కేశవాచారికి నివాళి

(ఈ వెబ్  నిర్వాహకుడు వడ్లూరి కేశవాచారి కొన్ని అనివార్య పరిస్థితుల్లో25-12-2008 న మరణించారు. అతని ఆత్మకు శాంతి కలగాలని తెలుగు సాహిత్య వేదిక కోరుకుంటున్నది. ఆయన మరణించిన వెంటనే డా//దార్ల వెంకటేశ్వరరావు తన బ్లాగులో ఇలా రాశారు. దాన్ని ఇక్కడ ప్రచురిస్తున్నాం….సంపాదకవర్గం)


కేశవాచారి రాసుకున్న ఒక కవిత : ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

ఓ ప్రభూ!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను,

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

నా స్వామీ!

నన్ను నీలో చేర్చుకోవూ!

నీ గుండెల నిండా అదుముకోవూ!

నీవు విహరిస్తున్న సత్యలోకపు ఛాయలకైనా నన్ను తీసుకెళ్ళవూ!!

ఈ అశాంతి జ్వలిత విశ్వం నుండి ప్రశాంతికై కలవరిస్తున్న అంధుడిని.

నీ అమృత వాక్కుల వెలుగుల బాటలోకి నన్నూ పయనింప చేయవూ!

ఓ యోధుడా!

నీ కళ్ళల్లో కాంతిని చూసాను.

ఎన్ని వెలుగులు విరజిమ్మితేనేం,

ఆ చుక్కలన్నీ నీ ముందు తల దించుకోలేదా!

విశ్వ మర్మమెరిగిన నీ నవ్వును చూసాను.

ఏ మోనాలిసా నా కళ్ళకు తట్టలేదే!

అది చిత్తరువైతేనేం,

ప్రాపంచిక వాంఛలతో నిండిపాపపు పనులెన్నో చేసిన

ఈ అపవిత్రపు చేతులతో నీ బుగ్గలను తాకాను,

అంతే!ఇన్నాళ్ళ నా మోసం,స్వార్థం,ద్వేషం,కుట్ర….

అన్నీ వేళ్ళతో సహా లాగేస్తున్నట్లు

ఒళ్ళు జలదరించిన అనుభవం ఎలా మరిచిపోగలను.

ఓ వీరుడా!

భయపడొద్దంటావ్.

ఓ గురువా!

బాధ్యతలన్నినా పైనే వేస్తావ్.

ఓ నిత్య ప్రేరకా!

నను నిరంతరం మేల్కొలుపుతుంటావ్.

ఓ యోగీ!

ధ్యానమే నీ జీవనయానమంటావ్.

ఓ మౌనీ!

నిశ్శబ్దమే బంగారమంటావ్.

వేలకోట్ల సంవత్సరాల నా సంస్కృతి శక్తులు

మూర్తీభవించిన ఓ సంపూర్ణ భారత యువకా!

నీవు నాడు దేశదేశాల్లోనాటిన నా భారత కీర్తి పతాక

నేటికీ విశ్వ వినీలాకాశంలోగర్వంగా రెపరెపలాడుతూనే వుంది.

విశ్వ మతాల సారాన్ని గ్రహించి,

దివ్యతేజస్సుతో ప్రకాశించిన ఓ ప్రవర్తకా!

నీవు నాడు ప్రతి భారత యువకుని గుండెల్లోనింపిన అమృత సందేశాలు

నేటికీ కడలి తరంగాలైఅనునిత్యం ఘోషిస్తూనే వున్నాయి.

ఓ మహాత్మా! మహితాత్మా!!

ఓ వ్యక్తీ!శక్తీ!!

ఓ నరేంద్రుడా! వివేకానందుడా!!

మళ్ళీ రావా!

నా సంస్కృతి గొప్పదనాన్నిఈ విశ్వ జనులందరికీ చాటడానికి.

మళ్ళీ రావా!

నా సంస్కృతి వృక్షాన్నిఈ చెదలు బారినుండి రక్షించడానికి.

అందుకే నా దైవమా!

ఈ రోజు నీ పాదాలను కడుగుతున్నాను

ఇన్నాళ్ళ నా అజ్ఞానం వర్షించిన కన్నీళ్ళతో….

