కథన పద్ధతి : ఒక విశ్లేషణ పరికరం

(కథనంలో సరళత, సంకీర్ణతల నిరూపణ )

- ఆచార్య పరిమి రామనరసింహం,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సారాంశం: కథాకథనంలోని సరళతను; సంకీర్ణతను నిరూపించడం కొరకు ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాస పద్ధతి అనే ఒక విశ్లేషణ పరికరం ఈ వ్యాసంలో మరొక మారు ప్రతిపాదించబడుతున్నది. నిరూపణకు ఆధారంగా మధురాంతకం రాజారామ్రచించిన రెండు కథలు విశ్లేషించి చూపబడతాయి.

   సాహిత్య విమర్శ విషయ పరంగానూ, విధానపరంగానూ ఉండవచ్చు. భాష శబ్దం, అర్థం అనే రెండు ముఖాలతో ప్రవర్తిల్లినట్లే భాష చేత ఏర్పడే సాహిత్యం కూడా విషయం, విధానం అనే రెండు ముఖాలతో వెలువడుతుంది. ఆ కారణంగా విషయాన్నీ, విధానాన్నీ కూడా మూల్యాంకనం చేయవలసి ఉంటుంది 

pr.jpg 

   పై రేఖా చిత్రంలో (రామ నరసింహం: 1996: 4; రామనరసింహం 2005: 129) చూపిన విధాన విమర్శ (శైలీ శాస్త్రం) లోని భాషా తత్వ సంబంధి విభాగాన్నే M.A.K.Halliday వంటి భాషా/ శైలీ శాస్త్రవేత్తలు linguistic stylistics (భాషా వైజ్ఞానిక శైలీ శాస్త్రం) అన్నారు (Halliday 1964: 302-307). రెండవదైన విషయ నిర్వహణ సంబంధి విభాగమే ప్రస్తుతం ఉద్దేశించిన అధ్యయన లక్ష్యం. విషయాన్ని చెప్పే విధానంలో భాషను (అంటే శబ్దార్థాలను) రచయిత/త్రులు ఎట్లా ఉపయోగించుకున్నారు అనేది ఉపవిభాగం కాగా, ఆ విషయాన్ని నిర్వహించిన తీరు రెండవ ఉపవిభాగం అవుతుంది. ప్రస్తుతం ఈ వ్యాసంలో ప్రస్తావిస్తున్న అంశం ఆధునిక కథానికలలో విషయ నిర్వహణకు సంబంధించినది. కథన పద్ధతితో రచయిత/త్రులు అనుసరించే వ్యూహాలు (Strategies), తంత్రం (techinique) కథానికకు విశిష్టతను చేకూరుస్తాయి. కథన పద్ధతిలో అగ్రీకరణం‘ (fore grounding) ఏ విధంగా చోటు చేసుకుంటుంది, అది (అగ్రీకరణం) ఆ కథన పద్ధతికి వైశిష్ట్యాన్ని సంతరించటంలో ఎటువంటి పాత్ర పోషిస్తుంది అనే అంశానికి మాత్రమే ఈ వ్యాసం పరిమితం అవుతుంది.

   అగ్రీకరణం: అగ్రీకరణం అనేది భారతీయ ఆలంకారికులు చెప్పిన వక్రతకు తుల్యం. సర్వసాధారణంగా చెప్పవలసిన పద్ధతి ఒక విధంగా ఉండగా చెప్పే పద్ధతి మరొక విధంగా ఉండటం అగ్రీకరణం‘. అయితే, చెప్పవలసిన పద్ధతికీ చెప్పే పద్ధతికీ సంబంధం ఉంటుంది. చెప్పవలసిన దాన్ని వెనక్కు (back groundలో నేపథ్యంలో) ఉంచి దానికి సంబంధించినదే అయిన మరొక పద్ధతిని ముందుకు తేవటమే అగ్రీకరణం (fore grounding). ( అగ్రీకరణానికి సంబంధించిన మరిన్ని వివరాలకు దాని ప్రతిపాదకుడైన ముకరోవ్‌స్కీ వ్యాసం [Mukarovsky 1970:40-55], దాన్ని తెలుగులో వివరించిన ఈ వ్యాసకర్త వ్యాసం [రామనరసింహం 2005: 131-140] చూడవచ్చు.)

   ఇప్పుడు, కథానికలలోని ఇతివృత్త నిర్వహణలో (కథనంలో) అగ్రీకరణం ఎట్లా పని చేస్తుందో, కథనంలో సరళతకూ, సంకీర్ణతకూ ఎట్లా కారణం అవుతుందో పరిశీలిద్దాం.

