నాదు జాతి నాదు దేశము నాదు భాష -2

కవి, సమాజం ఎన్నటికీ వేరు కాదు. రాసేది ధనుర్భంగమనే అంశమే అయినా, నాడు తన చుట్టూ ఉన్న ఉద్యమ స్ఫూర్తి కరుణశ్రీ ‘ఉదయశ్రీ’ కావ్యంలో ఎంత చక్కగా ధ్వనింపజేశాడో చూడండి.
“చెల్లరే విల్లువవిరుచునే నల్లవాడు
పది పదారేండ్లయెల రాచ పడుచువాడు
సిగ్గు సిగ్గంచు లేచి గర్జించినారు
కనులు గుట్టిన తెల్ల మొగాల వారు”
“’నల్లవాడను’ పదమును భారతజాతీయ వీరునికి ‘తెల్లమొగాల వార’న్న పదమును ఇంగ్లీషు దొరలకు సంకేతముగా గ్రహింపవచ్చున”ని సినారె అభిప్రాయపడ్డారు. 

          జాతీయోద్యమానికి సమాంతరంగా ఆంధ్రోద్యమం కూడా స్ఫూర్తినివ్వడానికి ఆంధ్రదేశంలో ఏర్పడిన పరిస్థితుల కారణంగా ఆంధ్రుల ఔన్నత్య పతాకలు పైకి లేచాయి. ఆంధ్ర చరిత్ర, సంస్కృతి, శౌర్యప్రతాపాలు, వర్తక వాణిజ్యాలు, కళలు, కట్టడాలు మొదలైనవన్నీ చిత్రింపబడ్డాయి. గతంలో ఆంధ్రులు సాధించిన విజయాలు, పురా వైభవాలను కీర్తిస్తూ, ప్రస్తుత పరిస్థితులకు సమన్వయం చేస్తూ గత వైభవమనే చూరు కింద నిలబడి చుక్కల్ని లెక్కపెట్టే నైజాన్ని నిరసించారు. పునరుద్ధరణ, పునరుజ్జీవం కోసం కొత్త గొంతుల్ని విప్పారు. దీనికి శ్రీకారం చుట్టింది రాయప్రోలు వారే అయినా వారికంటే ముందు 1914లో గడ్డము కొండారెడ్డి, 1916లో మండపాక పార్వతీశ్వర శాస్త్రి, గాదె జగన్నాథస్వామి, తిరుపతి వేంకట కవులు తత్కాలీన ఆంధ్రదేశ దుస్థితిని, తదుద్ధరణ కోసం చేపట్టవలసిన కర్తవ్యాన్ని ప్రస్తావించారు.

          ఆంధ్రుల కీర్తి, ప్రతాపాగ్ని, తెలుగు వాణి రాయప్రోలు కవిత్వంలో కీర్తింపబడ్డాయి. రాయప్రోలు వారి కవిత్వంలో జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ముప్పేటలుగా పెనవేసుకున్న దేశభక్తితో జాతికి కొత్తగా జవసత్వాలనందించాయి.
         “అమరావతీ పట్టణమున బౌద్ధులు విశ్వవిద్యాలయములు స్థాపించునాడు” అంటూ గత వైభవాన్ని; “సిరులు పొంగిన జీవగడ్డలు, పాలు పాఱిన భాగ్యసీమయి వ్రాలినది ఈ భరత ఖండంబున భక్తి పాడర తమ్ముడా! దేశగర్వము దీప్తి చెందగ దేశ చరితము తేజరిల్లగ దేశమరసిన ధీర పురుషుల తెలసి పాడర తమ్ముడా!” అంటూ దేశౌన్నత్యాన్ని చెప్తూ దేశ భక్తిని ఆవిష్కరించారు. భారత దేశం, తెలుగు దేశం, తెలుగు నేల, తెలుగు కత్తి, తెలుగు శిలలు, కోటలు, పట్టణాలు, బురుజులు, ఆచార్యులు, విశ్వవిద్యాలయాలు, మహర్షులు, మత ప్రవక్తల గుణకీర్తనలు ఈ నేపథ్యంలో వచ్చిన రచనలలో కనిపిస్తాయి. తెలుగునాట గల వర్ణాలు, స్త్రీ పురుషుల సౌందర్య ప్రస్తావనలు, శౌర్య ప్రస్తావనలు, కళలు, అభిరుచులు, సంస్కృతీ విశేషాలు, చేసిన దానాలు, ఏలిన ఊళ్ళు, క్షేత్రాలు, ఆంధ్ర రాజుల పాలనలు, చారిత్రక పురుషుల వీరోచిత కృత్యాలు అన్నింటినీ తవ్వితీసి పాఠకులకు చైతన్యాన్ని దీపింపజేసిన కావ్యాలు, గేయాలు దేశభిమానాన్ని ప్రకటిస్తున్నాయి. వీటిలో రాయప్రోలు ‘ఆంధ్రావళి’ విశ్వనాథ ‘ఆంధ్ర ప్రశస్తి’, ‘ఆంధ్ర పౌరుషం’, తుమ్మల ‘రాష్ట్ర గానం’, గంటిజోగి సోమయాజి ‘రామచంద్రుని హంపీయాత్ర’, జాషువా ఖండకావ్యాలు, ‘ముంతాజ్ మహల్’, కొడాలి ‘హంపీ క్షేత్రము’, పుట్టపర్తి ‘పెనుగొండ లక్ష్మి’, ఇంద్రగంటి హనుమచ్ఛాస్త్రి ‘దక్షారామం’ శ్రీనివాస సోదరుల ‘ఓరుగల్లు కోట’ ప్రసిద్ధాలు.

