బెల్లంకొండ రవికాంత్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.
మాటలంటే నిశ్శబ్ద నదిపై కట్టిన
అనుభవాల వంతెన కదా…!
మాటలంటే అప్పుడే వచ్చిన మొగ్గను చూస్తూ
తల్లి చెట్టు కనే చిగురు కలే కదా…!!
మాటలంటే మౌనం ముఖం పైన
పెదవులు రాసిన అందమైన ప్రేమ లేఖే కదా…!!!
* * *
ఈ నిశ్శబ్దాన్ని భరించేదెలా…?
దిగులు మోహంలా చుట్టేసినపుడు
మాటల యంత్రం గుసగుసలాడుతూ
గాలి కెరటాల మీదుగా నీ పలుకులను మోసుకొచ్చేది
కాలం వేగంగా తరుముతుంటే
నిన్ను చూడాలనిపించినపుడు
హృదయంలోనే మరో అర తెరుచుకుని
దూరంగా ఉన్న నిన్ను దగ్గర చేసేది
జ్ఞాపకాలన్నీ గుప్పిట దాగనప్పుడు
మాటలకు కాళ్ళొచ్చి నిన్ను వెతుక్కునేవి
* * *
నన్ను మాట్లాడొద్దంది
ఉన్నట్టుండి మిన్ను విరిగి మీద పడ్డట్టు
స్వేచ్ఛగా ఎగిరే విహంగం రెక్కలు తెగి పడ్డట్టు
ఉరుములు లేకుండానే పిడుగులు పడ్డట్టు
భుజం మీద మోసే కుండని
ఉన్న ఫళంగా బద్దలు కొట్టినట్టు
తనతో నన్ను మాట్లాడొద్దంది…
శబ్దాన్ని అంతం చేసే నిశ్శబ్దం
ఇప్పుడు నాకు ఆప్త మిత్రుడయ్యింది
ఆలోచనలను అల్లుకుంటున్న కాలం తీగ
అనుభూతులను నెమరువేస్తూ
నీతో మాట్లాడుతూనే ఉంటుంది
మాటలంటే మనసుతో సంభాషించడమే కదా…!
ఇక నేనెప్పుడూ నీతో మాట్లాడను
దూరంగా ఉన్నా అందరిలో ఉన్నా
నాలో నేను నీ హృదయంతో సంభాషిస్తూనే ఉంటాను.

రవికాంత్ గారు,
మీ కవిత చాలా బాగుంది. కొన్ని ఇమేజ్ లు ఉదా: మాటలకు కాళ్ళొచ్చి ….
2.శబ్దాన్ని అంతం…. చాలా బాగున్నాయి.