పురాతన పేజి 3

ప్రణయ తరంగం

– అపూర్వం   

నిన్ను మొదటిసారి చూసిన ఆక్షణం
నాకెందుకో అపురూపమయిపోయింది.                    
స్మృతుల సెలయేటిలో ఒక మధురతరంగం ఎగసిపడి
మనసులో మౌనంగా నిక్షిప్తమైపోయింది.

అది నిజమనుకుంటే కలలాగ నన్ను వీడిపోతుంది.
అది కల అనుకుంటే నిజంలా నా వెన్నంటే ఉంటుంది.
ఏది కలో, ఏదినిజమో…! తెలియక                              
కాలం కొలిమిలో కరిగిపోతూ,                                
ఆశల చెలిమిలో ఎదిగిపోతూ…                                   
నువ్వు వస్తావని రోజూలాగే వేచిచూసే నా హృదయం,
నీ రాక కన పడగానే,                                                               
నీ స్వరం వినపడగానే                                                     
రివ్వున ఎగిరి నీ ముందు ప్రత్యక్షం అవుతుంది.          
నీ కోసమే జీవితం అంకితమి స్తుంది.

నీవు నన్ను పిలిచిన మొదటిక్షణం,                
లీలగా చిరునవ్వు విసిరిన ఆ అద్భుత క్షణం,
తలుచుకుంటే…                                                                             
జగాన్ని జయించిన విజయగర్వం                                   
నా సొంతమౌతుంది.                                                                
ఆ క్షణం గుర్తుచేసుకుంటే                                    
నామది                                                                                                
తీరాన్నిస్పర్శించిన ప్రణయతరంగమవుతుంది.

దిన దినము ప్రతిక్షణం దిగులైన జీవనం…
ప్రతిగడియ నీ కొరకే వెచిచూసే నా వేదనా హృదయం
ప్రతిగడియ నీ కొరకే వెదికి అలిసె నా లేత హృదయం అప్పుడెప్పుడోకలిశావు…                                     
మొన్నెపుడో కలిశావు… మళ్ళీ ఇప్పుడు…
అయినా నా గుండెచప్పుడుగా ఉండిపోక
ఈ దాగుడుమూతలెందుకు చెలీ!  

                             

వెళ్ళిపో…

రాజ్ కిషోర్, (ఎం.ఏ.),
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

ఓ మానవ మూర్తీ!
ఎక్కడున్నావయ్యా?
ఎంత పిలిచినా పలకవు
ఎక్కడ వెతికినా కనపడవు…
జాగ్రత్త! జాగ్రత్త!!
ఈ దగాకోరు సమాజంలో
జాగ్రత్త! జాగ్రత్త!!

బోర్డు చూడలేదా
“నరభక్షకులున్నారు జాగ్రత్త”                         
ఈ లోకం నిను బ్రతకనివ్వదు
ఈ సమాజం నీ పై కరుణ చూపదు.
కుళ్ళిన ఈ సమాజం నిండా అన్నీ విష నాగులే.
వెళ్ళిపో… పారిపో…

మనిషితనం , మానవత్వం కొరగారిన ఈ లోకంలో
సామాన్యునికి తావు లేనే లేదు.
వీళ్ళకు ఈ నేల చాల్లేదు ,అందుకే
ఆ నింగి మీద పడ్డారు .

నిన్నటివరకూ “అందమైన జాబిలి” 
ఈ రోజు రియల్ ఎస్టేట్లకు లోగిలి .
“చందమామ రావే”అని గోరు ముద్దలు పెడుతూ
అమ్మ చూపించిన “మామ”కు
నేడు ఖరీదు కడుతున్నారు .
నీకు అక్కడ కూడా స్థానం లేదు 
వెళ్ళిపో … పారిపో …
అష్ఠ దిక్కులను దాటి 
పంచ భూతాలను దాటి…

మాక్సిమ్‌ గోర్కీ “అమ్మ” నవల పై సెమినార్ ( 09-03-2007 సెంట్రల్ యూనివర్సిటీ )

ప్రజా సాహితి మాస పత్రిక ఆధ్వర్యంలో హైదరాబాదు సెంట్రల్ యూనివర్సిటీ స్కూల్ ఆఫ్ హ్యుమానిటీస్ ఆడిటోరియంలో మధ్యాహ్నం 3 గం. నుండి మాక్సిమ్‌ గోర్కీ “అమ్మ” నవల పై సెమినార్ నిర్వహించబడుతుంది.

