పైగుడ్డ తీసి మొగం తుడుచుకున్నాడు. నీరెండ కండ్ల మీద పడతావుంటే చెయ్యి అడ్డం పెట్టుకోని చెరువులోకి చూసినాడు. చెర్నో నీళ్ళు కయ్యాలి కిందికి పోయినాయి. తూరుపు తట్టు తిరుక్కోని తూములు పక్క చూసినాడు.
మిట్ట తూములో సుక్క నీళ్ళు రాలడంలేదు. గుంత తూములో జరుగులు రాల్తా వుండాయి. గుంత తూమెత్తితే వున్న కాసిన్నీళ్ళూ నెల్దినాల్లో పూడ్చుకపోతాయి. కట్ట కింద కయిలోల్లు ఎవురో గుంత తూములో సూదిరాయి యేసేసినట్లుండాలి. నీళ్ళలో మునిగి తూములో సూదిరాయి పెరకడం ఎవునెబ్బ తరమూ కాదు.
పదేళ్ళ కిందట ఒకసారి ఇట్లే సంత తూములో ఎవురో సూదిరాయి యేసింటే నీరు కట్టి వెంకటప్ప నీళ్ళలో మునిగి రాయి ఎత్తబోయి ఎంత పొద్దుకూ పైకి రాలేదంట. మాలపల్లి మాలపల్లంతా రెండు పొగుళ్ళు రెండు రేతుర్లు చెరువు కట్ట మీద గుండెలు బాదుకున్నారంట. ఫలితం లేకపోయింది. చెరువు ఎండిపోయినాక ఒకరిద్దరు గుంత తూములోకి లాంతర్లు ఎత్తుకుపోయి చూస్తే ఏముందీ! ఏమీ లేదు. వెంకటప్ప చెరువులో మునిగిన రోజు తలకు చుట్టుకోనుండిన ఎర్రటి అంగవస్త్రం దొరికిందట.
ఇప్పటికీ నీరు కట్టి వెంకటప్ప కొడుకులు ఎవురైనా రైతులు ఏమన్నా అంటే – ‘మీ వూరోళ్ళ మూలంగానే మా నాయన సచ్చిపాయ ‘ అంటూ వుంటారు. ఎప్పుడెప్పుడు విషయాలో నారప్పకి మతికొచ్చినాయి.
చాడకేసిన నాలుగు కయ్యలు దున్ని దుక్కి చేసుకొని నాటుకోకపోతే బతకడం కష్టం. సక్రమంగా పంట చేతికొచ్చి నాలుగేండ్లు కావస్తోంది. రోజురోజుకీ అప్పులు పెరుగుతున్నాయి. పదేళ్ళ కిందట పది కయ్యలుండేవి. పది కయ్యలు నాలుగు కయ్యలయినాయి. వడ్డీలకు వడ్డీలు కట్టలేక చివరకు కయ్యలు రాసిచ్చినాడు. నారప్ప గొణుక్కుంటూ చెరువుకట్ట దిగి పెద్ద కాలువ తట్టుకు పోతున్న జరుగు నీళ్ళను నగిరి కాలవకు మళ్ళించి పార కడిగి భుజానికి తగిలించుకొని వచ్చిన దోవ పట్టాడు.
రేగడి మిట్ట కాడికి వచ్చేసరికి నారప్పకు కాళ్ళు గుంజినట్లనిపించి వేప చేట్టు నీడలో కూర్చున్నాడు. పక్క జోబీలోకి చెయ్యి పెట్టి తడిమి తుంట బీడీ ఎత్తుకున్నాడు. ముట్టించి ఒక దమ్ము గట్టిగా లాగాడు. నోటి నిండుకు పొగ లాగి వదిలాడు. ప్రాణం తేలిక పడినట్లనిపించింది. తేరి పార జూశాడు.
రేగడి మిట్ట. పదేళ్ళ కిందట ఉత్త పల్లేరు కంపలు, బొలుసు కంపలు… ఎనుములు, గొడ్లు వూటాడేకి తోలే వాళ్ళూ. ఒకరిద్దరు జొన్నలు, దనాలు చల్లేవాళ్ళు. అవికూడా పండితే పండచ్చు. లేకుంటే లేదు. ఇప్పుడు నల్లరేగడి మిట్ట ననవలాడుతూ వుంది. ఒక తట్టు చెరకు తోట. ఒక తట్టు మిరప తోట. ఇంకో తట్టు టమోటా చెట్లు. ఎవురికైనా ప్రాప్తముండాల. దేవుడి మాన్యం, ఇనాము భూములు ఎందుకూ పనికి రావనుకొని శేషమోళ్ళు సద్ది నీళ్ళకు దారపోసుకున్నారు. నాయుడు తెలివిగా సొంతం చేసుకున్నాడు. ముందుగా బోర్ వేయించాడు. ఎక్కడ లేని వూట పడింది. నేలంతా సదరకట్టి కయ్యలు కట్టించాడు. నాలుగంచులా కల్ల యేయించాడు. నేల మొత్తం సాగవుతూ వుంది. పచ్చని పైరు చూసే సరికి నారప్పకి ప్రాణం పైకి లేసొచ్చింది. ఆనందంగా బీడి కాల్చి పైకి తీశాడు.
‘ఏం మామా… అబ్బుడే లేస్తివి’ అంగనబోయుడు పలకరించాడు. నారప్ప ఆలోచనల్లోంచి బయటకొచ్చి ‘యాట్నుంచీ రా’ అన్నాడు.
‘మర వంకలో నుంచి వస్తా వుండేలా మామా’ అంటూ గంగనబోయుడు సమాధానమిచ్చాడు. ‘ఆడేం పనిరా’ మళ్ళీ ఎదురు ప్రశ్న వేశాడు నారప్ప. గంగనబోయుడు ఉలుకు పలుకు లేకుండా నిలబడుకొన్నాడు.
‘కొంపదీసి వంకలో సారాయి గీరాయి కాస్తా వుండారా ఏమీ… కొంపలంటుకు పోతాయండ్రా’ నారప్ప హెచ్చరించాడు. గంగనబోయుడు ఒక నవ్వు నవ్వి మాట మారుస్తూ ‘ఇంతకూ నువ్వేం పని మీద వస్తివి మామా’ అన్నాడు.
‘ఏమీ లేదురబ్బా. ఎలకమాను మిట్ట కాడ నాలుగ్గంతలు చాడ కలిపినా. పద్దినాలుగా ఇంటికాడికి మడికాడికి నగిరి కాలవంటీ తిరగతా వుండా. కాలవంటీ సుక్కనీళ్ళు సాగి రావడం లేదు. చెరువు కాటికి పోయి గుంత తూములో వచ్చే జరుగులు కాలవకి యెగ్గట్టినా సాగి కయిలో పడితే చాలు. కయ్యి కల్సుకుంటాది. పొద్దంతా పోతా వుంది. కనుమరుగైతే చాలు. ఎవడో ఒగడు మడవ తిప్పేస్తాడు. సందకాడ మల్లా నారు పెరికేదానికీ, నాటే దానికి కూలోళ్ళను పిలవాల. ఈ ముండ నీళ్ళు యెంతకూ సాగి రావడం లేదు’ నారప్ప కడుపులోని అక్కసు వెళ్ళగక్కాడు.
‘చూడు మామా నేనో మాట చెపుతా వింటావా… అబ్బా అమ్మా అంటే చెర్లో నెల్దినాల నీళ్ళు లేవు. ఇన్ని బాధలు పడి ఆ నాలుగ్గుంతలు నాటుకుంటే ఏమి? నాటితివే పో అదేమన్నా పండతదా! వానలు పడి మళ్ళీ చెరువుకు సగానికో, ముక్కాల భాగానికో నీళ్ళొస్తే తప్ప నీ చేతికి పంటొస్తదన్న నమ్మకం లేదు. నా మాటిని ఎవురికన్నా నేల టమోటాల కిచ్చేయకూడదా! కూలీలు మిగల్తాయి. చేతుల కష్టమూ మిగుల్తుంది. నాలుగు దుడ్లు చేతిలో పడతాయి.’
‘నువ్వు చెప్పే మాట బాగనే ఉందిరా గంగా… ఉన్న ఆ నాలుగ్గుంతలూ టమోటాల కిచ్చేసి ఏమి తినేదిరా…?’ నారప్ప తన మనసులో మాట బయటపెట్టాడు.
‘నీ ఎర్రిగాని నాలుగు దుడ్లు చేతిలో వుంటే ఏది కావాలంటే అది నీ కాళ్ళ కాడికి నడిసొస్తుంది మామా’ గంగనబోయుడు రహస్యం చెప్పినట్లు చెప్పాడు.
‘నిజమే అనుకో… రైతుగా పుట్టి రైతుగా బతుకుతూ సంచి చేతబట్టుకొని అంగడి కాడికి పోయి బియ్యం బేడలు తెచ్చుకోవాలంటే తలకాయగొట్టేసి నట్లుంటదిరా’ నారప్ప కడుపులోని మాట బయటపెట్టాడు.
‘ఏమో మామా నీ మంచిగోరే చెపుతావుండా… బేరం పట్టక రమ్మంటే పట్టుకొస్తా. రేగడి మిట్టలో లింగమ నాయుడిది ఇరవై ఎకరాలు మాబూ సాయిబు లీజుకు తీసుకున్నాడు. కావలి కంత నేనే చూసుకుంటా వుండా. దున్నేది, దోకేది, నాటేది, చెత్త ఏరేది, సాలెగ బోసేది, కాలువ లెగేసేది, మందులు కొట్టేది అంతా వాళ్ళదే. ఉత్త నేలే మనది. ఎకరాకు నాలుగు వేలిస్తారంట. చెప్పమంటే చెపుతాను. ఆయప్పే వచ్చి మాట్లాడతాడు.’
గంజనబోయుడు నారప్పకు డబ్బాశ సూపించాడు. మాట నోట్లో ఉండగానే మొదలుపెట్టాడు.
‘నువ్వీ కాలంలో పుట్టాల్సినోడివి కాదు మామా… దుడ్లు మామా దుడ్లు… టమేటాల్లో వేల్లువేల్లు చేతికొస్తాండాయి. మామా… సాయిబూలేంది… మనోల్లేంది… డబ్బుకి, వ్యాపారానికి కులము, మతము, జాతి, ఇవేమీ వుండవు మామా… అట్లా పోయి సూడు. ఎకరాల కెకరాలు వెనకూ ముందూ చూడకుండా కొనేస్తా వుండారు. ట్రాక్టర్లు పెట్టి దున్నిస్తా వుండారు. ఎక్కడికెక్కడొ బోయి నార్లు నాటిస్తావుండారు. పైగా మూన్నాళ్ళ పంట మామా… కండ్లు మూసి తెరిసే లోపల చెట్లు పూతకొచ్చేస్తాయి. చూస్తా వుండగానే పిందెలు, కాయలు, పండ్లు… అద్దో అట్లా సూడు ఒగదును ఇబ్బుడిబ్బుడే పూతకొస్తా వుంది. ఒగదును కోతకొచ్చింది.’
గంగనబోయుడు నారప్పకు మాబూ సాయెబు టమేటా చెట్లు చూపించాడు. నారప్ప నోట్లోకి ఈగలు పుయ్యేది కూడా గమనించకుండా టమేటా చెట్లవేపే చూస్తూ నిలబడ్డాడు. ‘నేనొస్తా మామా’ అంటూ గంగనబోయుడు పల్లెతోవ తొక్కాడూ. నారప్ప మడి కయ్యలు దిక్కు నడక సాగించాడు.
నారప్ప మడి గెనాల మీద తిరగతా వున్నా నారప్ప మనసు రేగడి మిట్టకాడే ఉంది. మాబూ సాయిబు టమేటా చెట్లు నల్ల నీలాలు గక్కుతున్నాయి. పూత… పిందలు… కాయ… కోతకొచ్చిన దోరకాయలు గుత్తులు గుత్తులుగా చెట్లలో యేలాడుతుండాయి. కాయల బరువుకి చెట్లు తలలొంచేసినాయి. ఆలోచిస్తూ నారప్ప ఇంటి ముఖం పట్టాడు.
* * * * *
(కథ పూర్తి భాగం వచ్చే సంచికలో)

మీ కథలో మాండలిక పదాల వాడుక బాగుంది.మీ కథను అర్ధం చేసుకోవటం అంత సులువు కాదు. ఎందుకంటే మాండలిక పదాలు ఎక్కువగా ఉండటం ,కథ చేప్పే విధానం లో కొంత అస్పష్టత ఉండటం.మాండలిక పదాల వాడుక తగ్గించమనికాదు.ఎంతో సృజనాత్మక శక్తి ఉన్న మీరు ఇంకా బాగా రాయాలనే ఉద్దేశంతో మాత్రమే ఈ అభిప్రాయం చెప్తున్నాను.
డా. తుమ్మల రామకృష్ణ గారికి మీ కధ చాలా బాగుంది. కానీ అందులో శిల్ప వైవిధ్యం ప్రదర్శిస్తే తుమ్మల మార్కు కథగా ఉంటుంది.
కథ నడిపిన తీరు,అంటే ఎత్తుగడలో పాఠకుడిని కట్టి పడేసి మీ పని పూర్తి చేసారు. ఈ మధ్య వస్తున్న (12సం)సాహిత్యమంతా దాదాపు మాండలికమే, కాబట్టి పాఠకుడెప్పుడో మాండలికానికి అలవాటుపడ్డాడు. కాకపోతే నిర్మాణశిల్పంలో అస్పష్టత ఉన్నమాట వాస్తవం.