- చాగం కొండారెడ్డి
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
కవి సమ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారి సర్వ సాహిత్య సృష్టిలో శిఖరాయమానమైన రచన శ్రీమద్రామాయణ కల్ప వృక్షం. ఈ కావ్యావతారికలో డెబ్బై అయిదు పద్యాలు, వచనాలు ఉన్నాయి. నన్నయ కాలం నుండి కావ్యానికి ప్రారంభంలో అవతారికను రచించటం కవుల సంప్రదాయమైంది. అవతారికలో కృత్యాద్యవస్థ (కృతి+ఆది+అవస్థ) కనిపిస్తుంది. ఒక కావ్య రచనకు పూర్వం ఆ కవి మానసిక స్థితిని తెలియజేసేదే కృత్యాద్యవస్థ. ఈ దృష్టితో తెలుగు కావ్యావతారికలు చాలా ప్రాముఖ్యాన్ని సంతరించుకున్నాయి.
ఒక కావ్య రచనకు గల ప్రేరకాలు, వస్తు స్వీకరణకు గల కారణాలు, కావ్య వస్తువును ప్రదర్శించే కవితా రీతులు, కావ్యాంకిత ఘట్టాలు మొదలయినవనేకం కావ్యావతారికలో చోటు చేసుకుంటాయి. దృశ్య కావ్యంలో అయితే ఈ అవతారికను “ప్రస్తావన”గా భావించవచ్చు. ఒక రచనా కాలాన్ని నిర్ణయించే పూర్వ రచనల ప్రసక్తి కూడా ఇందులో కనిపిస్తుంది. ఆధునిక కావ్యాలను విడిచి పెడితే ముఖ్యంగా ప్రాచీన కావ్యాలలో సుకవి స్తుతి, కుకవి నింద అవశ్యంగా కనిపించే మరొక లక్షణం.
శ్రీమద్రామాయణ కల్పవృక్ష రచనను 1931లో ప్రారంభించి 1961లో ముగించినట్లు విశ్వనాథ వారు ఒక సందర్భంలో పేర్కొన్నారు (నేను నా సాహిత్య రచనలు: మహతి, యువభారతి ప్రచురణ). అంటే ఈ కావ్య రచనకు ముప్పై సంవత్సరాల కాలం పట్టిందన్న మాట. ఈ ముప్పై ఏండ్ల పాటు చెక్కుచెదరని ఏకాగ్రత మనకు కావ్యంలో దర్శనమిస్తుంది. అంటే ఏయే లక్షణాలను విశ్వనాథ వారు అవతారికలో పేర్కొన్నారో అవే లక్షణాలు పొల్లు పోకుండా కావ్యంలో కనిపిస్తాయి.
విశ్వనాథ “మాస్వామి” శతకాన్ని ప్రారంభించిన “శ్రీమంజూషిక భక్త రక్షణ కళా … సేవింతు విశ్వేశ్వరా” అనే పద్యంతో శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారికను కూడా ప్రారంబించాడు. ఈ కావ్యాన్ని తమ స్వస్థలమైన నందమూరు (కృష్ణా జిల్లా, గుడివాడ తాలూకా) లోని విశ్వేశ్వర స్వామికి అంకితమిచ్చాడు. బాల్యంలో తండ్రి శోభనాద్రికీ తనకూ మధ్య జరిగిన ఒప్పందం ప్రకారం కావ్యం శివునికి అంకితమైంది. దీనికి మరొక కారణం “రామ మహత్తు కృత్స్నమా” పరమ శివునికి తెలిసినట్లుగా మరొకరికి తెలియకపోవడం.