వడ్లూరి కేశవాచారి ఫోటో


కేశవాచారి పూర్తి పేరు వడ్లూరి కేశవాచారి. ఈ రోజు హఠాత్తుగా అతను ఆత్మ హత్య చేసుకున్నాడని ఇప్పుడే ఫోను వచ్చింది.


కేశవాచారి తెలుగు బ్లాగులోకానికి తక్కువ సమయంలోనే ఎక్కువ పరిచయమై అనేక వ్యాఖ్యల ద్వారా వివాదాస్పదుడయ్యాడు. అతడు వీర తెలంగాణా వాది. తెలంగాణా గురించి ఎవరైనా ఏమైనా అంటే తట్టుకోలేక పోయేవాడు. అతడు నాతెలంగాణ ( http://natelangana.blogspot.com/, ) బడి పిల్లగాడు naakavitvam/నా కవిత్వం నా తెలంగాణా వడ్లూరి కేశవా చారి మా ఊరు మంథని సాహితి (http://keshavachary.wordpress.com/ మొదలైన బ్లాగులు రాసుకున్నాడు.


కేశవాచారి సృష్టించుకున్న బ్లాగు ” బడిపిల్లగాడు “


మీరు సహకరిస్తే ఒక వెబ్ మాగ్జైన్ ని కూడా నడిపుతానన్నాడు. సరేనని నా కంప్యూటర్ నిచ్చి సహకరించాను. దానికి తెలుగుసాహిత్య వేదిక అని పేరు పెడితే బాగుంటుందని సూచించాను. ఎందుకంటే దానిలో సాహిత్యమే ప్రధానం కావాలని సూచించాను. అలాంటిదే అన అభిప్రాయం అని కూడా అన్నాడు. అలాగే కొన్నాళ్ళు దాన్ని నడిపాడు. చాలా మంచి పేరు వచ్చింది. ఈలోగా తన ప్రేమాయణంలో మునిగిపోయి అనేక విషయాలను విస్మరించినట్లే తెలుగు సాహిత్య వేదికనూ పట్టించుకోలేదు. సరే చదువులో పడ్డాడని సంతోషించాను.

కేశావాచారి కొన్నాళ్ళు ఎంతో అంకిత భావంతో నడిపిన తెలుగుసాహిత్య వేదిక వెబ్ మాగ్ జైన్‌ ముఖ చిత్రం

కేశవాచారి

సెంట్రల్ యూనివర్సిటీలో ఎం.., తెలుగు చదివి, ప్రస్తుతం ఎం.ఫిల్ చేస్తున్నాడు.

అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం ద్వారా బి.ఏ పూర్తి చేసి సెంట్రల్ యూనివర్సిటీ ఎం.., తెలుగు ఎంట్రెన్స్‌లోనూ, ఎం.ఫిల్ ఎంట్రెన్స్‌లోనూ ఫస్ఠ్ ర్యాంక్ సాధించాడు. కానీ ఎప్పుడూ మార్క్సు గురించి పెద్దగా పటించుకొనేవాడు కాదు.

ఈలోగా ఓ అమ్మాయి ప్రేమలో పడ్డాడు. మొదట్లో ఆ అమ్మాయి ఇతను లేకుండా జీవించలేనని చెప్పిందట. “అయితే నాకోసం నువ్వు ఎం.ఫిల్ రాయకుండా ఉండు చూద్దాం అన్నాడట. ఆమె అలాగే చేసింది. ఇలా చాలా విషయాల్లో నమ్మకం కలిగించిందట. ఇద్దరూ పెళ్ళి చేసుకోవాలనుకున్నారు. అయితే కులాలు అడ్డు వచ్చాయి. దానితో ఆ ప్రయత్నం అక్కడితో ఆగిపోలేదు. తర్వాత ఇతనూ ఆ అమ్మాయి కలిసి ఒక ప్రైవేటు టీ.వి.చానల్ లో ట్రైనీస్ గా చేరారట. అక్కడ ఆమె అనేక మందితో పరిచయం పెంచుకొని ఇతనిని నిర్లక్ష్యం చేయడాన్ని తట్టుకోలేక ఒకసారి యూనివర్సిటీ కాంపస్ లోనే ఆత్మహత్య ప్రయత్నం చేశాడు. కానీ, విద్యార్ధుల వెంటనే ఆదుకొని కేర్ ఆసుపత్రికి తీసుకెళ్ళి బతికించారు.