“శిలలు ద్రవించి యేడ్చినవి జీర్ణములైనవి తుంగభద్రలో
పలి గుడి గోపురంబులు, సభాస్థలులైనవి కొండముచ్చు గుం
పులకు, చరిత్రలో మునిగిపోయినదాంధ్ర వసుంధరాధిపో
జ్జ్వల విజయ ప్రతాపరభసంబొక స్వప్న కథా విశేషమై”
అని కొడాలి వారు గత వైభవం, నేటి దుస్థితిని అశ్రుపూరకంగా ప్రకటించారు. “రావోయీ అదునాతనాంధ్ర సుకుమారా! రమ్ము” అంటూ క్షేత్ర వైభవంలోనికి పాఠకుణ్ణి సాదరంగా ఆహ్వానిస్తూ ఇంద్రగంటి క్షేత్ర ప్రశస్తికల దక్షారామ కృతి రచించారు. తన 12వ యేటనే ‘పెనుగొండ లక్ష్మి’ని దర్శించి హృదయోద్వేగంతో ఆవిష్కరించిన పుట్టపర్తి నారాయణాచార్యులు తెనుగు ఢంకాలు మ్రోగిన దివ్యభూమిని కొనియాడారు.  విశ్వనాథ సత్యనారాయణ -
“గోదావరీ పావనోదార వా: పూర
          మఖిల భారతము మాదన్న నాడు
తుంగభద్రా సముత్తుంగ గానము తోడ
          కవుల గానము శ్రుతిగలయు నాడు
పెన్నానదీ సముత్పన్న కైరవదళ శ్రేణిలో
         శ్రేణిలో తెనుగు వాసించు నాడు
కృష్ణా తరంగ నిర్ణిద్ర గానము తోడ
         శిల్పమ్ము తొలిపూజ సేయునాడు

అక్షర జ్ఞానమెరుగదో ఆంధ్రజాతి
విమల కృష్ణానదీ సైకతముల యందు
కోకిలపు బాట పిచ్చుక గూండ్లు కట్టి
నేర్పుకొన్నది పూర్ణిమా నిశలయందు”

అంటూ విశ్వవీధిన వినుతికెక్కిన భారతీయ కీర్తిని, కళా వైభవాన్ని వర్ణించారు. జాషువా ‘పచ్చిబాలెంతరాలు మా భరతమాత, మాతలకు మాత సకల సంపత్సమేత’ అని దేశాన్ని తల్లిగా భావన చేసి, షట్చక్రవర్తులు, శ్రీకృష్ణుడు, బుద్ధదేవుడు వంటి మహనీయులు కల దేశంగా అభివర్ణించారు. దేశ వైభవాన్ని గేయాలలో కీర్తించిన వారిలో గురజాడ కంటే ముందు ‘మేలుకొనుమీ భరత పుత్రుడ’ అనే గేయకర్తలో కనిపిస్తుంది. గురజాడ దేశభక్తి విశ్వజనీనమైనది. రాయప్రోలు జన్మభూమి గేయం దేశాభిమానాన్ని ప్రతిపదంలోనూ ప్రకటించే జాతీయమైన గేయం.
“ఏ దేశమేగినా ఎందు కాలిడినా
ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా
పొగడరా నీ తల్లి భూమి భారతిని
నిలుపరా నీ జాతి నిండు గౌరవము”
        తెలుగు దేశ ప్రత్యేకత, చరిత్ర, తేజం, శౌర్యం, ధర్మం వంటి వాటిని వర్ణిస్తూ దేశాభిమానాన్ని భారతదేశ పరంగానూ, ఆంధ్రదేశ పరంగానూ వ్యక్తం చేశారు. “తెలుగు తల్లీ నీకు జోహారు… దేశమాతా నీకు జేజేలు… నీ పాలు జుంటి తేనియల తేటలో గోస్తనీపక్వరసమో, సుధాపూరమో…” అంటూ తుమ్మల సీతారామమూర్తి గారు తెలుగు భాగ్యాన్ని వర్ణించారు. 

