కేశవాచారికి నివాళి

(ఈ వెబ్  నిర్వాహకుడు వడ్లూరి కేశవాచారి కొన్ని అనివార్య పరిస్థితుల్లో25-12-2008 న మరణించారు. అతని ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సాహిత్య వేదిక కోరుకుంటున్నది. ఆయన మరణించిన వెంటనే డా//దార్ల వెంకటేశ్వరరావు తన బ్లాగులో ఇలా రాశారు. దాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం….సంపాదకవర్గం)


కేశవాచారి రాసుకున్న ఒక కవిత : ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

ఓ ప్రభూ!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను,

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

నా స్వామీ!

నన్ను నీలో చేర్చుకోవూ!

నీ గుండెల నిండా అదుముకోవూ!

నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!

ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.

నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

ఓ యోధుడా!

నీ కళ్ళల్లో కాంతిని చూసాను.

ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

ఆ చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!

విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.

ఏ మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!

అది చిత్తరువైతేనేం,

ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన

ఈ అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,

అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర….

అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు

ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

ఓ వీరుడా!

భయపడొద్దంటావ్.

ఓ గురువా!

బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.

ఓ నిత్య ప్రేరకా!

నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.

ఓ యోగీ!

ధ్యానమే నీ జీవనయానమంటావ్.

ఓ మౌనీ!

నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు

మూర్తీభవించిన ఓ సంపూర్ణ భారత యువకా!

నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక

నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,

దివ్యతేజస్సుతో ప్రకాశించిన ఓ ప్రవర్తకా!

నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు

నేటికీ కడలి తరంగాలైఅనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

ఓ మహాత్మా! మహితాత్మా!!

ఓ వ్యక్తీ!శక్తీ!!

ఓ నరేంద్రుడా! వివేకానందుడా!!

మళ్ళీ రావా!

నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.

మళ్ళీ రావా!

నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

వడ్లూరి కేశవాచారి ఫోటో


కేశవాచారి పూర్తి పేరు వడ్లూరి కేశవాచారి. ఈ రోజు హఠాత్తుగా అతను ఆత్మ హత్య చేసుకున్నాడని ఇప్పుడే ఫోను వచ్చింది.


కేశవాచారి తెలుగు బ్లాగులోకానికి తక్కువ సమయంలోనే ఎక్కువ పరిచయమై అనేక వ్యాఖ్యల ద్వారా వివాదాస్పదుడయ్యాడు. అతడు వీర తెలంగాణా వాది. తెలంగాణా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేక పోయేవాడు. అతడు నాతెలంగాణ ( http://natelangana.blogspot.com/, ) బడి పిల్లగాడు naakavitvam/నా కవిత్వం నా తెలంగాణా వడ్లూరి కేశవా చారి మా ఊరు మంథని సాహితి (http://keshavachary.wordpress.com/ మొదలైన బ్లాగులు రాసుకున్నాడు.


కేశవాచారి సృష్టించుకున్న బ్లాగు ” బడిపిల్లగాడు “


మీరు సహకరిస్తే ఒక వెబ్ మాగ్జైన్ ని కూడా నడిపుతానన్నాడు. సరేనని నా కంప్యూటర్ నిచ్చి సహకరించాను. దానికి తెలుగుసాహిత్య వేదిక అని పేరు పెడితే బాగుంటుందని సూచించాను. ఎందుకంటే దానిలో సాహిత్యమే ప్రధానం కావాలని సూచించాను. అలాంటిదే అన అభిప్రాయం అని కూడా అన్నాడు. అలాగే కొన్నాళ్ళు దాన్ని నడిపాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఈలోగా తన ప్రేమాయణంలో మునిగిపోయి అనేక విషయాలను విస్మరించినట్లే తెలుగు సాహిత్య వేదికనూ పట్టించుకోలేదు. సరే చదువులో పడ్డాడని సంతోషించాను.

కేశావాచారి కొన్నాళ్ళు ఎంతో అంకిత భావంతో నడిపిన తెలుగుసాహిత్య వేదిక వెబ్ మాగ్ జైన్‌ ముఖ చిత్రం

కేశవాచారి

సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.., తెలుగు చదివి, ప్రస్తుతం ఎం.ఫిల్ చేస్తున్నాడు.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బి.ఏ పూర్తి చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఎం.., తెలుగు ఎంట్రెన్స్‌లోనూ, ఎం.ఫిల్ ఎంట్రెన్స్‌లోనూ ఫస్ఠ్ ర్యాంక్ సాధించాడు. కానీ ఎప్పుడూ మార్క్సు గురించి పెద్దగా పటించుకొనేవాడు కాదు.

ఈలోగా ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మొదట్లో ఆ అమ్మాయి ఇతను లేకుండా జీవించలేనని చెప్పిందట. “అయితే నాకోసం నువ్వు ఎం.ఫిల్ రాయకుండా ఉండు చూద్దాం అన్నాడట. ఆమె అలాగే చేసింది. ఇలా చాలా విషయాల్లో నమ్మకం కలిగించిందట. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు అడ్డు వచ్చాయి. దానితో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఇతనూ ఆ అమ్మాయి కలిసి ఒక ప్రైవేటు టీ.వి.చానల్ లో ట్రైనీస్ గా చేరారట. అక్కడ ఆమె అనేక మందితో పరిచయం పెంచుకొని ఇతనిని నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేక ఒకసారి యూనివర్సిటీ కాంపస్ లోనే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కానీ, విద్యార్ధుల వెంటనే ఆదుకొని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించారు.

ఇవన్నీ నాకు చెప్పాడు. నాదగ్గరే అతను రీసెర్చ్ చేయడంతో నాదగ్గర కొన్ని విషయాలు చెప్పేవాడు. ఓ టీ.వీ. లో ట్రైనీగా చేరినా ఆర్కుట్ లో కనిపిస్తుండేవాడు. ఈ మధ్య నే నాదగ్గరకొచ్చి కొత్తగా వీడియో సెల్ కొనుక్కునానని చూపి నా ఫోటో తీసుకుంటానని అన్నాడు. దాన్ని తన ఆర్కుట్ లో కూడా పెట్టుకున్నాడు.

కేశవ్ ఆర్కుట్ పేజీ.

ఇక ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటానని అన్నాడు. ‘తెలివైన విద్యార్ధిని ఏ యూనివర్సిటీ వదులుకుంటుంది. వీలైతే జె ఆర్ ఎఫ్ కూడా సాధించి మళ్ళీ డాక్టరేట్ లో చేరమని చెప్పాను. చాలా సంతోషించాడు. “జెఆరెఫ్ కి ప్రిపేర్ అవుతున్నాను. పైగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా ప్రకటించారు కదా చదువుకుంటానని అన్నాడు. ఈ మధ్యనే యూనివర్సిటీ ఫెలోషిప్ కి కూడా సంతకం పెట్టాను. ఇంతలోనే ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరంగా ఉంది.

కేశవ్ నన్నింత మోసం చేస్తావా…

మీరు నాకో రీసెర్చ్ గైడ్ మాత్రమే కాదు

నా జీవితానికే గైడ్ అన్నావే...

మీ తో గడిపితే ఏదో సాధించాలనే వాడివే

మీతో ఉంటే నా బాధలన్నీ చెప్పుకొని ఏడ్వాలనుంటుందన్నావే…

“మీరు నాకో నాన్న, మీరు నాకో అన్న …. మీరు నాకో గొప్పు ఫిలాసఫర్ …

నాకిప్పుడే ఒంటరితనమూ లేద“న్నావే…

మరిప్పుడు నేను … ఇలాంటి మాటలెవరినోటి నుండి వినాలి …

రైలు కింద పడిపోయేటంత కష్టమేమొచ్చింది నాయనా,,,, కేశ వా…

నేను కనబడలేదా…

మనం మాట్లాడుకొనే ఒక్క మాటా గుర్తుకి రాలేదా…

ఏమై పోయావు.., ఎలా వెళ్ళిపోయావు… ఇప్పుడా కంప్యూటర్ ఎలా ఆన్‌ చేయమంటావు

ఎటెల్లి పోయావు

ఎక్కడని వెతకను …
ఎప్పుడో ఒకప్పుడు నువ్వే
నా గురించి రాస్తావను కుంటే …

నీ గురించే నేనే రాయాల్సొచ్చిందే…

ఎంతమోసం చేశావ్ కేశవ్ …

చెప్పకుండానే … ఎటో వెళ్ళిపోయావ్………

అతని మరణానికి సంతాప సూచకంగా అశృనయనాలతో నా బ్లాగును కొన్నాళ్ళు మూసేస్తున్నాను.

–దార్ల వెంకటేశ్వరరావు

2 స్పందనలు నుండి “కేశవాచారికి నివాళి” కు


  1. 1 శివ బండారు 2:28 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 14, 2009

    వడ్లూరి కేశవాచారి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నాను.

  2. 2 తాడేపల్లి 6:14 అపరాహ్నం వద్ద ఫిబ్రవరి 14, 2009

    కీ.శే.కేశవాచారి నా బ్లాగులో అప్పుడప్పుడు వ్యాఖ్యలు రాసేవారు. ఆయన బ్లాగులు నేను చదవలేదు. వ్యాఖ్యాతగానే పరిచయం. అయితే నేను సమైక్యవాదిని కావడం ఆయనకి నచ్చక వ్యాఖ్యలు రాసిన సందర్భాలే హెచ్చు. శైలిలో ఆవేశం జాస్తి. కానీ అది నిజజీవితంలో తొందఱపాటు నిర్ణయానికి దారితీసిందంటే బాధాకరంగా ఉంది.


ప్రత్యుత్తరమిమ్ము




Telugutalli_image

a

 

ఫిబ్రవరి 2009
సో మం బు గు శు
« సెప్టెం    
 1
2345678
9101112131415
16171819202122
232425262728  

మా పాఠకులు