ఇవన్నీ నాకు చెప్పాడు. నాదగ్గరే అతను రీసెర్చ్ చేయడంతో నాదగ్గర కొన్ని విషయాలు చెప్పేవాడు. ఓ టీ.వీ. లో ట్రైనీగా చేరినా ఆర్కుట్ లో కనిపిస్తుండేవాడు. ఈ మధ్య నే నాదగ్గరకొచ్చి కొత్తగా వీడియో సెల్ కొనుక్కునానని చూపి నా ఫోటో తీసుకుంటానని అన్నాడు. దాన్ని తన ఆర్కుట్ లో కూడా పెట్టుకున్నాడు.

కేశవ్ ఆర్కుట్ పేజీ.

ఇక ఇటువంటి వాటి జోలికి వెళ్ళకుండా మళ్ళీ రీసెర్చ్ చేసుకుంటానని అన్నాడు. ‘తెలివైన విద్యార్ధిని ఏ యూనివర్సిటీ వదులుకుంటుంది. వీలైతే జె ఆర్ ఎఫ్ కూడా సాధించి మళ్ళీ డాక్టరేట్ లో చేరమని చెప్పాను. చాలా సంతోషించాడు. “జెఆరెఫ్ కి ప్రిపేర్ అవుతున్నాను. పైగా జూనియర్ లెక్చరర్ ఉద్యోగాలు కూడా ప్రకటించారు కదా చదువుకుంటానని అన్నాడు. ఈ మధ్యనే యూనివర్సిటీ ఫెలోషిప్ కి కూడా సంతకం పెట్టాను. ఇంతలోనే ఇలాంటి వార్త రావడం చాలా బాధాకరంగా ఉంది.

కేశవ్ నన్నింత మోసం చేస్తావా…

మీరు నాకో రీసెర్చ్ గైడ్ మాత్రమే కాదు

నా జీవితానికే గైడ్ అన్నావే...

మీ తో గడిపితే ఏదో సాధించాలనే వాడివే

మీతో ఉంటే నా బాధలన్నీ చెప్పుకొని ఏడ్వాలనుంటుందన్నావే…

“మీరు నాకో నాన్న, మీరు నాకో అన్న …. మీరు నాకో గొప్పు ఫిలాసఫర్ …

నాకిప్పుడే ఒంటరితనమూ లేద“న్నావే…

మరిప్పుడు నేను … ఇలాంటి మాటలెవరినోటి నుండి వినాలి …

రైలు కింద పడిపోయేటంత కష్టమేమొచ్చింది నాయనా,,,, కేశ వా…

నేను కనబడలేదా…

మనం మాట్లాడుకొనే ఒక్క మాటా గుర్తుకి రాలేదా…

ఏమై పోయావు.., ఎలా వెళ్ళిపోయావు… ఇప్పుడా కంప్యూటర్ ఎలా ఆన్‌ చేయమంటావు

ఎటెల్లి పోయావు

ఎక్కడని వెతకను …
ఎప్పుడో ఒకప్పుడు నువ్వే
నా గురించి రాస్తావను కుంటే …

నీ గురించే నేనే రాయాల్సొచ్చిందే…

ఎంతమోసం చేశావ్ కేశవ్ …

చెప్పకుండానే … ఎటో వెళ్ళిపోయావ్………

అతని మరణానికి సంతాప సూచకంగా అశృనయనాలతో నా బ్లాగును కొన్నాళ్ళు మూసేస్తున్నాను.

–దార్ల వెంకటేశ్వరరావు

జాతీయ సదస్సు తొలిరోజు వేడుక

 

తెలుగు వ్యాకరణములు – పునస్సమీక్ష” అన్న అంశంపై హైదరాబాదు విశ్వవిద్యాలయం, తెలుగు శాఖ వారు నిర్వహిస్తున్న రెండు రోజుల జాతీయ సదస్సు (సెప్టెంబరు 12,13 తేదీలలో) ఈ రోజు ఉదయం 11.30 ని.లకు ప్రముఖుల సమక్షంలో, ఉత్సాహభరిత వాతావరణంలో ప్రారంభమయింది.