సభాధ్యక్షులు: డా. పిల్లలమర్రి రాములు

ప్రధాన వక్త: ప్రొ. హరగోపాల్

వక్తలు: డా. దార్ల వెంకటేశ్వరరావు

డా. సునంద

డా. భట్టు లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొంటారు.

సభ ప్రారంభానికి ముందు అమ్మనవల పై ప్రజాసాహితి ప్రచురించిన ప్రత్యేక సంచిక ఆవిష్కరణ కార్యక్రమం ఉంటుంది.

కృతజ్ఞతలు…

“తెలుగు సాహిత్య వేదిక” పాఠకులకు అభివందనం. పెద్దగా హంగులూ, ఆర్భాటాలూ, ప్రకటనలూ లాంటివి ఏమీ లేకుండానే ప్రారంభమయిన ఈ సాహితీ పత్రిక అప్పుడే రెండవ సంచికలోకి ప్రవేశించింది.

ఇంటర్నెట్ పాఠకులకు సమకాలీన సాహిత్యాన్ని అందుబాటులోకి తేవడంతో పాటూ, తెలుగు బ్లాగుల లోకంలోకి సాహిత్య విద్యార్థుల ప్రవేశానికి దారులు వేయాలన్న మా ప్రయత్నం తప్పకుండా ఫలిస్తుందన్న నమ్మకం మాలో కలిగింది. అందుకు కారణం మీ స్పందనే! పత్రిక మొదటి సంచిక సందర్భంగా మీ విశేషాదరణ మాకెంతో ప్రోత్సాహాన్నిచ్చింది. సాహిత్య వేదికను మరింత ఆకర్షణీయంగా తీర్చదిద్దాలన్న ఉత్సాహాన్ని కలుగజేసింది.

ముందే అన్నట్లుగా సరికొత్త శీర్షికలను ఆరంభించబోతున్నాంఅభిప్రాయాల, రచనల ప్రకటనకు ఈ పత్రికను వేదిక చే్సుకోవాలనే ఔత్సాహికులను ఎల్లవేళలా ఆహ్వానిస్తున్నాం 

ఇంతవరకులానే ఇకముందు కూడా మీ ఆదరాభిమానాలు, సహాయ సహకారాలు లభిస్తాయని ఆశిస్తూ

మాలో ఎన్నో కొత్త   ఆలోచనల్ని రేకెత్తించిన మీ స్పందనకి మరోసారి కృతజ్ఞతలు తెలుపుతూ

- తెలుగు సాహిత్య వేదిక

అన్నమయ్య పద అన్వేషణలో…

- డా. పిల్లలమర్రి రాములు,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అన్నమయ్య ప్రారంభించిన పదకవిత్వం తెలుగు సాహిత్యంలో నూతన కవితా సంప్రదాయాన్ని ఆవిష్కరించింది. ఆయన రచించినట్లుగా చెప్పుకునే 32 వేల సంకీర్తనల్లో దాదాపు 14.5 వేల సంకీర్తనలే లభ్యమయినా, అవి అనంతమైన వైవిధ్యానికి, నూతన భావ ప్రకటనకు వీలు కల్పించిన రచనలు. ఆయన రచనల పట్ల ఎంత ఆకర్షణ ఉందో, అన్నమయ్య వ్యక్తిగత జీవితమూ అంతటి ఆసక్తిదాయకం. అన్నమయ్య కవిత్వంతో పెనవేసుకొనిపోయిన ఆయన జీవితాన్ని నేటికీ తెలుగులో అనేకమంది పరిశోధకులు వివరించి ఉన్నారు. సంప్రదాయంలో వినూత్నంగా, విశిష్టంగా ఆవిష్కృతమైన గ్రంథం – ‘God on the Hill’ . అన్నమయ్య రచనల్లో ఆయన కవిత్వాన్ని, వ్యక్తిత్వాన్ని ప్రదర్శించే నూరు ప్రాతినిధ్య కవితలను ఆంగ్లంలోకి అనువదించారువిఖ్యాత పరిశోధక, అనువాదకులు వెల్చేరు నారాయణరావు, డేవిడ్ షుల్మన్ గారులు. తెలుగు సాహిత్యంతో గాఢమైన అనుబంధం మాత్రమేగాక, సొగసైన ఆంగ్లంలో పెట్టగలిగిన కవితా హృదయులు గావడం వల్ల అన్నమయ్య పాదాలకు ఎంతటి లాలిత్యమూ, సౌకుమార్యమూ ఉన్నాయో, ఆంగ్లంలోనూ అంతటి మార్దవం సమకూర్చారీ అనువాదకులు.

