తొలి తెలుగు నవల

డా. దార్ల వెంకటేశ్వరరావు,
హైదరాబాదు విశ్వవిద్యాలయం.

   కందుకూరి వీరేశలింగం పంతులు రచించిన  “రాజశేఖర చరిత్రము” (1878) ను విమర్శిస్తూ కాశీభట్ట బ్రహ్మయ్య శాస్త్రి తొలిసారిగా “నవల” అనే పదాన్ని ప్రయోగించారు. అంతకుముందు నరహరి గోపాల కృష్ణమశెట్టి “శ్రీ రంగరాజ చరిత్రము” (1872) రాసినా, దాన్ని ఆయన “నవీన ప్రబంధము” అని తెలుగులోనూ, ఆంగ్లంలో రాసుకున్న “Preface” లో “Novel” అని చెప్పుకున్నారు.

   పదహారవ శతాబ్దంలోనే తెలుగులో నవల వచ్చిందనే పరిశోధకులూ ఉన్నారు. తెలుగులో పింగళి సూరన రాసిన “కళా పూర్ణోదయం” తొలి తెలుగు నవల అవుతుందన్నారు. దీన్ని “ప్రబంధంగా”నే సాహితీ పరిశోధకుల్లో అత్యధికులు గుర్తిస్తున్నారు. కథ కల్పితమే కానీ, ఆధునిక నవలకు ఉండవలిసిన లక్షణాలు “కళా పూర్ణోదయం” లో లేవని పరిశోధకులు (ఆచార్య జి. నాగయ్య  1996 : 809) స్పష్టం చేశారు.

   కొక్కొండ వెంకటరత్నం పంతులుగారు 1867 లో రాసిన “మహాశ్వేత”ను  తెలుగులో మొట్ట మొదటి నవల అని నిడుదవోలు వెంకటరావు తదితర పరిశోధకులు పేర్కొన్నారు. కానీ, ఇది బాణుడు సంస్కృతంలో రాసిన “కాదంబరి” కి అనువాదమే తప్ప స్వతంత్ర కల్పన కాదు. అంతే కాకుండా దీనికి ఆదునిక సాహిత్య ప్రక్రియ నవలా లక్షణాలు లేవని, పైగా “మహాశ్వేత” పూర్తిగా లభించలేదనీ పరిశోధకులు భావించారు.

   తెలుగు నవలపై పరిశోధన చేసిన వాళ్ళలో తొలి తెలుగు నవల ఏది అన్నదానిపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. “ఆంధ్ర నవలా పరిచయం” పరిశోధనలో మొదలి నాగభూషణం శర్మ, “తెలుగు నవలా వికాసము” పరిశోధనలో బొడ్డుపాటి వేంకట కుటుంబరావు, “సమగ్ర ఆంధ్ర సాహిత్యం” లో ఆరుద్ర తదితరులు తొలి తెలుగు నవలగా నరహరి గోపాల కృష్ణమశెట్టిగారు రాసిన శ్రీ రంగరాజ చరిత్రము”ను గుర్తించారు.  దీనికే “సోనాబాయి పరిణయం” అనే మరో పేరు కూడా ఉంది.

   కందుకూరి వీరేశలింగం పంతులు గారి రచనలపై సమగ్ర పరిశీలన చేసిన అక్కిరాజు  రమాపతిరావు, “తెలుగు సాహిత్య వికాసము” లో పుల్లా బొట్ల వేంకటేశ్వర్లు, సమాజము – సాహిత్యం లో ఆర్.ఎస్. సుదర్శనం  మొదలయిన వారంతా కందుకూరి వీరేశలింగం పంతులు రాసిన “రాజశేఖర చరిత్రము”నే  తొలి తెలుగు నవలగా పేర్కొన్నారు. ఇంకా చాలామంది పరిశోధకులు తొలి తెలుగు నవలపై లోతుగానే చర్చించారు. “రాజశేఖర చరిత్రము” వెలువడిన తర్వాత అనేక మంది రచయితలను ప్రభావితం చేసి, తెలుగులో అనేక నవలలు వెలువడటానికి కారణమయ్యింది. ఈ నవలకున్నంత  ‘ప్రభావం -మార్గదర్శనం’ అంతకుముందు వచ్చిన నవలలకు లేవు.