ఈ సదస్సు ప్రారంబోత్సవ సభకు ప్రపంచ ప్రసిద్ధిగాంచిన భాషా శాస్త్రవేత్త, పూర్వాశ్రమంలో ఉప కులపతి అయిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు ముఖ్య అతిథిగా విచ్చేసారు. హైదరాబాదు విశ్వవిద్యాలయం తెలుగు శాఖాధిపతి ఆచార్య బేతవోలు రామబ్రహ్మంగారు సభాధ్యక్షత వహించారు.

ఈ జాతీయ సదస్సు నిర్వాహకులలో ఒకరిగా వ్యవహరిస్తున్న డా. రేమిల్ల వెంకట రామకృష్ణ శాస్త్రిగారు మాట్లాడుతూ తెలుగులో నన్నయ కాలం నుండి నేటి వరకు ఎన్నో వ్యాకరణాలు వచ్చాయనీ, అయితే, వాటికి సంబంధించిన విశేషాంశాల గురించే కాకుండా, ప్రపంచీకరణ నేపథ్యంలో మారిన/మారుతున్న నేటి భాషకు అనుగుణంగా ఎలాంటి ఆధునిక వ్యాకరణాలు రావాలన్న విషయాన్ని కూడా చర్చకు పెట్టాలనుకోవడం ఈ సదస్సు ముఖ్యోద్దేశ్యం అన్నారు.

ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆచార్య భద్రిరాజు కృష్ణమూర్తిగారు తమ ప్రసంగం మొదట్లో హైదరాబాదు విశ్వవిద్యాలయానికి తనకు గల అనుబంధాన్ని గుర్తు చేసుకుంటూ తాను ఉప కులపతి (వైస్ చాన్స్ లర్)గా పని చేసిన నాటికి, నేటికీ యూనివర్సిటీ ఎంతో మార్పు చెందిందన్నారు.

వ్యాకరణాల గురించి మాట్లాడుతూ  సంప్రదాయ వ్యాకరణాలన్నింటినీ చదివాననీ, వ్యాకరణాలపై ఆసక్తి పెరగడానికి తన గురువుగారే కారణమనీ, తన గురువుగారయిన దువ్వూరి వెంకట రమణ శాస్త్రిగారు వ్యాకరణ పాఠాన్ని కూడా కావ్య పాఠంలా చెప్పేవారని ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అయితే, భాషా శాస్త్రం చదువుకున్నాక వ్యాకరణాలపై అంతవరకూ ఉన్న దృష్టి కోణం మారిందని చెప్పారు.

ప్రాచీనుల, ఆధునికుల దృష్టికోణాలలో వ్యాకరణ ప్రయోజనాన్ని వివరిస్తూ

ప్రాచీనుల దృష్టిలో వ్యాకరణ ప్రయోజనం కావ్యభాషలో సాధు,అసాధు ప్రయోగాలను నిర్ణయిచడానికి, భాషలో ఉచ్చారణ దోషాలను నివారించడానికి పరిమితమైందన్నారు. ఈ సందర్భంగా వ్యాకరణ ప్రయోజనాన్ని గురించి తెలిపే ఒక చక్కని శ్లోకాన్ని ఉదహరించారు.

యద్యపి బహునాధీషే తథాపి పఠపుత్ర వ్యాకరణం

స్వజనః శ్వజనః మాభూత్ సకలం శకలం సకృత్ శకృత్    

(భావం: నాయనా నీవు శాస్త్రాలు, వేదాలు నేర్వకున్నా మానె కానీ, వ్యాకరణం నేర్చుకో! ఎందుకంటే స్వజన (మన వాళ్ళు) అన్న శబ్దాన్ని శ్వజన (కుక్కలు) అనకుండా, సకలం (సర్వం) అన్న శబ్దాన్ని శకలం (ముక్క/లు) అని పలకకుండా, సకృత్ (మంచి పని) అన్న శబ్దాన్ని శకృత్ (మలం) అని  పలకకుండా ఉండడానికి – అని ఒక తండ్రి తన కుమారునికి చెబుతున్నాడు.)