అన్నమయ్యను ఆంగ్లంలో పరిచయం చేసినవారిలో అడపా రామకృష్ణ రావు గారి కృషి శ్లాఘనీయం. వారు కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురణ కోసమై రాసిన పుస్తకంలో అన్నమయ్యను అత్యంత సమర్థవంతంగా ప్రదర్శించి ఉన్నారు. కానీ, పుస్తకం పరిధి చిన్నది కావడం వల్ల పరిమితులున్నాయి. ప్రస్తుతానువాద గ్రంథం విస్తృతమైనదేగాక, కవితానువాదాన్ని గ్రహించి తర్వాత కవి రచన కాలం నాటిదో, సందర్భంలో కావ్యం వెలువడిందో వివరించే విపుల పరిశోధనాత్మక వ్యాసం సమకూర్చడం అనువాదక పరిశోధకులు నిర్వహించిన ప్రత్యేక కృషి.

అన్నమాచార్య జీవితాన్ని అధ్యయనం చేయడానికి గొప్ప ఆకర గ్రంథంఆయన మనవడే ( తాళ్ళపాక చిన్నన్న/ తిరువేంగళనాథుడు ) రచించినఅన్నమాచార్య జీవిత చరిత్రము’. అది చిన్న ద్విపద కావ్యమే అయినా వేటూరి ప్రభాకరశాస్త్రి గారు ఎంతో విపులమైన పీఠిక సమకూర్చి అన్నమాచార్య జీవితానికి, కవిత్వానికి ఉన్న సంబంధాన్ని అతి సమర్థంగా స్థాపించారు. నేటికీ ప్రభాకర శాస్త్రి గారి పీఠిక మౌలిక విషయాలను గ్రహించడానికి ఎంతో ఉపయుక్తంగా ఉంది. అన్నమాచార్య సాహిత్యాన్ని లోకానికి పరిచయం చేయడంలో వేటూరి ప్రభాకరశాస్త్రి గారు, రాళ్ళపల్లి అనంత కృష్ణశర్మ గారు చూపిన వైదుష్యం లోకమంతా గౌరవించింది. అనువాదక, పరిశోధక గ్రంథంలోనూ వారి కృషిని స్మరించడం అనువాదకుల విజ్ఞతకు నిదర్శనం.

అన్నమయ్య విశిష్టాద్వైత సిద్ధాంతాన్ని అనుసరించినవాడు. సిద్ధాంతం ద్వైధీభూతమెలాగో ఆయన కవిత్వమూ ద్విధావిభజితం. భగవత్కీర్తనకై పరమ ఆధ్యాత్మిక సంకీర్తనలు ఎలా రచించాడో, వెంకటేశ్వరుడు ఆయన ఇరువురు భార్యలుఅలమేలు మంగ , పద్మావతుల శృంగారాన్ని రసరమ్యంగా కీర్తించాడు. భక్తుడైన వ్యక్తి శృంగార సంకీర్తనలను నాయక, నాయికలు అలౌకికులని భావిస్తే అవి భగవదారాధనలో భాగమవుతాయి. శృంగార సంకీర్తనలు భగవంతునికి సంబంధించినవని భక్తుడు నిరంతరం భావిస్తూ ఉండాలి. భక్తుడు/ శ్రోత/ పాఠకుడు పాత్రల్లో తాదాత్మ్యమవడానికి వీలు లేదు. అప్పుడవి పరమలౌకిక శృంగార గీతాలయ్యే ప్రమాదముంది. అన్నమాచార్యుడిని తన ఆస్థానానికి ఆహ్వానించి వేంకటేశ్వరుడి పై పాట పాడుమన్న సాళువ నరసింహరాయుడుఏమొకో చిగురుట ధరమున’ అనే రమ్యమైన గీతాన్ని విని, తనపైగూడా అటువంటి కీర్తనే పాడుమని అనడం, నరసింహరాయుడు పాత్రలో తాదాత్మ్యమవడం వల్లే జరిగింది. ‘నరహరి కీర్తన నానిన జిహ్వ ఒరుల నుతింపగ నోపదు జిహ్వ’ అని అన్నమయ్య సున్నితంగా తిరస్కరించాడు. సందిగ్ధావస్థలోని సంక్లిష్ట స్థితిని పరిశోధకులు అతి సున్నితంగా విశదీకరించారుతమ After word లో.