   “శ్రీ రంగరాజ చరిత్రము”లో తెలుగు ఆచారాలు సంప్రదాయాలను వివరిస్తూ నవలను రాసినట్లు రచయిత చెప్పుకున్నారు. ఈ నవల పంతొమ్మిదవ శతాబ్దంలో రాసినా అప్పటికి నాలుగువందల  సంవత్సరాల క్రితం జరిగిన కథ అందులో ఉంది. ఒక గిరిజన యువతిని రాజు చూడటం, అమెను ప్రేమించటం, పెళ్ళి చేసుకోవటం ప్రధాన ఇతివృత్తం. గిరిజన యువతి అనగానే పుట్టుక చేతనే ఆమె గిరిజన యువతి కాదు. కొన్ని కారణాల వల్ల తన కుటుంబం నుండి చిన్నప్పుడే విడిపోయి గిరిజన కుటుంబంలో పెరిగి పెద్దవుతుంది. ఆమె అందాన్ని చూసి రాజు పెళ్ళి చేసుకుంటాడు. తీరా చూస్తే ఆ యువతి రాజుగారి మేనత్త కూతురే. దళిత స్పర్శ ఉంది కాబట్టి, అప్పటికే రచయితకు సామాజిక అభ్యుదయ దృక్పథం ఉన్నట్లు భావించి దాన్ని తొలి తెలుగు నవలగా కొంతమంది కీర్తిస్తున్నారు. నిజానికి నాటి అస్పృశ్యతను చెప్పటమే తప్ప చెప్పే తీరులో గానీ, భావజాలంలో గానీ ఆధునికత లేదు. ఈ విషయంలో కందుకూరి వారి “రాజశేఖర చరిత్రము”లోనూ అస్పృశ్యతను చూపించారు. రెండు నవలల్లోనూ కథా నాయకుడికి దాహం వేస్తుంది. అస్పృశ్యుడు ఎదురుపడినా వాళ్ళ చేతుల్లో నుండి నీళ్ళు తాగవలసి వచ్చినా ప్రాణలైనా వదిలేయటానికి సిద్ధమే కానీ, తాగడానికి ఇష్టపడని స్థితిని వర్ణించారు.

   నరహరి గోపాల కృష్ణమశెట్టి “శెట్టి” కులస్థుడు  కనుక, ఆయన రచనను తొలి తెలుగు నవలగా అంగీకరించలేదనే వాళ్ళూ ఉన్నారు. కానీ కందుకూరి వీరేశలింగం పంతులుగారి “రాజశేఖర చరిత్రము” ఆయన సమకాలీన కాలాన్ని ప్రతిఫలించేటట్లు రాశారు. ఆయన రాసిన నవలకు వివేకచంద్రిక అనే పేరు కూడా ఉంది. ఆ నవలలో అంతరించిపోతున్న రాజరిక జీవిత లక్షణాలు కనిపిస్తాయి. దాంతో పాటూ అశాస్త్రీయ విషయాలను ఖండించటం కనిపిస్తుంది. మూఢ విశ్వాసాలను కొన్ని పాత్రల  ద్వారా కల్పించి వాటి వల్ల జరుగుతున్న మోసాలను కూడా వివరించారు. ఈ నవల గోల్డ్‌స్మిత్ రాసిన “వికార్ ఆఫ్ ది వేక్ ఫీల్డ్” నవలకు అనుసరణ అనే వాళ్ళు కూడా ఉన్నారు. కానీ, ఈ నవల నిండా తెలుగు వాళ్ళ జీవితం, వాళ్ళు జీవించిన పరిసరాలూ కళ్లకు కట్టినట్లుగా కనిపిస్తాయి. పైగా కందుకూరి వారి రచనల నిండా ఆధునిక సంస్కరణ భావాలు ఉన్నాయి. నిజానికి తన పేరు చివర ‘పంతులు’ అనే గౌరవ వాచకాన్నీ, జంధ్యాన్నీ వదిలేస్తున్నానని ఆయన ప్రకటించారు. అయినా కానీ మనం పంతులుగారనే పిలుస్తున్నాం. ఇది ఆయనకున్న సంస్కరణ భావాలకున్న నిబద్దత.

   ఇంకా అనేక లక్షణాలతో రాజశేఖర చరిత్రమే తొలి తెలుగు నవలగా గుర్తించబడుతుంది.   సమన్వయ వాదులు మాత్రం “శ్రీ రంగరాజ చరిత్రము”ను తొలి తెలుగు చారిత్రక నవలకు పునాదులు వేసిన నవల అని పేర్కొన్నారు. ఈ విషయాలన్నీ ఒకచోట చర్చించుకోవటమే తప్ప దీనిపై ఇప్పటికే తెలుగు సాహిత్య చరిత్రలో ఎన్నో చర్చోపచర్చలు జరిగాయి.  పూర్వ పరిశోధనలే అయినా వాటినన్నింటినీ ఒకచోటకు చేర్చి చదువుకోవటమే తొలి తెలుగు శీర్షిక ఉద్దేశం.