చిన్నయసూరి కాలానికి కావ్య భాషలో వ్యావహారికం వచ్చినా ఆయన కేవలం కవిత్రయ ప్రయోగాలనే తన వ్యాకరణానికి ప్రమాణాలుగా స్వీకరించాడన్నారు. వీరి కాలం వరకూ (ప్రాచీనుల దృష్టిలో) వ్యాకరణం అంటే ఒక భాషను ఎలా వ్యవహరించాలో తెలుపుతూ రాయబడిన  కొన్ని నియమాల గ్రంథమనీ, అంటే  ఇలా రాస్తేనే వ్యాకరణం అనే అభిప్రాయం ఉండేదన్నారు.

ఆధునికుల దృష్టిలో – ఒక భాషకు రాస్తేనే వ్యాకరణం అనడం సరికాదనీ, మాతృభాషా వ్యవహర్తకు భాషకు సంబంధించిన నియమాలు అంతర్గతంగా తెలిసి ఉంటాయనీ, బాల్యంలోనే  పరిశీలన వల్ల ఇది సాధ్యమవుతుందనీ, ఎంచేతనంటే భాష అంటేనే నియమం, నియతి కలిగి ఉండేది కనుక అన్నారు. దీనినే  చేకూరి రామారావుగారు గుప్త వ్యాకరణం అన్నారని చెప్పారు.

మాతృభాషలో మాట్లాడుతున్నవాడు పండితుడయినా, పామరుడయినా, ఏ ప్రాంతం వాడయినా (మాండలికాలు), ఎవరయినా సరే వాడు పలికే వాక్యం వ్యాకరణ విరుద్ధం కాదని చెప్పారు. ఇక వ్యాకరణాలు చదవడం ఆ వ్యాకర్త ఉద్దేశించినవేమిటో తెలుకోవడానికే అయిఉండాలన్నారు.

సభాధ్యక్షత వహించిన ఆచార్య బేతవోలు రామబ్రహ్మం గారు మాట్లాడుతూ ముఖ్య అతిథి ప్రసంగంలోని కొన్ని విశేషాంశాలపై తమ అభిప్రాయాల్ని వెలిబుచ్చారు. పరిశోధక విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో పత్ర సమర్పణ చేయడానికి ఉత్సాహం చూపించడాన్ని హర్షించదగ్గ విషయమని చెప్పారు. ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ జాతీయ సదస్సు అనుకున్న సమయం కంటే కాస్త  ఆలస్యంగా ప్రారంభమవడానికి మార్గాలు కారణమని, ఈ మధ్య కాలంలో భాగ్యనగర మార్గాలు “దుర్మార్గాలు” కావడంతో  ప్రయాణాలు అనుమానాస్పదాలయ్యాయనడంతో సభలో నవ్వులు కురిసాయి. వీరి ప్రసంగం ఆద్యంతం చమత్కారయుతంగా సాగింది.

భోజన విరామానంతరం  ఆచార్య నడుపల్లి శ్రీరామ రాజు గారి అధ్యక్షతన జరిగిన పత్ర సమర్పణ కార్యక్రమంలో అమరేశ్వరం రాజేశ్వర శర్మ, ఆచార్య కోవెల సంపత్కుమారాచార్య, ఆచార్య సుమతీ నరేంద్ర, ఆచార్య ఉషాదేవి, డా. సంగంబొట్ల నరసయ్య, చుండూరు మాణిక్యం, జాడ సీతాపతి, శ్యామలాంబ తమ పత్ర సమర్పణ చేశారు.

ఈ జాతీయ సదస్సులో  రెండవ రోజు  మరిన్ని పత్ర సమర్పణలు జరగనున్నాయి.

(హైదరాబాదు విశ్వవిద్యాలయం పరిశోధక విద్యార్థి కేశవాచారిగారి నివేదిక)

                               – తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్య వేదిక

తెలుగు సాహిత్య వేదిక పాఠకులకి 60వ స్వాంతత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు.