అన్నమాచార్య సంకీర్తనలను, వాటి అనువాదాలను క్రింద పొందుపరచదలిచాను. మానవుని ఏకాగ్రతా స్వరూపమే దైవమని వర్ణించడానికి అన్నమయ్య మంచి సంకీర్తన కూర్చారు -ఆయన,

చూచే చూపొకటి సూటి గుఱియొకటి

తాచి రెండు నొకటైతే దైవమే సుండి…” ( )

Seeing is onething,

Looking is another,

Of both come together

That is god.

యేనుగ దలిచితే యేనుగై పొడచూపు

మాను దలచిన నట్టేమానై పొడచూపు

పూసి పెద్దకొండ దలపోయ గొండై పొడచూపు

తానే మనోగోచరుడు దైవమే సుండి

If you look for an elephant

He comes as an elephant

If you look for a tree

He’s a tree.

If you look for a mountain,

He”ll be a mountain

God is what you have in your mind.

నాటికి నాడే నా చదువు

మాటలాడుచును మఱచేటి చదువు -

I study just for the day,

for getting as i learn

ఎనయనీతని నెఱుగుటకే పో

వెనకవారు చదివిన చదువు

మనసున నీతని మఱచుటకే పో

పనివడి యిప్పటి ప్రౌఢ చదువు -

They used to study

to find god.

Now we study

to forget him.

అన్నమయ్య సంకీర్తనలు లౌకికజీవిత స్వరూపాన్ని, అందులోని మాయను, అవగాహన చేసుకోవడానికి గొప్ప అవకాశం కల్పిస్తాయి. అటువంటి పదాల్లో ఒకటి

ఒక్కటి తరువాత వేరొకటైన కాచుకుండు

చక్క దెరనాటకము సంగతి సంసారము … ( )

వొండె నాపద దీరితే నొండె సంపదైన వచ్చు

అండనెన్నడు దీరదు హరిదలచ

తండోప తండములై తలమోపులు పనులు

చండిపెట్టి పనిగొను సంసారము … (ఒక్క )

పద్యానికి అనువాదం

When you are done with one puppet,

Another will be waiting

Life is a play of shadows on the screen.

If you get rid of poverty , you’re stuck with riches.

You’ll never have time to think of god.

There’s allways a zillion things to do.

Life wips you, like a bonded slave.

అన్నమాచార్య సంకీర్తనల్లోని…

కడలుడిపి నీరాడగ దలచు వారలకు

కడలేని మనసుకు గడమ యెక్కడిది -

You say you want to bathe

When the waves subside

Is there an end

To the endless waves?

దాహమణిగిన వెనుక తత్వమెరిగెదనన్న

దాహమేలణుగు తా తత్వమేమెరుగు

దేహంబు గలయన్ని దినములను బదార్థ

మోహమేలుడుగు దాముదమేల కలుగు -

You say, “Let me quench my thirst,

and then I’m find the truth”.

Why should thirst be quenched?

How can you know truth?

వెఱ్ఱులాల మీకు వేడుక గలి(గి)తే

అఱ్ఱువంచి తడుకల్లంగ రాదాఅన్న మధురమైన గేయంలోతడుక’ అనే మాటను ‘basket’ అని ( Try basket weaving ) అనువదించడం సరిగా కుదిరిందాయని అనుమానం. అంతే గాదు, అన్నమయ్య సామాజిక అవగాహన ప్రదర్శించే ఉత్తమ కవితా ఖండికలు అనువాదంలో రాలేదు. ఆయన శ్రమ విలువ ప్రతిపాదిస్తూ, అనువాదంలో రాలేదు. ఆయన శ్రమ విలువ ప్రతిపాదిస్తూ,

మహినుద్యోగి గావలె మనుజుడైన వాడు

సహజివలె నుండేమీ సాధింపలేడుఅని చెప్పే గేయాన్ని, జీవితం పట్ల ఉండదగిన అవగాహనను గూర్చి,