        జాతీయోద్యమ స్ఫూర్తితో ఆంధ్రోద్యమం కూడా ప్రారంభమయ్యింది. దీనికి విజ్ఞాన చంద్రికా మండలిని స్థాపించడం (1907), సాహిత్య సంఘ సమావేశం (1910), ప్రథమాంధ్ర బాపట్ల మహాసభ (1913) ప్రధాన భూమికలు. మద్రాసు, ఆంధ్ర రాష్ట్రాలకు ఉమ్మడి రాజధానిగా మద్రాసే ఉండేది. కాబట్టి తమకు ప్రత్యేక రాష్ట్రం కావాలనే భావన ఆంధ్రులకు ఏర్పడింది. అప్పటి నుండి ఆంధ్రుల ఘనకీర్తుల గురించి, చరిత్ర గురించి, కళల గురించి, భాషా సాహిత్యాల గురించిన వర్ణనలు, కీర్తనలు ప్రారంభమయ్యాయి. ఈ నేపథ్యంలోంచే తెలుగు భాషపై పద్యాలు, గేయాలు వచ్చాయి. నా మాతృభాష ఎంతో తీయనిదంటూ, భాషను తల్లిగా భావించి కీర్తించడం అతివేలంగా సాగింది. నేడు నిరాదరణకు గురవుతున్న తెలుగు భాషపై మమకారాన్ని పెంచి భాషాభిమానాన్ని కలిగించేందుకు తెలుగు కవులు తెలుగు తల్లిని కీర్తించిన రచనలు దోహదం చేస్తాయి. ‘దేశ భాషలందు తెలుగు లెస్స’ అన్న ప్రస్తుతి క్రీడాభిరామంలో ఉంది. ప్రాచీన కవులూ తెలుగు భాషను వేనోళ్ల కీర్తించారు. అయితే ఆధునిక కాలంలో కవులు ఆంగ్ల భాషా సంస్కృతుల ప్రభావం వల్ల విషమ స్థితిలోనికి నెట్టబడ్డ తెలుగు భాషపై తమ అభిమానాన్ని కవిత్వీకరించారు. ఆంధ్ర జాతి, ఆంధ్ర దేశం, ఆంధ్ర భాష ఈ మూడింటినీ కవితా వస్తువులుగా స్వీకరించారు. “మీగడలు, తేనెలు, పూల లావణ్యము, సెలయేటి ఒయ్యారము కలగలసిన తెలుగు భాష రూపొందెనని వారుత్ప్రేక్షించిరి”

“ఊరక రాష్ట్రమూడిపడు నొక్కొ మహేశ్వరినట్లు మాతృ భా
షా రమణిన్ భజించుటకు సంబరమందని చచ్చు జాతికిన్”
అన్న తుమ్మల వారి మాటల్ని బట్టి ఆనాటి భాషాభిమానం ఎంతగా ఉందో తెలుస్తుంది.

రాయప్రోలు ఆంధ్రావళిలో –
“వంశిన్ వంచి మృణాలమున్ మెలిచి పక్వద్రాక్షనెండించి వా
గంశల్ సుస్వర మాధురీ సురభిళ ప్రాణంబు జిల్కన్ దశ
త్రింశల్లక్ష జన ప్రసన్న రసనా దేవాలయాభ్యంతర
ప్రాంశు ప్రార్థన గీతమైన తెనుగుం బల్కుం బ్రశంసించెదన్”
అంటూ మృదుమధురమైన తెలుగుభాషను కొనియాడారు. తెలుగుకు సాటి మరేదీ లేదని తుమ్మలవారు రాష్ట్రగానంలో – ‘కమ్మని తెల్గటంచు నుడికారము సొంపుల నీ విశాల విశ్వమ్మున దీని బోలిన వచస్సు నభస్సుమ’మన్నారు. ఇద్దరు తెలుగువారు కలిస్తే కచ్చితంగా తెలుగు మాట్లాడరనే విషయాన్ని రాష్ట్ర గానంలో ఇలా చెప్పారు.