“మఱల నిదేల రామాయణంబ”ని తనను తాను ప్రశ్నించుకున్నాడు. ఉత్తముడైన కవిలో విమర్శకుడు ఎల్లపుడూ మేల్కొని ఉంటాడనటానికిది నిదర్శనం. దీనికి సమాధానం ఈ విధంగా చెప్పాడు. ఈ ప్రపంచం తాను తింటున్న అన్నమే మరల మరల తింటుంది. చేసిన సంసారాన్నే మరల మరల చేస్తుంది. కావున తలచిన రామున్నే మరల మరల తలచుకుంటున్నానన్నాడు. ఒక కావ్యం గొప్పది కావటానికి కొత్త కథలు వస్తువుగా స్వీకరించటం కారణం కాదని పురాతన వస్తువైన రసప్లావితంగా రచించటం దాని ప్రకర్షకు హేతువని నిస్సంశయంగా చెప్పాడు. రామాయణ రచనకు తన తండ్రి ఆజ్ఞ ప్రధాన కారణమైతే, తనలోని ‘జీవుని వేదన‘ రెండవ కారణమని తెలిపాడు.
ఈ సందర్భంలోనే తన తండ్రిలోని అవధి లేని దానగుణాన్ని ప్రశంసించాడు. విశ్వేశ్వరునికి తమ తండ్రికి గల అభేద భావాన్ని స్మరించుకుని కావ్యాన్ని శివునికి సమర్పించాడు. కృతిశత నిర్మాతయైన తనను పుత్రునిగా పడసిన తన తండ్రని కీర్తించాడు. తన తమ్ముల సద్గుణాలను ప్రశంసించాడు. తమ్ముడైన రామమూర్తి తనకు చక్కని లేఖకుడని పేర్కొన్నాడు.
తమ కవితా గురువులు చెళ్ళపిళ్ళ వెంకట శాస్త్రిగారిని స్మరించుకున్నాడు. తమ గురువులో సమభి గమ్యత్వము, అప్రధృష్యత్వము అనే రెండు పరస్పర విరుద్ధ గుణాలున్నాయని చెప్పాడు. వెంకట శాస్త్రి తమ గురువని చెప్పుకోవడం ఆనాటి శిష్యులకు కీర్తికరం. నన్నయ తిక్కనాదులకు కూడా దక్కని కీర్తి తన శిష్యత్వం వల్ల వెంకటశాస్త్రికి దక్కిందని స్పష్టంగా చెప్పాడు. తన ప్రియ మిత్రుడు, జంటకవి అయిన కొడాలి ఆంజనేయులును స్మరించుకున్నాడు. అతడు తోడుగా ఉండి ఉంటే పోతనగారిలాగా కలకండ అచ్చులు తమ కవిత్వం నిండా పోతపోసి ఉండేవారమని చెప్పాడు. తన చిన్ననాటి చెలిమికాడు కొల్లిపర సూరయ్య చౌదరిని కృతజ్ఞతా పూర్వకంగా స్మరించుకున్నాడు. తానొక్కడే రచించినా కర్తృత్వ విషయంలో కొడాలి ఆంజనేయులు భాగస్వామి అని, తానెవరికి తన కృతులను అంకితమిచ్చినా ఆ కృతులన్నింటికీ తన స్నేహితుడు కొల్లిపర చౌదరి నాయకుడేనని ప్రకటించాడు.
సరస్వతీ దేవిని ప్రార్థించిన పిదప “సర్వ ధర్మమూల బీజంబుగ నవిచ్ఛిన్న సంప్రదాయార్థినై” అని అన్నాడు. అందుకు కారకులైన పూర్వాంధ్ర మహాకవులను స్తుతించాడు. అచ్చమైన అమృతాన్ని దేవతలు గ్రోలినందుకు తనకసూయ లేదట. కారణమేమంటే వాల్మీకి కృతమైన రామకథా సుధారసం తనకు దక్కడం.
ఈ విధంగా సుకవి స్తుతి చేసిన విశ్వనాథ కుకవి నింద అప్రశస్తమైనదిగా భావించాడు.
