డా// అద్దంకి శ్రీనివాస్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.
జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా సృజన చేశారు. ఈ స్పృహ తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలం నుండే వచ్చింది. అంతకు ముందు సాహిత్యంలో ఈ స్పృహ ఉన్నప్పటికీ దాని లక్ష్యం, పరిధి వేరు. గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం మొదలుకొని ఈ అభిమాన త్రయాన్ని బోధించే సాహిత్యమంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో, చైతన్య దీప్తితో, సంస్కరణాత్మకమూ, ప్రబోధాత్మకమూ అయిన గమ్యం వైపే సాగింది. ఈ నేపథ్యం గల సాహిత్యంలో రాయప్రోలు వారు చెప్పిన మూడు అభిమానాలను స్పృశించడమే ఈ వ్యాసోద్దేశ్యం.
1905లో జరిగిన బెంగాల్ విభజన దేశంలో జాతీయోద్యమ స్ఫూర్తి మిన్నంటేందుకు దోహదం చేసింది. ఈ సంఘటన ఒక్క వంగదేశాన్నే కాక దేశంలోని అన్ని ప్రాంతాల ప్రజలనూ చైతన్య పరిచింది. బిపిన్ చంద్రపాల్ ఆంధ్రదేశంలో పర్యటించి వివిధ ప్రాంతాలలో ఉపన్యసించారు. రాజమహేంద్రవరంలో వారి ఉపన్యాసం విని ఉత్తేజితులైన చిలకమర్తి వారు రాసిన “భరత ఖండంబు చక్కని పాడియావు” అనే పద్యంలో హిందువులను పీడిస్తున్న ఆంగ్లేయులను విమర్శిస్తూ మొట్టమొదటిసారిగా “నాదు జాతి” అనే అభిమానాన్ని ప్రకటించారు. తన జాతి కోసం చెరసాల పాలైన జాతీయ నాయకులను దైవ స్వరూపులుగా భావించి, వారి త్యాగాన్ని కీర్తిస్తూ ప్రజలలో త్యాగ నిరతిని, దేశభక్తిని పెంపొందింపజేసే రచనలు చేశారు.
“చెరసాలల్ పృథు చంద్రశాలలె యగున్, చేదోయి గీలించు న
య్యర దండల్ విరిదండలయ్యెడును, హేయంబైన చోడంబలే
పరమాన్నంబగు, మోటుకంబళులు దాల్పన్ పట్టు సెల్లాలగున్
స్థిరుడై యే నరుడాత్మ దేశమును భక్తింగొల్చు నవ్వానికిన్”
జాతి ఔన్నత్యం, పురా వైభవం, జాతీయోద్యమ నేతల దేశభక్తి, జెండా, రాట్నం వంటివన్నీ కవితా వస్తువులే. ప్రతి పదంలోనూ జాతిని ఉత్తేజపరచి, సంఘటితం చేసి ఒక మహత్తర శక్తిగా తయారు కావాలన్న ఆశయం కవితా రూపమైంది. రాయప్రోలు, విశ్వనాథ, కొడాలి, జాషువా, తుమ్మల ఆంధ్ర జాతిపై అభిమానాన్ని ప్రకటించినవారే.
“అవమానమేలరా! అనుమానమేలరా! భారతీయుడనంచు భక్తితో పాడ”
“లేరురా మనవంటి వీరులింకెందు”
“ఏ పూర్వ పుణ్యమో ఏ యోగ బలమో జనియించినాడవీ స్వర్గ ఖండమున” అనే రాయప్రోలు గీతాలు భారత జాతిపై వారికి కల అభిమానానికి నిదర్శనాలు. తమ్ముడా గేయంలో రాయప్రోలు కీర్తించిన జాతి ఔన్నత్యం ప్రజలను ఉత్తేజితులను చేసింది. దువ్వూరి రామిరెడ్డిగారి ప్రబోధ శంఖం, స్వాతంత్ర్య రథం గేయాలలో జాత్యభిమానం, తెల్లవారి ఆధిక్యంపై నిరసన కనిపిస్తాయి.
జాతి సౌభాగ్యమే తన లక్ష్యమంటూ సాగిన గాంధీజీని ఆదర్శంగా, మహాత్ముని తెలుగు కవులు వర్ణించారు. గేయాలలో, కావ్యాలలో కీర్తించారు. బసవరాజు అప్పారావుగారు ‘కొల్లాయి కట్టితేనేమి’, ‘వేణునాదం’, ‘స్వరాజ్య లక్ష్మి పెండ్లి’, ‘గాంధీ ప్రభ’ మొదలైన గేయాలలో గాంధీ మహాత్ముని కీర్తించారు. గాంధీని రామునిగా, అల్లాగా, క్రీస్తుగా చిత్రించి అన్ని మతాలవారికీ గాంధీ చెందేటట్లు నాయకునిగా భావింపజేశారు. ఈ స్ఫూర్తితో గాంధీపై భజనలు, కీర్తనలు, మంగళ హారతులు, హరికథలు, బుర్రకథలు వెలిశాయంటే మన తెలుగు కవులకు జాతిని ఉద్ధరించే నాయకుల పట్ల, జాతి పట్ల గల అపారమైన అభిమానమే ప్రస్ఫుటమౌతోంది.
విదేశీ వస్తు బహిష్కరణలో కవుల ఆత్మలలో గిరగిరా తిరిగింది రాట్నం. “తిప్పవే రాట్నమా దేశ చక్రంబు, విప్పవే రాట్నమా విజయకేతనము” అని దువ్వూరి రాట్నపు పాట రాశారు. దేశంలోని నదులు, కొండలు, విద్యాలయాలు, మతాలు, సంస్కృతి గొప్ప గొప్ప రాజులు, వీరులు, ధీరులు తెలుగు కవుల కలాలనుండి ఉద్యమ స్ఫుర్తి కోసం ఉరికిన కవితా వస్తువులు. గరిమెళ్ళ సత్యనారాయణ ‘స్వరాజ్య గీతాలు’, ఉన్నవ లక్ష్మీనారాయణ ‘భావ తరంగాలు’, దుగ్గిరాల గోపాల కృష్ణయ్య ‘రాంభజన కీర్తనలు’ కొండపల్లి జగన్నాథదాసు ‘స్వరాజ్య నవనీతము’ జాతీయ స్ఫూర్తినిచ్చాయి. గడియారం వారి ‘శివభారతం’, రాజశేఖర శతావధాని వారి ‘రాణా ప్రతాపసింహ చరిత్ర’ భారత జాతీయత వాసనా మాత్రంగా గలవే. దువ్వూరి ‘ద్రౌపదీ సందేశం’, చామర్తి రాజశేఖరరావు గారి ‘పాంచాలీ స్వాంతనము’ కావ్యాలలో పాత్రలు పౌరాణికాలే అయినా జాతీయోద్యమం కోసం కొత్త స్వరూపాల్ని సంతరించుకున్నాయి.

0 స్పందనలు నుండి “నాదు జాతి నాదు దేశము నాదు భాష” కు