   కథ కొన్ని ఘటనల సంపుటి అనుకుంటే, ఆ కథను మౌఖికంగా చెప్పేటప్పుడు ఆ ఘటనలను అవి జరిగిన కాలక్రమంలో చెప్పటం జరుగుతుంది. దీన్ని ఘటనాంశ క్రమం అందాం. ఘటనాంశ క్రమం అంటే ఘటనల కాలానుక్రమం (chronological order) అన్న మాట. ఆధునిక కథా రచయితలు ఘటనలను కాలానుక్రమంలో కథనం చేయరు. మార్చి చేస్తారు. ఎక్కడో మధ్యలో ఒక ఘటనతో కథను ఎత్తుకుంటారు. దాన్ని ఎత్తుగడ (take – off point)’ అందాం. సాధారణమైన కాలానుక్రమంలోని మొదటి ఘటన ఆరంభంలేదా ఆరంభ బిందువు‘ (starting point) అందాం. ఆధునిక కథానికలో ఎత్తుగడ ఆరంభ బిందువు కానక్కరలేదు. ఈ విధంగా రచయిత కథనం చేసిన ఘటనల క్రమాన్ని కథనాంశ క్రమం అందాం. కనుక సహజంగా చెప్పవలసిన క్రమం ఘటనాంశ క్రమం (ఘటనల కాలానుక్రమం) కాగా దాన్ని నేపథ్యంలో ఉంచి మరొక క్రమాన్ని అంటే కథనాంశ క్రమాన్ని ముందుకు తేవడం - అంటే అగ్రీకరణం చేయటం జరుగుతుంది. ఈ రెండు క్రమాలను పోల్చి చూపటం ద్వారా కథన పద్ధతిలోని సరళతనూ లేదా సంకీర్ణతనూ నిరూపించవచ్చు. ఈ నిరూపణకు ఈ వ్యాస కర్త ప్రతిపాదించిన అధ్యయన పద్ధతే ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాసం (superposing of the chronological order of events and narrative events)’ (Ramanarasimham 1985). 

   ఈ పద్ధతిలో కథలోని ఇతివృత్తాన్ని ఘటనలుగా విడగొట్టుకొని వాటిని కాలానుక్రమంలోనూ, కథనాంశ క్రమంలోనూ అమర్చుకొని ఆ రెండు క్రమాలనూ ఉపరిన్యాసం (superpose) చెయ్యటం జరుగుతుంది. దీనితో కథన క్రమంలోని అగ్రీకరణాన్ని, తద్వారా కథన పద్ధతిలోని సరళతనూ, సంకీర్ణతనూ హేతుబద్దంగా నిరూపించవచ్చు.’ (Ramanarasimham 1985).

ఈ విశ్లేషణలో ఉపయోగించే కొన్ని సాంకేతిక పదాలు:

1. ఘటన (event) : ఇతివృత్తంలో గుర్తించదగిన ముఖ్యమైన కథాంశం

2. ఘటనాంశ క్రమం (order of events) : కథలోని ఘటనల కాలానుక్రమం

3. కథనాంశ క్రమం (order of narrative events) : ఘటనలను రచయిత కథనం చేసిన క్రమం

4. ఆరంభం లేదా ఆరంభ బిందువు (starting point) : ఘటనాంశాలలో మొదటి ఘటన

5. ఎత్తుగడ (take of point) : కథనాంశాలలో మొదటి ఘటన. దీన్ని రచయిత మొదటి ఘటనగా చిత్రిస్తాడు.

6. పూర్వ ఘటన (antecedent) : ఎత్తుగడకు ముందు జరిగిన ఘటన

7. ఉత్తర ఘటన (subsequent event) : ఎత్తుగడకు తర్వాతి ఘటన

8. తిరోగమనం (backword moovement or flashback) : కథలోని ఒక ఘటన తర్వాత దాని కంటే కాలగతిలో ముందు జరిగిన ఘటనలను కథనం చెయ్యటం.

9. ముగింపు : కథనాంశాలలో చివరి ఘటన.

రేఖాచిత్రం 

   ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాసం ఒక రేఖాచిత్రంలో చూపుతాం. ఘటనాంశాలు కాలానుక్రమం (chronological order)లో ఉంటాయి కనుక వాటిని వరుస అంకెలలో సూచించటం జరుగుతుంది. అంటే మొదటి ఘటన అయిన ఆరంభ బిందువును మొదటి అంకెతోనూ, తర్వాతి ఘటనలను తర్వాతి అంకెలతోనూ చూపుతాం. కథనాంశక్రమంలోని మొదటి ఘటన అయిన ఎత్తుగడను సూచించే అంకెకు ఒక పెట్టె కడ్తాం. కథకు ముగింపు అయిన ఘటన సూచించే అంకెకు సున్న చుడ్తాం. ఎత్తుగడ కాలానుక్రంలో మొదటి ఘటన కానక్కరలేదు అని ముందే చెప్పుకున్నాం. అదే విధంగా, కథకు ముగింపు అయిన ఘటన కాలానుక్రమంలో చివరి ఘటన కానక్కరలేదు.