తన కావ్య పాఠకునికి ఉండవలసిన అర్హతను కూడా నిర్దేశించాడు. పూర్వాంధ్ర సంస్కృత సాహిత్య పరిచయం, అనేక శాస్త్ర రహస్యాలను గ్రహించ గలిగిన వివేకం, ఉదాత్తమైన కల్పనల పట్ల మక్కువ ఉన్న పాఠకునికే తన కావ్యం కల్పవృక్ష సదృశమౌతుందని అన్నాడు. కావ్య విషయంలో పూర్వ కవుల ప్రయోగాలే సమర్థనీయాలని భావించాడు. తాను ప్రయోగించిన భాష వ్యవహార భాష అని, తన శైలి మందరమైనదని (వక్రోక్తి ప్రధానమని) రసధ్వని ప్రధానమైన కవితా తత్త్వం కలిగిందని పేర్కొన్నాడు. అలంకారాలు, గుణాలు, వృత్తులు, రీతులు, వ్యంగ్యోక్తి మొదలైన సంస్కృత కావ్య లక్షణాలతో పాటు తెనుగు నుడికారాలు, దృశ్యాలు, పలుకుబడులు మొదలైనవి తన రామాయణంలో కనిపిస్తాయని చెప్పాడు.
ముత్యాల యువరాజు, వాసిరెడ్డి, రాజారామ గోపాలకృష్ణ మహేశ్వర ప్రసాద్ తన “నర్తన శాల” నాటకాన్ని ప్రదర్శింపజేసి అతని తండ్రిపేరు మీద రామాయణాన్ని అంకితమిమ్మని అడిగారు. కానీ, ఇది ఏనాడో శివునికంకితమైందని విశ్వనాథ చెప్పాడు. వారికి తన రామాయణాన్ని వినిపించాడు. బెజవాడ గోపాలరెడ్డి, జలగం వెంగళరావు, మండలి వెంకట కృష్ణారావులు తన రామాయణ ముద్రణకు సహాయపడిన దాతలుగా వారికి కృతజ్ఞతలు వెల్లడించాడు.
విశ్వనాథ తాను మనస్సన్యాసినని పేర్కొన్నాడు. తానెప్పుడూ ఎవ్వరినీ ఇమ్మని అడుగనని, తనంత తానుగా ప్రాప్తమైనదానిని వద్దననని చెప్పాడు. శివుని తేజం తనను చెందినది కావున తనకు స్వర్గవాసం వలదన్నాడు. నాయని సుబ్బారావు తనకు తమ్ముడైనాడని చెప్పాడు. గొట్టిపాటి బ్రహ్మయ్య, అగస్త్యరాజు రాఘవరావు మొదలైన చిన్ననాటి స్నేహితులను స్మరించుకున్నాడు. వారందరూ దయామూర్తులని తను కఠినచిత్తుడనని ఆర్తి చెందాడు. చివరగా తనలోని వేదాంత వాసనకు కారకులైన శ్రీ విమలానంద భారతీ స్వాములను, జగద్గురు శ్రీ కళ్యాణానంద భారతీ స్వాములను సాక్షాద్బ్రహ్మలుగా భావించాడు
ఈ విధంగా విశ్వనాథ రామాయణం రచించడానికి గల ప్రేరణ, రచనావశ్యకత, తన తండ్రి సద్గుణాలు, గురువైన చెళ్ళపిళ్ళవారి ప్రభావం, కవితా లక్షణాలు, తన కావ్య పాఠకునికుండవలసిన అర్హతలు, గ్రంథ ముద్రణకు తోడ్పడిన దాతలు, దయార్ద్ర హృదయులైన చిన్ననాటి స్నేహితులు, తన వేదాంత విద్యా గురువులు - మొదలైన విషయాలు శ్రీమద్రామాయణ కల్పవృక్షావతారిక ద్వారా తెలుస్తున్నాయి.

I liked your article very much. Thank you!
ఏ విషయాన్నైనా కుండబ్రద్దలుకొట్టినట్టుగా చెప్పే చతురత కలిగిన కవిసామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గురువరేణ్యులగురించి యెంత చదివినా యెంత చెప్పినా తక్కువేనని మళ్లీ గుర్తుచేస్తోందీ వ్యాసం.
విశ్వనాధ నాడి పట్టారు. ఇంకా వివరిస్తే బాగుండేది. keep it up.