కంతలేని గుడిశొక్క గంపంతైనంజాలు

చింతలేని యంబలొక్క చేరడే జాలు

జతగాని తరుణి యే జాతైన యదేచాలు

వితలేని సంపదొక్క వీసమే చాలుఅని చెప్పే గొప్ప గేయాన్నిగాని, కేవల బాహ్యాచారాల వల్లనే మనిషికి ఔన్నత్యం సమకూరదని చెప్పే,

మిక్కిలి నీట మునింగే మీనుకది స్నానమా

నిక్కి ఆకుమేయ నింనిది తపమా

పులులు గుహలనుంటే పొల్లింప ఋషులా

యిల బక్షులాకాశానకేగితే దేవతలా…” లాంటి గేయాలను అనువదించి ఉంటే సంపుటికి మరింత సమగ్రత్వం చేకూరేదని అనిపిస్తుంది. ప్రశ్నే ఒకసారి నారాయణరావుగారికి వేస్తే అనువాదంలో ఒదగకపోవడం వల్ల గూడా మంచి పద్యాలను కొన్నింటిని వదిలివేసినట్లుగా చెప్పారు. ఏమైనా తెలుగు కవిత్వాన్ని ప్రపంచానికి కళాత్మకంగా, పరిశోధనాత్మకంగా పరిచయం చేయడం అత్యంత ప్రశంసనీయం, పరమ ఆదరణీయం.

తెలుగు సాహిత్యంభద్ర పరచాల్సిన’ భాషగా పరిగణింపబడకుండా సజీవభాషగా వెలుగొందడానికి, మూలభాషలోని రామణీయకతను గ్రహించడానికి అనువాదాలు ఉపయోగపడితే రచయితలే గాదుతెలుగు వ్యవహర్తలందరూ హర్షిస్తారు.

(హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధ్యక్షులు, ఆచార్య పరిమి రామనరసింహంగారి షష్టిపూర్తి అభినందన సంచిక “పరా వాఙ్మయి” సౌజన్యంతో.)

అడవితో యుద్ధం – అదో నైతిక విజయం

-డా. జె. భీమయ్య,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

కేశవరెడ్డి చిత్తూరు జిల్లాలోని తలుపుల పల్లి అనే గ్రామంలో మార్చి 10, 1946 లో జన్మించాడు. ఆధునిక నవలా రచయితగా పేరున్న కేశవరెడ్డి వృత్తి పరంగా వైద్యుడు. ఆయన రచించిన అతడు అడవిని జయించాడుఅనే నవల అద్భుతమైనది. లోతైన కథావస్తువుతో నిమిడీకృతమై రూపొందిన నవల. పరిమాణంలో చిన్నదైనా పాఠకుని మనసులో చెరగని ముద్ర వేస్తుంది. అట్టడుగు మరియు నిమ్నవర్గాల జీవనశైలి, వారి ప్రతిభా పాటవాలు, భాషా సంస్కృతి మొదలైన సామాజిక, స్వాభావిక, సహజత్వ ఆంశాలను ప్రతిబింబించే నవల అతడు అడవిని జయించాడు“.

కేశవరెడ్డి వృత్తి రీత్యా వైద్యుడే అయినా, ప్రవృత్తి రీత్యా సాహిత్య రచన పట్ల ఆయనకున్న అభినివేశం, ఆసక్తి, ఆలోచన అమోఘమైనది. జీవనపోరాటం, బతుకు దుర్బరత్వం మొదలైన పీడిత లక్షణాలు వ్యక్తిగతంగా ఆయన అనుభవంలో లేకపోయినా, తన నిశిత పరిశీలన, ఊహాత్మక పరిశోధన ద్వారా పీడిత వర్గాల సంస్కృతిని తన కలం నుండి జాలువారించారు. ఆయన కున్న సామాజిక ఆర్థిక నేపథ్యం వేరు కావచ్చు. అయినా సామాన్య ప్రజల ముఖ్యంగా గిరిజన తెగల భాషా సంస్కృతికి తాను దగ్గరగా జీవించిన వైనం ఈ నవలలో కనిపిస్తుంది. తన జీవన సామాజిక పరిస్థితులు తన కలాన్ని ప్రభావితం చేస్తున్నాయా? అని అనుకోవటానికి ఆధారాలు మనకు కనపడవు.ఈ నవలలో ముసలి వాడి బతుకు పోరాటాన్ని రచయిత వర్ణించిన తీరు స్వాభావికతను సంతరించుకున్నది. ఎరుకల తెగ (కులం) కి చెందిన ముసలివాడి పేరు నవలలో ఎక్కడా ప్రస్తావించటం జరగలేదు. ముసలివాడి జీవన పోరాటాన్ని ఒక వ్యక్తి పోరాటంగా కాక గిరిజన తెగ పోరాటంగా, ఇంకా కొంత విశాల దృక్పథంతో ఆలోచిస్తే పీడిత ప్రజల బతుకు పోరాటంగానూ అర్థం చేసుకోవచ్చు. ముసలి వాడిని అడవిరాజ్యం లో గిరిజన తెగల ప్రతినిధిగా చూడాలి.