   కథనాంశ క్రమం తెలపటానికి బాణం గుర్తులు ఉపయోగిస్తాం. ముందు వైపుకు ఉన్న బాణపు గుర్తులు కథనంలో ఉత్తర ఘటనలను తెలుపుతై. వెనుక వైపుకు ఉన్న బాణం గుర్తులు కథనంలో పూర్వ ఘటనలలోకి తిరోగమనాన్ని (backward movement of flashback) తెలుపుతై. అంటే 69 అని ఉన్నప్పుడు వరుసగా 6, 7, 8, 9 ఘటనలు అవుతై. ముందే చెప్పినట్లుగా ఉత్తర ఘటన ఎత్తుగడ కంటె తర్వాతి కాలంలో జరిగిన ఘటన అని, పూర్వ ఘటన అంటే ఎత్తుగడ కంటె ముందు జరిగిన ఘటన అని గ్రహించాలి.

   అనేక (ఒకటి కంటె ఎక్కువ) ఇతివృత్తాలు సంగమించిన కథలలో ఒక్కొక్క ఇతివృత్తానికి చెందిన ఘటనలను ఒక్కొక్క రకమైన అంకెలతో లేదా అక్షరాలతో సూచిస్తాం. ఉదాహరణకు, మూడు ఇతివృత్తాలు సంగమించిన కథలలో ఒక ఇతివృత్తంలోని ఘటనలకు 1, 2, 3 అనీ, రెండవ ఇతివృత్తంలోని ఘటనలకు i, ii, iii అనీ, మూడవ వాటికి a, b, c అనీ సూచించవచ్చు. మూడూ కలిసి ఏర్పడే సంయుక్త ఇతివృత్తంలోని ఘటనలకు A, B, C అని గానీ, , , , ఈ అని గానీ సూచించవచ్చు.

   ఈ విధంగా కథలో కథనం ఎట్లా సాగుతున్నదో తెలిపే రేఖాచిత్రం ఒకటి ఏర్పడుతుంది. దీని(ఈ రేఖాచిత్రం)వల్ల కథనం సూటిగా సాగుతున్నదా? తిరోగమనాలతో సాగుతున్నదా? ఆ తిరోగమనాలు ఇతివృత్తంలో ఎంతెంత వెనక్కు పోతున్నాయి, ఎన్ని తిరోగమనాలు ఏర్పడుతున్నాయి, ఇతివృత్తాలు ఎన్ని ఉన్నాయి, కథనం ఒక ఇతివృత్తంలోనించి మరొక ఇతివృత్తంలోకి ఎట్లా జొరబడుతున్నది? మొదలైన అంశాలు స్పష్టంగా కంటి ముందు చూపేందుకు వీలు కలుగుతుంది.

ఇప్పుడు ఈ పద్ధతిని మధురాంతకం రాజారాం రచించిన రెండు కథానికలను అన్వయించి చూపటం జరుగుతుంది.