(సశేషం)

4 స్పందనలు to “తొలి తెలుగు నవల”


  1. 1 pavan 6:26 సా. వద్ద మార్చి 25, 2007

    సాహిత్యాభిమానులకు, సాహిత్య విద్యార్థులకు చాలా విలువైన సమాచారాన్ని అందిస్తున్నారు. అందుకు కృతజ్ఞతలు…ఈ శీర్షికను ఇలాగే కొనసాగించండి.

    అయితే, తర్వాతి సంచికలో ఏ విషయం పై వ్యాసాన్ని ఇస్తున్నారో అది ముందే తెలిపితే బాగుంటుంది అనుకుంటున్నాను.

  2. 2 కాజ సుధాకర బాబు 9:16 ఉద. వద్ద ఆగస్ట్ 18, 2007

    వెంకటేశ్వరరావు గారూ! నమస్కారం.

    మీ వ్యాసంలో ఎన్నో విషయాలు తెలిసాయి.

    ఈ వ్యాసంలోని విషయాలనూ, ఇంకా ఇలాంటి సాహిత్య విషయాలనూ మీరు తెలుగు వికీపీడియాలో http://te.wikipedia.org/wiki/ వ్రాస్తే మాకు చాలా సంతోషంగా ఉంటుంది. లేదా మీరు అనుమతిస్తే మేము వాటిని వికీపీడియాకు కాపీ చేస్తాము.

    మీవంటి వారు తెలుగు వికీలో పాలుపంచుకొంటే బాగుంటుందని అభ్యర్ధన. “తెలుగు సాహిత్య వేదిక” రచయితలందరికీ ఇదే విన్నపం. ఎందుకంటే ప్రస్తుతం నాలాంటి ఔత్సాహికులే (విషయం గురించి సరిగా తెలియనివారు) వికీపీడియాలో ఎక్కువ వ్యాసాలు వ్రాస్తున్నారు.

    సుధాకర బాబు

  3. 3 దార్ల 10:14 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2007

    సుధాకర్‌ బాబు గారు!

    నా వ్యాసం చదివి మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు ధన్యవాదాలు. సాహిత్య వాస్తవిక స్థితిగతులను పరిచయం చేయాలనే ఒక సంకల్పంతోనే తెలుగు సాహిత్య వేదికలో కొన్ని శీర్షికలు నిర్వహిస్తున్నారు. అందరికీ ఉపయోగపడాలనే ఆలోచనతోనే ఈ శీర్షికను నిర్వహించడానికి అంగీకరించాను. సాహిత్య పరిశోధక విద్యార్థుల బృందం తెలుగు సాహిత్య వేదికను నడుపుతున్నది. బహుశా వారి ఆశయం కూడా సాహిత్యాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలనేదే కావచ్చు. నేను రాసిన/రాసే వ్యాసాల వరకు వికీపీడియాలో ఉపయోగించుకోవడానికి నాకెలాంటి అభ్యంతరం లేదు. వికీపీడియాలో రాయాలనే మీ ఆహ్వానానికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సమయం వచ్చినప్పుడు నేను కూడా కొన్ని వ్యాసాలు రాయడానికి ప్రయత్నిస్తాను.

  4. 4 teluguhcu 10:21 ఉద. వద్ద ఆగస్ట్ 20, 2007

    మా ఆశయం కూడా ఖచ్చితంగా అదే! పై అభిప్రాయం తెలుగు సాహిత్య వేదిక ఆశయాన్ని నూరు శాతం ప్రతిఫలించేలా ఉంది.
    సుధాకర్‌ బాబు గారూ! దార్ల వెంకటేశ్వరరావు గారి వ్యాసాలే కాకుండా సాహిత్య వేదికలో ప్రకటించబడిన ఏ రచననయినా అందరికీ ఉపయోగపడుతుందంటే నిరభ్యంతరంగా వినియోగించుకోవచ్చు.

    — తెలుగు సాహిత్య వేదిక


వ్యాఖ్యానించండి




Telugutalli_image
మార్చి 2007
సో మం బు గు శు
 1234
567891011
12131415161718
19202122232425
262728293031  

మా పాఠకులు