ఈ నవల పద్నాలుగు భాషల్లోకి అనువదింపబడటం ఒక ప్రత్యేకత. రాయలసీమ ప్రాంతపు గిరిజన తెగల భాషా సంస్కృతి సాంప్రదాయాలను ప్రతిబింబించే పుస్తకంగా దీన్ని చెప్పుకోవచ్చు. ఈ నవలలో ఒక ముసలివాడు కథానాయకుడు. నిమ్న వర్గాలను కథానాయకులుగా నిలబెట్టడం అంటే వారి ప్రతిభను గుర్తించటమే! వారి భాషా సంస్కృతిని గౌరవించడమే! వారి జీవన శైలి ప్రాముఖ్యతను గ్రహించడమే! మానవత్వం కరువైన నేటి సమాజంలో మానవత్వాన్ని సాహిత్యంగా మలచి చెప్పడం ఒక గొప్ప సాహిత్య పరిణామం. కేశవరెడ్డి పీడిత ప్రజల పక్షపాతి అని నిరూపిస్తుంది ఈ నవల. కేశవరెడ్డి పై మార్క్స్ ప్రభావం ఉందని విమర్శకులు అంటున్నారు. ఆర్థిక న్యాయం సామాజిక శ్రేయస్సు దృష్ట్యా మార్క్స్ను అనుసరించడం అంటే పీడిత పక్షపాతిగా నిలబడటమే. సాహిత్యపరంగా ఆ పని కేశవరెడ్డి చేసాడు.

అతడు అడవిని జయించాడునవలలో ముసలివాడు తనకు తాను మాట్లాడుకునే వైనం కనిపిస్తుంది. క్రూర మృగాలతో యుద్ధం అంటే అడవితో యుద్ధమే. ముసలివాడు జంతువులను ఉద్దేశించి మాట్లాడినా తనకు తానుగా ఊహించుకునే భావాలు రాయలసీమ ప్రాంత గిరిజన తెగల సహజ భాషలోని యాసను ప్రతిబింబిస్తాయి. కుల పరంగా భాష ఉంటుందా? నేటి కుల సమాజంలో అలా కూడా ఉంటుంది అని అనుకునే వారు ఉన్నారంటేనూ అశ్చర్యం లేదు. కులాధారిత భాష అంటే ప్రత్యేకంగా ఉండదు కానీ ప్రధాన జనజీవన స్రవంతికి దూరంగా జీవనం కొనసాగిస్తున్న గిరిజన తెగల భాషలో యాస తీవ్రత ఎక్కువగా కనిపిస్తుంది. పరిమిత సమూహాలు, అధిక సంఖ్యాక ప్రజల జీవన శైలిలో మమేకం కాకపోవడం చేత వారి భాషలో కనిపించే వ్యత్యాస భావన మూసగా రూపొందవచ్చు. భాష, సంస్కృతిని జీవన శైలి నిర్దేశిస్తుంది. నవలలో ముసలివాడి భాష అత్యంత సహజత్వం కలిగి ఉన్నది. అతడు నిరక్షరాస్యుడైనప్పటికినీ అడవికి సంబంధించిన శాస్త్రీయ జ్ఞానం అవగాహన అతనికి ఉంది. అతనిది జంతువులకు దగ్గరగా నివసించిన జీవితం. జీవితానుభవమూ, శారీరక దృడత్వము, మనో ధైర్యము, అంతకుమించి ఆత్మ విశ్వాసము అతని వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తాయి. మనవడు గోపాల్ మినహా తనకు ఎవరూ లేరు. అతడికి పందులే సర్వస్వము. అవే స్థిర చర ఆస్తులు. చదవుట కొనసాగించు ‘అడవితో యుద్ధం – అదో నైతిక విజయం’

నగ్నచిత్రం!