మధురాంతకం రాజారాం కథ మాతృ సప్తకం ఘటనాంశ క్రమం

  1. తల్లితండ్రుల మరణం : రామకృష్ణ తల్లితండ్రులు అతని చిన్నతనంలోనే చనిపోవటం
  2. బాల్యం - చదువు : 5వ తరగతి వరకు స్వగ్రామంలోనే బడి పంతులు సహాయంతో చదువు - పట్టణాలలో ఉచిత భోజనం, వసతి ఇచ్చే హాస్టళ్ళు ఉంటాయని పై చదువుకు పట్ణానికి వెళ్ళమని ఒక అడ్రసు ఇచ్చి బడి పంతులు ప్రోత్సహించటం.
  3. పై చదువులు- వారాలు : పట్ణం వెళ్ళి విచారించగా అటువంటి హాస్టళ్ళు లేవని తెలియటం - హైస్కూలు హెడ్‌మాస్టరు రామకృష్ణకు భోజన వసతికి వారాలు ఏర్పాటు చెయ్యటం - ఏడుగురు గృహస్థులు చదువు పూర్తి అయ్యేవరకు చేరదీసి వారాలు ఇవ్వటం
  4. ఉద్యోగం : చదువు పూర్తి కాగానే లెక్చరర్ ఉద్యోగం
  5. ప్రేమ - పెళ్ళి : కోటీశ్వరుడైన జగన్నాథం ఏకైక పుత్రిక సుమిత్ర రామకృష్ణ పనిచేసే కాలేజిలో చదువు - వారిద్దరి ప్రేమ - ఆమె తండ్రి అయిష్టంగానే వారికి వివాహం జరిపటం - మామగారింట్లోనే నివాసం
  6. బీద విద్యార్థికి ఆశ్రయం ఇవ్వాలనే తలంపు : కాలేజికి సహాయం అర్థించి వచ్చిన ఒక బీద విద్యార్థిని ఇంటికి తీసుకరావటం
  7. నిరాకరణ : మామా అల్లుళ్ళ పోట్లాట చూసి ఆ కుర్రాడికి పాతికో పరకో ఇచ్చి పంపమని సుమిత్ర సలహా - ఆ కుర్రవాడు తనకు డబ్బుతో పని లేదని వెళ్ళిపోవటం - డబ్బుపై శ్రద్ధ చూపని ఆ విద్యార్థిపై రామకృష్ణకు సదభిప్రాయం - జగన్నాథం అహం దెబ్బతినటం - సుమిత్ర కూడా ముఖం చిన్నబుచ్చుకోవటం
  8. పట్టు చీరలు : ఘర్షణ జరిగిన మర్నాడు రామకృష్ణ 7 పట్టు చీరలు ఒక సూటూకేసు కొని ఇంటికి తేవటం
  9. ఘర్షణ : మర్నాడు భార్యను దేశయాత్రకు బైల్దేరదియ్యటం - మామగారు ఎంత అడిగినా తన ప్రయాణ వివరాలు చెప్పకపోవటం
  10. ఏడుగురు తల్లులు : ఎక్కడికి వెళ్తున్నది భార్యకు కూడా చెప్పకుండా తాను చదువుకునే రోజుల్లో వారాలు ఇచ్చి ఆదరించిన గృహిణులపై తనకు గల మాతృభావాన్ని, గౌరవాన్ని వెల్లడించుకోటానికి వాళ్ళు ప్రస్తుతం ఉంటున్న ఊళ్ళకు తీసుకపోయి వాళ్ళకు ఆ చీరలు బహుకరించటం - వారందరూ అతన్ని కొడుకుగానూ, సుమిత్రను కోడలుగానూ ఆదరించటం - సుమిత్ర ఇది అర్థం కాక ఆశ్చర్యపోవటం
  11. తిరుగు ప్రయాణం : తిరుగు ప్రయాణంలో రామకృష్ణ సుమిత్రకు తాను వారాలు చేసుకొని చదివి పైకొచ్చిన వైనాన్ని తెలపటం - ఆ ఏడుగురు స్త్రీలు తన భవిష్యత్తును తీర్చిదిద్దిన ఏడుగురు తల్లులు అని తెలియజెయ్యటం
  12. కనువిప్పు : సుమిత్రకు కనువిప్పు కలగటం - ఆమె ఆలోచనలో మార్పు - ఒకనాడు ఇంటి ముందు నుంచి వెళ్తున్న పేద కుర్రాణ్ణి పిలిచి వారాలు కుదిరే వరకు భోజనానికి రమ్మని చెప్పటం
  13. సంతోషం : భార్యలో వచ్చిన మార్పుకు రామకృష్ణకు సంతోషం కలగటం

   ఆరంభ బిందువు : తల్లిదండ్రుల మరణం (1)

  ఎత్తుగడ : ఘర్షణ (2) 

  ముగింపు : సంతోషం (3)

  ఘటనాంశ క్రమం : 1 - 14

  కథనాంశ క్రమం : 7, 4-6, 8-12, 1-3, 13, 14

ఘటనాంశ కథనాంశాల ఉపరిన్యాసం :

pr32.jpg

ఎత్తుగడ ముగింపు

తిరోగమనం : రెండు మార్లు - 7 నుంచి 4కు; 12 నుంచి 1కి

* * *

(తరువాతి భాగం వచ్చే సంచికలో)

1 ప్రతిస్పందన నుండి “కథన పద్ధతి : ఒక విశ్లేషణ పరికరం” కు


  1. 1 satyasai 6:33 పూర్వాహ్నం వద్ద ఏప్రియల్ 2, 2007

    మంచి విషయపుష్ఠిఉన్న వ్యాసం. మిగిలిన భాగాలు, మరిన్ని వ్యాసాలకోసం ఎదురు చూస్తున్నా.


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

మార్చి 2007
సో మం బు గు శు
« Feb   జూన్ »
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

మా పాఠకులు