అవని ప్రేమ

 డా//అద్దంకి శ్రీనివాస్
హైదరాబాదు విశ్వవిద్యాలయం

గుండె ఒక్కసారిగా తడిసి ముద్దవుతుంది.
వంటి మీద వెంట్రుకలకి కూడా దేశభక్తి ఉందేమో
దేశం పేరు చెప్పగానే నిక్కపొడుచుకొని మరీ
వందనాలర్పిస్తున్నాయి. చదవుట కొనసాగించు ‘అవని ప్రేమ’

అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ

డా//దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం. 

తొమ్మిది నెలలు నిండక ముందే
ప్రపంచంలోపడిన సంబరంతో
సంకని సంచి తగిలించిన మరుక్షణమే
నా చేతిలో…
పిచ్చుకకు రాబందు రెక్కలొచ్చిన సమాచారం
నమ్మకం నరకబడుతున్నట్లు
నీకు రెక్కలెలా వచ్చాయి
చందమామని వదలి ఉండలేనని
ఒట్టేసుకున్న వెన్నెల చదవుట కొనసాగించు ‘అంతర్జాతీయ మార్కెట్లో పవిత్రప్రేమ’

భరతమాత

అండెం శ్రీనివాస్ రెడ్డి,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

సీ: పరదేశ సంస్కృతుల్ పసి మొగ్గవలె నుండ 
             పువ్వువైతివి నీవు పుట్టగానె 
     గంగవాణి సిందుత్తుంగ తరంగాన
             తొంగి చూస్తివి నీవు తొల్లినాట 
     అజ్ఞాన తామసిన్ అణచివేస్తివి నీవు
             వేదకిరణముల వెలికి తీసి చదవుట కొనసాగించు ‘భరతమాత’

నాదు జాతి నాదు దేశము నాదు భాష

డా// అద్దంకి శ్రీనివాస్,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

        ఉవ్వెత్తున ఎగసిన కెరటంలాంటి చైతన్యంతో సాగిన భారత స్వాంతంత్ర్యోద్యమంలో అదే స్పూర్తితో ఆంధ్రులు పోరాడారు. నిండైన దేశ భక్తి అందించిన కొత్త ఊపిరి పోసుకొని తెలుగు కవులు శంఖారావాన్ని పూరించారు. వివిధ ప్రక్రియలను వాహికలుగా చేసుకొని రచనలు చేసి ఉద్యమానికి ప్రేరకులయ్యారు. ప్రజలను దేశం కోసం పాటుపడే విధంగా తయారు చేయడం కోసం, దేశ భక్తిని నూరిపోసేందుకు కవుల కలాలు జోరుగా సాగాయి.

         జాతీయోద్యమ కవిత్వాన్ని పుష్కలంగా రచించిన కవి రాయప్రోలు సుబ్బారావు “నాదు జాతి, నాదు దేశము, నాదు భాష అను అహంకార దర్శనమందు” అని ప్రబోధిస్తూ జాత్యభిమానం, దేశాభిమానం, భాషాభిమానం ప్రతి ఒక్కరికీ నరనరాల్లో జీర్ణించుకుపోయేలా సృజన చేశారు. ఈ స్పృహ తెలుగు సాహిత్యంలో ఆధునిక కాలం నుండే వచ్చింది. అంతకు ముందు సాహిత్యంలో ఈ స్పృహ ఉన్నప్పటికీ దాని లక్ష్యం, పరిధి వేరు. గురజాడ అప్పారావుగారి దేశభక్తి గేయం మొదలుకొని ఈ అభిమాన త్రయాన్ని బోధించే సాహిత్యమంతా ఒక ఉద్యమ స్ఫూర్తితో, చైతన్య దీప్తితో, సంస్కరణాత్మకమూ, ప్రబోధాత్మకమూ అయిన గమ్యం వైపే సాగింది. ఈ నేపథ్యం గల సాహిత్యంలో రాయప్రోలు వారు చెప్పిన మూడు అభిమానాలను స్పృశించడమే ఈ వ్యాసోద్దేశ్యం. చదవుట కొనసాగించు ‘నాదు జాతి నాదు దేశము నాదు భాష’


Telugutalli_image
జనవరి 2020
సో మం బు గు శు
« ఫిబ్ర    
 12345
6789101112
13141516171819
20212223242526
2728293031  

మా పాఠకులు