ఏడాకులపల్లి వెంకటేష్, (ఎం.),

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

నేనో
నగ్న చిత్రాన్ని!
దేహం అంగడి సరుకైనప్పుడు
అంగుళానికి ఒక రేటు.
నా మనస్సుతో పని లేకుండా
నిరంతరం పాకే విష జంతువులు.
ఆకలి నాకు నా దేహం చూపించింది.
మలినమైన లోకంలో
మానవత్వాన్ని విడిచి,
మెహింది బజారులో నిలబడ్డ నా విష యంత్రం.
సూట్,బూట్ లతో వచ్చే వారికి
నా దేహం ఒక వస్తువు.
పచ్చని నోట్ట్లతో వచ్చే వారికి
మనసు మరిచి బిస్తర్ వేస్తాము.
అవును నేను వేశ్యనే!
బ్రతుకు భారం ఐనప్పుడు
బరువును దించుకోవడం
నేరంకాదు!!

నేటి తెలుగు

-లక్ష్మణరావు , (ఎం.ఏ), 

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

ఎప్పటికప్పుడు మారుతున్న నవ సమాజంలో ఇప్పటికీ, ఎప్పటికీ అగ్ర తాంబూలం తప్పకుండా   ఇంగ్లీష్‌కే చెందుతుందేమోనన్న ఆలోచన వస్తేనే ఎంతో బాధనిపిస్తుంది. తెలుగు భాషని ఇంగ్లీషు పదాలతో ఎంగిలి చేస్తున్న దుస్థితి చూస్తుంటే ఏమాత్రమూ సాహితీ సౌరభాన్ని గ్రోలని విద్యార్ధులము, మనకే ఇంత బాధగా ఉంది. ఇక సమయంలో నన్నయ్య పుట్టి ఉంటే ఆంధ్ర మహాభారతాన్ని కూడా పండిత ప్రశంసల కోసం ఇంగ్లీషులోనే రచించి ఉండేవాడేమో…! ఎందుకులే అది ఊహించలేని పరిస్థితి.

అమ్మానాన్నలు కూడా తమ పిల్లలు మమ్మీ డాడీ అని పిలిస్తే మా వాళ్ళకి ఇంగ్లీషు మీడియం చదువు బాగా అబ్బుతున్నదంటూ చెప్పలేనంత ఆనందంతో ఉప్పొంగిపోతున్నారు. యువత తెలుగు వచ్చి కూడా రానట్లు ఇంగ్లీషు సంపర్కంతో తెలుగుని కలగలిపి, రాని యాసని కూడా ఆసతో నాలుకకు నేర్పించి మరీ మాట్లాడేస్తున్నారు. చక్కగా తెలుగుని మాట్లాడక పోగా తొక్కలోఅంటూ అపహాస్యం చేస్తున్నారు.

ఇది ఇలాగే కొనసాగితే, కొన్నాళ్ళకు తెలుగులో సంస్కృత పదాలున్నట్లే ఇంగ్లిషులోతెలుగు పదాలుండే నకిలీ తెలుగు వస్తుందేమో? మనమిప్పుడు సంస్కృతంలో దేవతలు మాట్లాడుకునే వారంట! అని చెప్పుకుంటున్నట్లుగా భావితరాలవారు తెలుగులో మన పూర్వులు మాట్లాడేవారంటఅని చెప్పుకుంటారేమో! అమ్మో ఆ దుస్థితి ఎన్నటికీ కలుగకూడదు. ఆలోచనే తట్టుకోలేని మనము అటువంటి పరిస్థితులు చూడకుండా కాస్త ముందు తరంలో పుట్టినందుకు సంతోషపడాలా ఏంటి? నిజంగా నాకు సిగ్గేస్తున్నది!.

కానీ ఏ రోజుకైనా తెలుగు పట్ల అభిమానం ప్రజల్లో అంకురించి తెలుగులో మాట్లాడటమే ఒక ఫ్యాషన్ అన్న ధోరణి వస్తే ఎంతో బాగుంటుంది. ఏమవుతుందొ ఏమో కానీ ఈ భావనే చాలా సంతృప్తినిస్తున్నది. అందుకే కరుణశ్రీ ఇలా అంటాడు.

“ఒకమారు వెనుకకు తిరిగి చూచి
దిద్దుకోవమ్మ!బిడ్డల తెనుగు తల్లీ”.

దీనావస్థ

- శ్రీనివాస్ రెడ్డి,

హైదరాబాదు విశ్వవిద్యాలయం.

అలనాడు అలరించె ఆంధ్ర రాజుల్ తమ ;సీ;
పెరటి తోటందుపెంచి తెలుగు
ఈనాడు పెంచిరి ఈర్ష్యతో పాలకుల్
వీధి బయటికిని విసిరి వేసి
తెలుగు యనగ నాడు వెలుగులు నిండెను
చీకటి తెరలన్ని చెదిరిపోయి
ఈనాడు యెటుచూడ నిండమావాస్యలు
పిలువగా రాదయ్య తెలుగు పులుగు

యెచ్చటికిని బోయి యెచట దాక్కుండెనో ;.వె;
తెలుగు భాష నందు వెలుగు ధనము
ఆదరణయు లేక అనాథైపోయెనో
కనబడుటయు లేదు కలియ జూడ

తెలుగు భాష నందు తీయగా పలుకగా ;.వె;
చెప్పు తీసికొట్టు తప్పుయనుచు
అన్య భాషనందు అచ్చు తప్పు పలుక
బాగు బాగు యనెడి పాప జనులు

భారతీ స్తుతి!

- ఓం ప్రకాశ్, ఎం., (ఎం.ఫిల్),

ఉస్మానియా విశ్వవిద్యాలయం.

వ్యాసపుర పీఠవాసవు

భాసుర వీణాక్షదామ పాణివి వాణీ!

వ్యాసమునీశ్వర సేవిత

దాసుడ ననుయేలరమ్ము దయతో దేవీ!

 

బాసర పుణ్యతీర్థమున భాసిలి, భక్త జనావళీ మనో

వాసినియై, వచోవిభవ భావ విజృంభిత దివ్య మూర్తయై,

హాసవిలాస దీవరదయై, కవితారచనాత్మరూపయై,

వ్యాస మహామునీశకృతయై వెలుగొందెడి వాణి వేడెదన్!

 

బాసర పీఠమున్ వెలిగి భక్తుల పాలిటి కల్పవల్లియై,

దోసములన్నిటిన్ దునిచి, దోర్బల ధీబల దాత్రివంచు, నీ

బాసట వీడకన్ హృదయ పద్మమునందున గొల్తునమ్మ, యో

సారసనేత్రి! నీ కరుణశారద చంద్రికలౌత భారతీ!!

భారతీ స్తుతి!!

చాకలకొండ రమాకాంతారావు,

Cincinnati OH USA.

ఆసరా యిచ్చే బాసర తల్లీ ;పల్లవి;

ఆశలు తీర్చవే అమృత వల్లీ!

వాసిగా నీ భక్తుల ఎదలో

వాసము ఉండెడి వెన్నెల వెల్లీ! ;ఆసరా;

వేదములే నీ వీణపై పలుక

మధుర నాదముల గానములొలుక

మోదముతో మా ఎదలే కులుక

ఆదరించవే అమృత వల్లీ! ;ఆసరా;

సరిగమలే నీ సొంపులు కాగ

స్వరజతులే నీ పదగతి కాగ

అరువది నాలుగు కళాకేళిగ

నిరతము మమ్ము బ్రోవవే తల్లీ! ;ఆసరా;

దవళ వస్త్రముల దీప్తులు మెరయగ

నవ్వుల జల్లుల వెన్నెల కురియగ

పువ్వుల వానలు నీ పలుకులుగ

కవితలే సొంపులై కులుకెడి తల్లీ! ;ఆసరా;

వినయ విధేయతా వన్నెల పూలతో

మన్నన చేసి మొక్కెద నిన్నే

కన్నులలోన కరుణను నింపి

నన్నిక బ్రోవుము నిరతము తల్లీ! ;ఆసరా;

చక్కటి చదువుల సంపదలిచ్చి

వాక్కులలోన వన్నెలు కూర్చి

పెక్కు విద్యల ప్రసాదమిచ్చి

మొక్కులు తీర్పవే మమతల వల్లీ! ;ఆసరా;

« వెనుకటి పుటముతరువాతి కాగితం »


Telugutalli_image

a

 

డిసెంబరు 2009
సో మం బు గు శు
« Feb    
 123456
78910111213
14151617181920
21222324252627
28293031  

మా పాఠకులు