“ఇద్దరు తెల్గువాండ్రు తమ యింటివి కష్టసుఖాలు చెప్పుకో
నద్దిర మాతృభాష తగదా మరి యింకొక పెద్ద రోగమే కద్దు
కద్దు వచింతు నాంగ్లము మొగంబు నెఱుంగని శ్రోతముందు దు
ర్బుద్ధులు కూయుచుంద్రు పలుపోకల నెంగిలిపీసు కూతలన్”

          ఇక తెలుగు భాషపై కొండంత మమకారంతో విశ్వనాథ “అఖిల పశ్చిమ రాజ్యభాషాళిలో తన తెలుగు మాటలు విస్తరించాయని, ఒక సంగీతం పాడే విధంగా, స్పష్టోచ్చారణ కల్గి భావ వ్యక్తీకరణలో అమర భాషకు ధీటైన భాష అని, చక్కని చమత్కారం పండించేందుకు వీలున్న భాషని, పది భాషలు తెలిసిన ప్రభువు మెచ్చిన భాషని, తన ఛందస్సు నడకలలో అందం కల భాషని పరిపరి విధాలుగా కీర్తించారు. తన తెలుగెంతో మేటి అని ఎన్నో ప్రయోజనాలను చేకూర్చేదని భావించారు”.

“అంతగా నోటితో నందుము వ్రాయుదు
           మంతగా నంతందమైన భాష
భాషించువారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల్
          వెలయించి యాయువు పెంచు భాష
పలు మాటలు సవ్వడి చేత జనముల
         శీలమ్ము సమరించు మేలి భాష
చెట్ట ఎంతగ పాడు చేయ నెంచిన నైన
         నా వంత మొక్క వోనట్టి భాష

అణువు మొదలు బ్రహ్మాండ పర్యంత మొప్ప
బ్రదుకు, బాసయు నంత పర్యంత ముండు
అంత వ్యాపించి వెలిగెడునట్టి భాష
దివ్యమై చావులేనిది తెలుగు భాష”
అని తెలుగు భాష జీవద్భాషగా పేర్కొంటూ భాషా శాస్త్ర స్వరూపాన్ని కూడా ఇక్కడ ప్రస్తావించారు.

         సురవరం ప్రతాపరెడ్డిగారు కూడా తెలుగు భాషను గౌతమీ జలాలతోనూ, ఖండశర్కర జాతి ఖర్జూర గోక్షీర ద్రాక్షాదియుత రామ రసంతోనూ పోల్చి, తేట తేనెల నవకంపు సోనలకు మా తెలుగు భాషామతల్లి సాటియైనదని కీర్తించారు. ఆరుద్ర తేనె కన్నా మధురమైనది తెలుగు భాషని, ఆ తెలుగుదనం మా కంటి వెలుగని, గత చరిత్ర ఘనమైనదేనని, కానీ, గతం కన్నా భవిష్యత్తు ఆశాజనకం కనుక ఆ భావి కొరకు దీక్షా తిలకం ధరించాలని విజ్ఞప్తి చేశారు. జాతి మరువని ప్రసన్న కవి అయిన శంకరంబాడి సుందరాచారి గారు రచించిన ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ గేయం సమకాలీన ఉద్యమ స్ఫుర్తిలో భాగంగా భాషాభిమానాన్ని తెలుగు ప్రజలకు కొసరి కొసరి వడ్డించింది. భాష గురించి పద్యాలు, గేయాలు మాత్రమే కాకుండా తెలుగు భాషా మాధుర్యాన్ని సంస్కృత పదయుతంగా దేవులపల్లి ‘జయ జయ ప్రియ భారత జనయిత్రీ దివ్య ధాత్రి’ అని రచించారు. తెలుగు భాషపై మమకారాన్ని పెంచేందుకు పిల్లల కోసం కూడా పద్యాలు, గేయాలు కూడా వెలిశాయి.

          కాబట్టి రాజకీయ, సాంఘిక, చారిత్రక, సాంస్కృతిక అవసరాలను బట్టి దేశంలో ఉద్యమాలు పుట్టుకొస్తాయి. ఆ ఉద్యమాలే ప్రజల హృదయాలలో జాతి, దేశ, భాషాభిమానాలను చివురింపజేస్తాయనడానికి స్వాతంత్ర్యోద్యమకాలంలో దేశంలోనూ, ఆంధ్ర దేశంలోనూ విచ్చుకున్న కవుల గళాలే సాక్ష్యాలు.

ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

 

ఆగష్టు 2007
సో_సోమవారం_మొదటి మం బు గు శు
« జూన్   సెప్టెం »
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు